విఆర్‌ఎలకు సిఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి- పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Feb 20,2024 08:50 #Dharna, #MLC KS Lakshmana Rao, #VRA

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అధికారంలోకి రాగానే విఆర్‌ఎలకు రూ.15 వేలు వేతనం ఇస్తామన్న హామీని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకోవాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎల న్యాయమైన పోరాటానికి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఎపి విఆర్‌ఎ సంఘం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండోరోజు సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. విఆర్‌ఎలకు తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేలు వేతనాలు చెల్లించాలని, నామినీలను విఆర్‌ఎలుగా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వైసిపి పాలనలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు 99 శాతం అమలు చేశామని సిఎం జగన్‌ రాప్తాడులో జరిగిన ‘సిద్ధం సభలో’ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విఆర్‌ఎలకు వేతనం పెంపు, రికవరీ చేసిన డిఎ నగదును తిరిగి చెల్లించడం హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు మూడు, నాలుగు రెట్లు పెరిగాయని, చాలీచాలని వేతనాలతో బతుకుతున్న విఆర్‌ఎలు ఇతర పేదల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని లక్ష్మణరావు పిలుపునిచ్చారు.

విఆర్‌ఎల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. 2024 సాధారణ ఎన్నికల్లోపు విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించకుంటే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అటెండర్‌, వాచ్‌మెన్‌, రికార్డు అసిస్టెంట్‌, డ్రైవరు పోస్టుల్లో అర్హులైన విఆర్‌ఎలను నియమించకుండా కాలయాపన చేయడం తగదన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అంజి మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లుగా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అటెండర్‌, వాచ్‌మెన్‌, రికార్డు అసిస్టెంట్‌, డ్రైవరు పోస్టుల్లో అర్హులైన విఆర్‌ఎలను నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ బందిగి సాహెబ్‌ మాట్లాడుతూ ప్రమోషన్‌ సౌకర్యాలను 30 నుంచి 70 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు. రీ సర్వేల పేరుతో విఆర్‌ఎలపై మోపుతున్న అదనపు భారాన్ని తొలగించాలని టిఎ, డిఎలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. విఆర్‌ఎల డిమాండ్లను ఈ నెల 20వ తేదీలోపు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7న అధికారులకు, ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయమన్నారు. దీక్షలకు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బి ముత్యాలరావు మద్దతు ప్రకటించారు. దీక్షలో సంఘం నాయకులు రమేష్‌, అంజిబాబు, ప్రసాద్‌, మొగలాబి, నాగేంద్ర, నరేష్‌, రహిమాన్‌, త్రినాథరావు, రవిబాబు, వెంకట్రాములు, సాంబశివరావు, లక్ష్మణ్‌, శ్రీనివాసులు, నాగేషు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️