పౌర్ణమి – అమావాస్య

Jan 14,2024 09:21 #Children, #Sneha
Full Moon - New Moon

బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఒక పల్లెలో ఉన్న రంగడికి చేపలు పట్టడం అంటే మహా సరదా. రోజులాగే ఆ రోజూ ఉదయాన్నే పడవ వేసుకొని సముద్రంపైకి బయల్దేరాడు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో బాగా సముద్రం లోపలికి వెళ్ళాడు. వేట ఉత్సాహంగా సాగుతోంది. ఇలా ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షం క్రమేపీ పెద్దది కాసాగింది. చీకటి పడింది. పడవ అదుపు తప్పి, సముద్రం లోపలి వైపుకి పోసాగింది. తెల్లారేసరికి మరో తీరం చేరింది.

తీరం కనిపించగానే రంగడికి ధైర్యం వచ్చింది. దిగి పడవను గట్టుకి లాగి, ఓ చెట్టుకి పెట్టేశాడు. తినటానికి పండ్లు, కాయలు ఏమైనా దొరుకుతాయేమోనని దీవిలో కొంచెం ముందుకు వెళ్ళాడు. దొరికిన కాయలు తీసుకొని, తిరిగి పడవవైపు నడక సాగించాడు. కానీ అప్పటికే రంగడిని గమనించిన కొందరు ఆటవికులు రంగడుని శత్రువుగా భావించి, అతనిని చుట్టుముట్టి బంధించారు. తీసుకెళ్లి గూడెం దొర ముందు నిలబెట్టారు.

దొర రంగడిని ఎగాదిగా చూసి భయంకరంగా నవ్వాడు. అతని వికటాట్టహాసానికి రంగడికి గుండెలు అదిరిపోయాయి.

‘వీడిని తీసుకెళ్లి రాతి ఇంట్లో ఉంచండి. కావాల్సిన తిండి, నీళ్లు ఇవ్వండి..’ ఆజ్ఞాపించాడు గూడెం దొర. ఇద్దరు ఆటవికులు రంగడి రెక్క పుచ్చుకుని, లాక్కెళ్లి ఒక ఇంట్లో వేశారు. తినడానికి పండ్లు, తేనే ఇచ్చారు. ఆకలితో వున్న రంగడు వాటిని ఆవురావురంటూ తిన్నాడు. పది రోజులు గడిచిపోయాయి. తిండికి, నిద్రకు లోటు లేకున్నా, ఇలా ఎంతకాలం ఉండాలో తెలియని రంగడికి దిగులు పట్టుకుంది.

*********************************

‘నన్ను ఎప్పుడు వదిలేస్తారు?’ అని అడిగాడు రంగడు. దానికి ఆటవికుడు గలగల నవ్వేస్తూ.. ‘వచ్చే పౌర్ణమి రోజున నిన్ను కొండ దేవతకు బలిస్తారు’ అని చెప్పాడు. ఆ మాట వినగానే రంగడికి ఒళ్ళు జలదరించింది. ఎలాగైనా ఈ చావు నుండి బయటపడాలని ఆలోచించసాగాడు.

