ఆకుపచ్చని అడవి

Feb 22,2024 07:15 #Editorial

                అడవులు భూగోళపు ఊపిరితిత్తులు. అడవి చల్లగా ఉంటేనే మానవాళి భవిత భద్రంగా ఉంటుంది. కీకారణ్యమైనా, చిట్టడవియైనా, నాలుగు చెట్లు ఒకచోట ఉంటే భూగోళానికి చేసే మేలు ఇంత అంత కాదు! కానీ, అంతులేని లాభాపేక్షతో కార్పొరేట్లు అడవులను కబళించడానికి ఎప్పటికప్పుడు విరుచుకు పడుతుంటారు. తమ చెప్పుచేతల్లోని ప్రభుత్వాలతో అనుకూల చట్టాలను తయారుచేయించుకుంటారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశలో భారత అటవీ (సంరక్షణ) చట్టం 1980ని సవరించడానికి చేసిన ప్రయత్నానికి అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. కార్పొరేట్లకు కట్టబెట్టడమే లక్ష్యంగా గత ఏడాది అడవుల నిర్వచనాన్ని మారుస్తూ తీసుకువచ్చిన చట్ట సవరణను తాత్కాలికంగా నిలిపివేసింది. 1996లో వెలువరించిన టిఎన్‌ గోదావర్మన్‌ తిరుములపాడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో నిర్దేశించిన అటవీ నిర్వచనానికి అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆహ్వానించదగిన పరిణామం. నిఘంటవుల్లోని అర్థాన్ని అడవికి ప్రామాణికంగా తీసుకోవాలని ఈ తీర్పులో ధర్మాసనం పేర్కొంది. వర్గీకరణలు, యాజమాన్యాలతో సంబంధం లేకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అడవులుగా భావించే ప్రాంతాలను (డీమ్డ్‌ ఫారెస్ట్స్‌) గుర్తించడానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇన్ని కీలకమైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టే ఆ తీర్పును ఒక మైలురాయిగా భావిస్తారు.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1951 నుండి 75 వరకు దేశ వ్యాప్తంగా 40 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఆ నేపథ్యంలోనే భారత అటవీ (సంరక్షణ) చట్టాన్ని రూపొందించి 1980లో ఆమోదించారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇతర అవసరాలకు అటవీ భూమిని మళ్లించడం గణనీయంగా అదుపులోకి వచ్చింది. గతంతో పోలిస్తే 1981 నుండి 2022 వరకు అటవీ భూముల నిర్మూలన పదిశాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, చట్టంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని అడవుల నరికవేత కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని గూడలూరులో చోటుచేసుకున్న కలప అక్రమ నరికివేతకు సంబంధించి దాఖలైన టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమలనపాడ్‌ కేసులో అటవీ ప్రాంతాల రక్షణను ప్రధానంగా చేసుకుని సుప్రీం ఇచ్చిన తీర్పులో ‘అడవి’ని విస్తృతంగా నిర్వచించింది. ఇది కార్పొరేట్లకు ఆటంకంగా మారింది. ఈ నిబంధనలను మార్చాలన్న ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో వారి కనుసన్నల్లో నడిచే మోడీ ప్రభుత్వం గత ఏడాది ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన భూమిని మాత్రమే అడవిగా గుర్తిస్తూ అటవీ చట్టానికి సవరణ తీసుకు వచ్చింది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అడవుల పరిధిలోకి వస్తాయన్న భయంతో ప్రైవేటు వ్యక్తులు ప్లాంటేషన్లు, తోటలు పెంచడం లేదని తన చర్యను ప్రభుత్వం సమర్ధించుకుంది. వాతావరణ లక్ష్యాలను అందుకోవాలంటే ప్రైవేటు ప్లాంటేషన్ల భాగస్వామ్యం అవసరమని అడ్డగోలు వాదనకు దిగింది.

ప్రభుత్వం చేసిన సవరణతో దేశ వ్యాప్తంగా 1.99 లక్షల చదరపు కి.మీల భూమి అడవుల పరిధి నుండి బయటకు వస్తుందని అంచనా. మన రాష్ట్రంలోనూ వేల ఎకరాల అటవీ భూమికి రెక్కలు వస్తాయని అంటున్నారు. ఇప్పటికే యురేనియం తవ్వకాల పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అడవుల విధ్వంసం ప్రారంభమైంది. పర్యాటక ప్రాంతాల్లో భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వాలపై ఒత్తిడి ఎలానూ ఉంది. వీటన్నింటితో పాటు కేంద్ర సవరణ అమలులోకి వస్తే అటవీహక్కుల చట్టానికి పెద్ద ఎత్తున గండి పడే ప్రమాదం ఉంది. అత్యున్నత న్యాయస్థానంలో ఈ వాదనలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. ఆశాజనకమైన ఫలితం వచ్చినప్పటికీ అది మధ్యంతర తీర్పే! ప్రభుత్వం చేసిన సవరణను న్యాయస్థానం పూర్తిగా కొట్టివేయలేదు. అడవులను గుర్తిస్తూ రికార్డులు తయారు చేయడానికి ప్రభుత్వానికి గడువిస్తూ అంతవరకు పాత నిర్వచనం అమలులో ఉంటుందని పేర్కొంది. దీనర్ధం కార్పొరేట్‌ కత్తి వేలాడతూ ఉందనే! ఈ ప్రమాదాన్ని తిప్పికొట్టి, ఆకుపచ్చటి అడవులను పరిరక్షించుకోవడానికి ప్రజలను చైతన్యం చేయడం ఒక్కటే మార్గం.

➡️