అణగారిన వర్గాల కోసం..

Apr 5,2024 02:30 #artical, #edit page, #jagjeevanram

దేశ ఉప ప్రధానిగా, రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన జీవితాన్ని ప్రజా సంక్షేమానికి అంకితం చేసిన మహనీయుడు బాబూజీ జగ్జీవన్‌ రామ్‌. 1908 ఏప్రిల్‌ 5న బీహార్‌ లోని షహబార్‌ జిల్లాలో చందవా గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించాడు జగ్జీవన్‌ రామ్‌. అర్రా అనే పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. ఇక్కడే అంటరానితమనే వివక్షతను ఎదుర్కొన్నాడు. తరగతి గదిలో అందరికీ ఒకే నీటి కుండను ఏర్పాటు చేయడంలో విజయవంతం అయ్యాడు. జగ్జీవన్‌ రామ్‌ రాజకీయ జీవితం విద్యార్థి దశ నుండే ప్రారంభమైంది. గాంధీజీ సిద్ధాంతాలచే ప్రభావితుడై 1936లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ విధంగా 50 సంవత్సరాల పాటు భారత రాజకీయాలలో చురుకుగా పాల్గొని దేశ సేవకు అంకితమయ్యాడు. శాసనోల్లంఘన ఉద్యమంలో, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయి జైలు జీవితం గడిపాడు. 1936లో బీహార్‌ శాసనసభకు నామినేట్‌ అయిన తర్వాత అణగారిన తరగతుల లీగ్‌ టికెట్‌పై షహాబాద్‌ అసెంబ్లీ స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, సహకార పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యాడు. 1946 ఆగస్టు 30న నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో చేరిన మొదటి దళితుడయ్యాడు. నెహ్రూ మంత్రివర్గంలో అతి చిన్న వయసులో మంత్రిగా కార్మిక శాఖ చేపట్టాడు. కార్మిక శాఖ మంత్రిగా అనేక కార్మిక సంక్షేమ చట్టాలను ప్రవేశపెట్టాడు. రాష్ట్ర ఉద్యోగుల బీమా చట్టం, ప్రావిడెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసి కార్మికుల జీవితాలకు భరోసా కల్పించాడు. రైల్వే మంత్రిగా రైల్వే ఉద్యోగులకు అనేక సంక్షేమ చట్టాలను ప్రవేశపెట్టాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా కరువు నివారణ చర్యలు చేపట్టి హరిత విప్లవాన్ని ప్రోత్సహించాడు. ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆహారధాన్యాలు చేరేలా చర్యలు తీసుకున్నాడు. రాజ్యాంగ పరిషత్‌ సభ్యునిగా అణగారిన వర్గాల అభ్యున్నతికి అనేక రక్షణ చర్యలను ప్రతిపాదించాడు. సమాజంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను రూపకల్పన చేసి ప్రభుత్వ ఉద్యోగాలు, శాసనసభలలో రిజర్వుడు స్థానాలను కేటాయించాలని పోరాడాడు. 78 సంవత్సరాల వయసులో లోక్‌సభ సభ్యునిగా ఉండగానే 1986 జులై 6న కన్నుమూశారు.

– డా|| కె. బడే సాహెబ్‌,
చరిత్ర అధ్యాపకులు, సెల్‌: 9440852697

➡️