పౌర్ణమి రానే వచ్చింది. పొద్దున్నే తీసుకెళ్లి రంగడికి స్నానం చేయించారు. శరీరమంతా పసుపు రాసి, నడుము చుట్టూ జంతు చర్మాలు చుట్టారు. మెడనిండా పూలతో అలంకరించారు. కొండ దేవత విగ్రహం ముందుకు తీసుకొచ్చి, బలి ఇచ్చే వేదిక పక్కన రాతి స్తంభానికి కట్టేశారు. తీవ్రంగా ఆలోచిస్తున్న రంగడి బుర్రలో తళుక్కున ఒక ఉపాయం మెరిసింది. వెంటనే భయంకరంగా తల ఊపుతూ, ‘ఒరేయ్ గూడెం దొరా..! ఈ బలి కార్యక్రమం ఆపు’ అంటూ బిగ్గరగా అరిచాడు. అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. గూడెం దొర ఈటె అందుకొని కోపంగా రంగడిని సమీపించాడు. వెంటనే రంగడు.. ‘నా బిడ్డని బలి ఇవ్వడానికి నీకెన్ని గుండెలురా బలి ఇచ్చావంటే నీ అంతు చూస్తాను. నేను సముద్ర దేవతను. నా బిడ్డను వదిలేయకపోతే ఈ దీవిని ముంచి వేస్తాను. కావాలంటే వెళ్లి చూడు. ఇప్పటికే నేను ఆవేశంగా, భయంకరంగా అరుస్తూ నీ దీవి వైపు పరుగు తీస్తున్నాను’ అన్నాడు. ఆ మాటతో ఆగిన దొర నలుగురు ఆటవికులను వెంటబెట్టుకొని సముద్ర తీరానికి వెళ్ళాడు. భయంకరమైన శబ్దంతో పెద్ద ఎత్తున ఎగిసిపడుతూ తీరం వైపు వస్తున్న అలలను చూడగానే దొరకి భయం పుట్టింది. గబగబా తిరిగి వచ్చి, రంగడి కాళ్ళ మీద పడి కాపాడమని వేడుకున్నాడు.

‘ఇప్పటికిప్పుడు నా కోపం చల్లారదు. మరో రెండు వారాల పాటు నా బిడ్డకు మర్యాదలు చేయండి.ఆ తర్వాత మీరు ఏమి చేయాలో చెబుతాను..’ అంటుంది. రంగడి కట్లు విప్పి, తనతో తన ఇంటికి తీసుకెళ్లి, సకల మర్యాదలతో పూజిస్తారు. రెండు వారాలు కాగానే తిరిగి, కొండ దేవత దగ్గరకు తీసుకు వస్తారు. ‘అమ్మా సముద్ర దేవతా.. మాపై కోపం చల్లారిందా..?’ అని అడిగాడు దొర. వెంటనే రంగడు పూనకం వచ్చినట్లు నటిస్తూ.. ‘ఒరేరు.. గూడెం దొరా తప్పు తెలుసుకొని, నా బిడ్డను బాగా చూసుకున్నావు. నేను సంతోషించాను. వెళ్లి చూడు నేను శాంతించాను..’ అన్నాడు. దొర వెళ్లి, సముద్రాన్ని చూశాడు. సముద్రం ప్రశాంతంగా ఉంది. ఎత్తుగా ఎగిసిపడే అలలు లేవు. చెవులు హోరెత్తించే శబ్దం లేదు. సంతోషంగా తిరిగి వచ్చాడు. రంగడిని సముద్ర దేవత బిడ్డగా నమ్మాడు. రంగడి పడవకు మరమ్మతులు చేయించి, కానుకలిచ్చి సాదరంగా సాగనంపాడు.

తను బడిలో చదువుకొనేటప్పుడు గురువుగారు చెప్పిన, ‘పౌర్ణమినాడు సూర్య చంద్రుల గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉన్నప్పుడు సముద్రంలోని అలలు భయంకరమైన శబ్దం చేస్తూ ఉవ్వెత్తున తీరం వైపుకు వస్తాయని, అమావాస్య రోజున గురుత్వాకర్షణ వ్యతిరేక దిశలో ఉన్నందున అలల ఎత్తు తగ్గి శబ్దం కూడా తగ్గుతుంది..’ అనే పాఠం గుర్తుకొచ్చింది. అలా ఆపద నుండి తప్పించుకున్నాడు. పడవలో ప్రయాణం చేస్తూ గురువుగారిని గుర్తుకు తెచ్చుకొని, మనసులోనే ఆయనకు కృతజ్ఞలు తెలియజేశాడు. రెండు రోజుల తర్వాత తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. తప్పిపోయిన రంగడు తిరిగి రావడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

 

– కైపు ఆదిశేషారెడ్డి, 99857 14281

➡️