కేజ్రీవాల్‌ను పరీక్షించేందుకు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయండి

  • అవసరమైన వైద్యాన్ని అందించాలి
  • జైలు అధికారులకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను పరీక్షించేందుకు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన హెల్త్‌ పిటిషన్‌ను కొట్టేసింది. కేజ్రీవాల్‌కు అవసరమైన వైద్యాన్ని జైలులో అందించాలని జైలు అధికారులకు సిబిఐ స్పెషల్‌ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశించారు. డయాబెటిక్‌ వైద్యం కోసం ప్రతిరోజూ 15 నిముషాలపాటు వర్చువల్‌గా డాక్టర్‌ కన్సల్టేషన్‌, ఇన్సులిన్‌ తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్‌ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్‌ షుగర్‌ లెవెల్స్‌ సాధారణంగానే ఉన్నాయని, డాక్టర్లు సూచించిన డైట్‌ అందిస్తున్నామని, అరెస్టుకు ముందే కేజ్రీవాల్‌ ఇన్సులిన్‌ తీసుకోవడం ఆపేశారని తీహార్‌ జైలు అధికారుల వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో జైలులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక సంప్రదింపులు అవసరమైతే, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఏర్పాటుచేసే మెడికల్‌ బోర్డును సంప్రదించాలని తీహార్‌ జైలు అధికారులకు కోర్టు సూచించింది. ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ అందించడంపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఆయనకు డైట్‌, వ్యాయామ ప్రణాళికను మెడికల్‌ బోర్డు నిర్దేశిస్తుందని వెల్లడించింది.
అప్పటి వరకు ఇంటి భోజనం
వైద్యపరంగా సూచించిన డైట్‌లో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. మెడికల్‌ బోర్డు సూచించిన ఆహారం ప్రకారం… కేజ్రీవాల్‌ ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవచ్చని స్పష్టం చేసింది. మెడికల్‌ బోర్డు కేజ్రీవాల్‌కు డైట్‌ను సూచించే వరకు, కేజ్రీవాల్‌కు ఇంటి భోజనం అందించవచ్చని పేర్కొంది. ఈ ఆహారం పిటిషనర్‌ వ్యక్తిగత వైద్యులు సూచించిన డైట్‌ చార్ట్‌, ఏప్రిల్‌ 1న కోర్టు ఆదేశాల ప్రకారం ఉండాలని పేర్కొంది. కేజ్రీవాల్‌ డైట్‌ పాటించని పక్షంలో కోర్టు దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించింది. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదా? అనే దానిపై తన నివేదికను త్వరగా సమర్పించాలని ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డుకు సూచించింది. భవిష్యత్తులో ఏదైనా నిపుణుడి ద్వారా కేజ్రీవాల్‌కు వైద్యపరమైన చికిత్స అవసరమైతే, ఈ విషయంలో జైలు అధికారులు మెడికల్‌ బోర్డుతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

➡️