గిరిజన బాలికపై గ్యాంగ్‌ రేప్‌

Dec 2,2023 09:40 #Gang Rape, #tribal girl

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : ప్రేమ పేరుతో గిరిజన బాలికను నమ్మించి.. ఓ ఆటోడ్రైవర్‌ తన మిత్రులతో కలిసి గురువారం రాత్రి గ్యాంగ్‌ రేప్‌ చేసిన ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. బింగినపల్లి గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. తమ కుమార్తెను అమ్మమ్మ ఇంటి వద్ద విడిచి వెళ్లారు. అమ్మమ్మ, బాలిక కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేవారు. అదే గ్రామానికి చెందిన ప్రతాప్‌ అనే ఆటో డ్రైవర్‌ ప్రేమ పేరుతో బాలిక వెంటపడేవాడు. ఆ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఆ బాలికకు ప్రతాప్‌ ఫోన్‌ చేశాడు. మాట్లాడాలని నమ్మించి, గ్రామ సచివాలయం వద్దకు తీసుకెళ్లాడు. తన మిత్రులైన వలంటీర్‌ హరి, రామారావులను కూడా సచివాలయం వద్ద ఉన్న డంపింగ్‌ యార్డు వద్దకు రావాలని ప్రతాప్‌ చెప్పాడు. బాలికను అక్కడికి తీసుకెళ్లి ముగ్గురూ గ్యాంగ్‌ రేప్‌ చేశారు. జరిగిన విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పారు. గ్రామ పెద్దలు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రతాప్‌, హరి, రామారావును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

➡️