వేసవికి సిద్ధం అవుతున్నారా?

Feb 18,2024 07:05 #Jeevana Stories, #Summer
Getting ready for summer?

వేసవిలో పెరిగే వేడి నుంచి శరీరానికి కాస్తంత ఊరటనిచ్చే దుస్తులు ధరించడానికి అందరూ ఇష్టపడతారు. ఒకప్పుడు ఏ సీజన్‌లోనైనా నేత దుస్తులే వాడేవారు. ఇప్పుడు సీజన్‌కు దగ్గట్టుగా వస్త్రధారణ మారింది. వేసవి రానుండడంతో షాపుల్లో కాటన్‌ దుస్తుల లేబుళ్లు గుట్టలు గుట్టలుగా దిగుతున్నాయి. అన్ని వయస్సుల వారి అభిరుచులకు తగ్గట్టుగానూ, వారి ఆలోచనలకు అనుగుణమైన మోడళ్లు చూడ ముచ్చటగా ఉంటూ మార్కెట్లోకి అందుబాటులో కొచ్చేస్తున్నాయి. ప్రస్తుతం కాటన్‌ దుస్తుల సందడి నెలకొంది. సమ్మర్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు కాటన్‌కు సంబంధించిన రక రకాల వస్త్రాలను అమ్ముతున్నారు. చీరల దగ్గర నుంచి నైటీలు, కాటన్‌ షర్టులు, చిన్న పిల్లల దుస్తులు, బాబ్‌సూట్స్‌ వంటివి విక్రయిస్తున్నారు.

సరికొత్త మోడళ్లలో ఆకట్టుకునేలా …

మగవారికి, ఆడవాళ్లు ధరించేలా అనేక రకాల కాటన్‌ దుస్తులు అందుబాటు ధరల్లో ఉన్నాయి. బాతిక్‌ కాటన్‌, క్యాన్‌వాస్‌ కాటన్‌, క్రేప్‌కాటన్‌, డెనిమ్‌ కాటన్‌, టెర్రీకాటన్‌, గాజీ కాటన్‌, జిన్‌గమ్‌ కాటన్‌, జర్సీ కాటన్‌, మద్రాస్‌ కాటన్‌, లెనిన్‌ కాటన్‌ తదితర రకాల కాటన్‌ మెటీరియల్‌ను పురుషులు, చిన్నపిల్లల దుస్తులకు వాడుతుంటారు. బెంగాలీ కాటన్‌, జామ్‌దాని కాటన్‌, ఖాదీ కాటన్‌, స్పన్‌కాటన్‌, పోచంపల్లి, గద్వాల్‌ కాటన్‌, బెనారస్‌ కాటన్‌, బాతిక్‌ కాటన్‌, టెర్రీకాటన్‌, క్రేప్‌కాటన్‌ వంటివి మహిళలు ఉపయోగిస్తుం టారు.

చెమట నుంచి కాపాడేందుకు…

వేడిమి వాతావరణం నుంచి ఎంతో కొంత ఉపశమనం ఇవ్వటానికి కాటన్‌ దుస్తులు ఉపయోగపడతాయి. ఎండా కాలం వల్ల మన శరీరంలోంచి వెలువడే చెమటను కాటన్‌ క్లాత్‌ పీల్చుకుంటుంది. అప్పుడు అది గాలి తాకిడికి వెంటనే బయటకు వచ్చేస్తుంది. అన్ని వాతావరణాల్లోనూ మన శరీరాన్ని రక్షించే సత్తా కాటన్‌ వస్త్రాలకు ఉంది. వేసవిలో సింథటిక్‌, పాలిస్టర్‌ వంటి దుస్తులు మానేయటం మంచిది. ఈ కాలంలో అవి ధరిస్తే చర్మం దురదగా ఉంటుంది. కాటన్‌ చెమటను పీల్చి బయటకు పంపేయటం వల్ల చర్మం దురద లేదా చర్మ వ్యాధులు రావు.

స్పెషల్‌ ఫ్యాబ్రిక్‌ కాటన్‌ : ఇవి ఎండాకాలంలో చెమటను పీల్చుకుని శరీరానికి గాలి తగిలేలా చేస్తాయి. శరీరానికి దుస్తులు సౌకర్యంగా ఉంటాయి.

ఫ్యూర్‌ కాటన్‌ : ఇవి ఒంటికి చెమటను పీల్చి, చల్లదనాన్ని అందిస్తాయి. కాటన్‌ మిక్చర్‌ వస్త్రాల్లో ఈ సౌకర్యం ఉండదు.

ఈ జాగ్రత్తలు తీసుకొండి …

  • ఎండ బాగా ఎక్కువగా ఉంటే కాటన్‌ దుస్తులు ధరించటంతోపాటు గొడుగుతో వెళ్లటం మంచిది.
  • కూలింగ్‌ గ్లాసెస్‌ (కళ్లజోడు) వాడాలి.
  • వదులుగా ఉండే దుస్తుల ఎంపిక మంచిది.
  • వేసవిలో సన్నగా ఉండే జీన్స్‌, లెగ్గింగ్స్‌, టైట్‌ ప్యాంట్లు అసౌకర్యం కలిగిస్తాయి. చెమట వల్ల చర్మ సంబంధ సమస్యలూ రావొచ్చు.
  • మహిళలు ధరించేందుకు వీలుగా అన్ని రకాల వస్త్రాల్లోనూ చేనేతవి లభిస్తున్నాయి. వాటిని ఎంచుకోవడం మేలు. సింథటిక్‌, పాలిస్టరు వస్త్రాలను పూర్తిగా దూరం పెట్టటం మంచిది.
  • మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. ఈ జాగ్రత్తలు అన్నిటి ద్వారా ఒక 30 శాతం వేసవి ఇబ్బందులను తగ్గించుకోవొచ్చు.

నకిలీలతో జాగ్రత్త

  • ప్రస్తుత పోటీ ప్రపంచంలో నకిలీ దుస్తులు కూడా మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఏది అసలో, ఏది నకిలీయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏదో ఒకటిలే.. కాటనే కదా అని కొనేస్తే తర్వాత వాటిని ధరించేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల దుస్తుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
➡️