పచ్చి మితవాద పార్టీ ఎన్‌పిడికి నిధులు కట్‌ 

Jan 24,2024 10:51 #Germany
german-court-cuts-funding-to-radical-right-party-npd-popular-outfit-afd

జర్మనీ కోర్టు రూలింగ్‌

కార్ల్‌సృహె  (జర్మనీ) : పచ్చి మితవాద పార్టీ అయిన నేషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎన్‌పిడి)కి ఇకపై ప్రభుత్వ నిధులు అందవని జర్మనీ కోర్టు తీర్పు చెప్పింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడానికి లేదా మొత్తంగా నిర్మూలించడానికి ఎన్‌పిడి, ఆ పార్టీ అధ్యక్షుడు డై హీమట్‌ లక్ష్యంగా చేసుకున్నారంటూ న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రాడికల్‌ పార్టీలకు ప్రభుత్వ నిధులు అందకుండా నివారించేలా జర్మనీ చట్టంలో మార్పులు తీసుకువచ్చిన తర్వాత ఎన్‌పిడికి ప్రభుత్వ నిధులు అందకుండా కోత విధించాలంటూ జర్మనీ పార్లమెంట్‌, ప్రభుత్వం 2019లో కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో పచ్చి మితవాద ఎన్‌పిడి పార్టీకి ప్రభుత్వ నిధుల్లో జర్మనీ కోత విధించవచ్చని రాజ్యాంగ కోర్టు మంగళవారం పేర్కొంది. దీంతో జాతీయవాద ఆల్టర్‌నేటివ్‌ ఫర్‌ జర్మనీ (ఎఎఫ్‌డి) పార్టీకి కూడా శిక్ష విధిస్తారా లేదా అనే చర్చకు ఈ రూలింగ్‌ ఆజ్యం పోసింది. ఎన్‌పిడి, అడాల్ఫ్‌ హిట్లర్‌ నాజీ పార్టీని పోలి వుందంటూ 2017లోనే కోర్టు పేర్కొంది. అయితే ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించేంత బలంగా లేదని అందువల్ల నిషేధించరాదని నిర్ణయించింది. ప్రధాన స్రవంతిలోని రాజకీయ నేతల మధ్య పోరు కావడంతో ఈ రూలింగ్‌ను అందరూ నిశితంగా పరిశీలిస్తున్నారు. తాజాగా కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులకు ప్రభుత్వ నిధులు అందవని ఒక సంకేతం పంపినట్లైందని హోం మంత్రి నాన్సీ ఫాజర్‌ వ్యాఖ్యానించారు.

➡️