Summer: ఎండల్లో పండ్లు, పండ్ల రసాలే మేలు

Mar 18,2024 06:30 #feachers, #jeevana, #juice, #Summer

వేసవిలో ఒంట్లోని శక్తి వేగంగా హరించుకుపోతుంది. ఈ సీజన్‌లో లభించే పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే ఎంతోకొంత ఉపశమనం పొందొచ్చు. పండ్లుగా తినటమే కాకుండా రసాలు (జ్యూసులు)గా కూడా తీసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది.
బొప్పాయి, జామ, ఆపిల్‌, ద్రాక్ష, మామిడి, పుచ్చకాయ వంటివి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. పండ్లలో బెటాకెరోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌-సి, పొటాషియం, విటమిన్‌-బి కలిగివుండటం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. మంచి ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడతాయి. పుల్లని నిమ్మ, నారింజ పండ్లలో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. పండ్లుగానూ, జ్యూస్‌లుగానూ కూడా వీటిని తీసుకోవచ్చు. అయితే, జ్యూస్‌ కన్నా పండ్లను నేరుగా తీసుకోవటం మంచిది. పండ్లలో ఎక్కువ శాతం విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్లు, ఫ్లావానోయిడ్స్‌ ఉంటాయి. జ్యూస్‌ చేసేటప్పుడు తొక్కను తీసేస్తుంటాం. అలాంటప్పుడు వాటిలో ఉండే ఫైబర్‌, మినరల్స్‌, విటమిన్స్‌ తగ్గిపోతాయి. పండ్లను తీసుకోవటం ద్వారా శరీరంలో షుగర్‌ శాతం పెరగకుండా ఉంటుంది. పీచు శాతం ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి గ్యాస్ట్రిక్‌ తగ్గిస్తుంది. పండ్ల రసాల్లో పీచు పదార్థం లేకపోవటంతో త్వరగా జీర్ణం అయ్యి, రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. పండ్ల రసం కన్నా పండ్ల వల్ల వచ్చే కేలరీలు తక్కువగా ఉంటాయి. జ్యూస్‌లో వాడే చక్కెర వల్ల కేలరీలు పెరిగి, అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫాయిటో స్టేరోల్స్‌, ఫ్లావనోయిడ్స్‌ వంటివి శరీర ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి.


ఈ కాలంలో లభించే పండ్లు – ఉపయోగాలు
పుచ్చకాయ : వేసవిలో ప్రత్యేకంగా దొరికే పుచ్చకాయల్లో నీటిశాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకుంటే డీహైడ్రేషన్‌ సమస్య తగ్గుతుంది.
పచ్చి మామిడి రసం : పచ్చి మామిడిని కూడా ముక్కలుగా కోసి తినొచ్చు. లేదా మిక్సీలో వేసి రసంలా చేసి తాగొచ్చు. ఇది కూడా వేసవి తాపాన్ని తగ్గించేసి శరీరానికి శ క్తినిస్తుంది. టిఫిన్‌ లేదా భోజనం ఒకవేళ ఆలస్యమైనా రోజంతా అలసట రాకుండా ఉంటుంది.


మ్యాంగో లస్సీ : ఇప్పుడిప్పుడే మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. పండ్ల నుంచి రసాన్ని తీసి లస్సీలా కూడా తాగేయొచ్చు. ఇది నార్మల్‌ లస్సీ కంటే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. పెరుగు కూడా కలుపుకోవచ్చు. ఈ రెండింటి కలయిక అద్భుతంగా ఉంటుంది.


నిమ్మ నీరు : ఎండాకాలంలో తప్పకుండా నిమ్మరసం తీసుకోవాలి. ఈ రసాన్ని నీటిలో పిండి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార వేసి షర్బత్‌లా తీసుకోవచ్చు. తక్షణ శక్తిని, తాజాదనాన్ని పొందొచ్చు.


కొబ్బరి బోండాం : వేసవిలోనే కాదు, ఎప్పుడూ ఆరోగ్యకరమైన పానీయం కొబ్బరి నీరు. వేసవి తాపాన్ని తట్టుకోవటానికి రోజుకు ఒక గ్లాస్‌ కొబ్బరినీటిని తీసుకుంటే మంచిది. దీనివల్ల అందులోని ఎలక్ట్రోలైట్స్‌ మన శరీరానికి అందుతాయి.
చెరకు రసం : చెరకు రసంతో తక్షణ శక్తి లభిస్తుంది. వేడికారణంగా అలసిన శరీరానికి దీనివల్ల ఉపశమనం లభిస్తుంది.

➡️