Google : గూగుల్‌లో నిరసనగళం

Apr 18,2024 14:52 #Employees, #Google, #Lays Off
  • ఇజ్రాయిల్‌ ప్రాజెక్టుపై ఆందోళన
  • 28 మంది ఉద్యోగులపై వేటు
  • త్వరలో భారీగా ఉద్వాసనలు..!

న్యూయార్క్‌ : ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధ ఆందోళనలు తుదకు కార్పొరేట్‌ సంస్థలను తాకాయి. ఈ అంశంలో ఏకంగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రాజెక్టుపై ఆ సంస్థ ఉద్యోగులే నిరసనగళం ఎత్తారు. గూగుల్‌ ఉద్యోగులు కంపెనీ క్లౌడ్‌ సిఇఒనే ఎదురించడం విశేషం. ఇజ్రాయిల్‌తో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కాంట్రాక్ట్‌ ప్రాజెక్ట్‌ నింబస్‌ను వ్యతిరేకిస్తూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ కాంట్రాక్ట్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఇటీవల న్యూయార్క్‌, సన్నీవేల్‌లోని రెండు గూగుల్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు మంగళవారం గూగుల్‌ క్లౌడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) థామస్‌ కురియన్‌ కార్యాలయాన్ని 8 గంటల పాటు ముట్టడించి అక్కడి నుంచి కదిలేందుకు నిరాకరించారు. ఏకంగా రూ.10వేల కోట్ల ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఇజ్రాయెల్‌తో కంపెనీ చేసుకున్న ఒప్పందాలను వెంటనే నిలిపేయాలని కోరారు. నిరసనకు దిగిన ఉద్యోగులను ఆ కంపెనీ అరెస్ట్‌ చేయించింది. అనంతరం 28 మంది ఉద్యోగులను గూగుల్‌ తొలగించింది. అమెరికా దన్నుతో ఇతర దేశాలపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరటం చేయడం టెక్‌ కార్పొరేట్‌ చరిత్రలోనే విశేషం. ఆందోళనలో పాల్గొన్న ఉద్యోగులను అడ్మినిస్ట్రేటివ్‌ లీవ్‌లో ఉంచినట్లు కంపెనీ తెలిపింది. అయినా అక్కడి నుంచి ఏమాత్రం నిరసన విరమించుకోకపోవడంతో 28 మందిపై వేటు వేసినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతో గతంలో గూగుల్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ 1.2 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్ట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌.

మళ్లీ తొలగింపులు షురూ..
పొదుపు చర్యలు, కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా గూగుల్‌ మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించనుందని రిపోర్టులు వచ్చాయి. ఈ విషయాన్ని కంపెనీ సిఎఫ్‌ఒ రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు. ”కృత్రిమ మేధ (ఎఐ) వల్ల టెక్‌ రంగంలో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కఠిన నిర్ణయాలూ తీసుకోవాల్సి వస్తోంది. మన ప్రాధాన్యాలు ఏంటో గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలి. ఈ క్రమంలోనే ఫలితంగా నైపుణ్యం కొరవడిన కొంతమంది సిబ్బందిని బయటకు పంపాల్సి వస్తోంది.” అని సిఎఫ్‌ఒ తెలిపారు. కాగా.. ఎంత మందిని తొలగిస్తున్నారు?, ఎంత మందిని బదిలీ చేసేది వెల్లడించలేదు.

తోషిబాలో 5వేల మందిపై వేటు
పొదుపు చర్యల్లో భాగంగా జపాన్‌కు చెందిన తోషిబా 5వేల పైగా ఉద్యోగులపై వేటు వేయనుందని నిక్కీ నివేదించింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమానం కావడం ఆందోళన కలిగించే అంశం. టోక్యోకు చెందిన ఈ సంస్థ నాన్‌కోర్‌ వ్యాపారాలను తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిక్కీ నివేదించింది.

➡️