జానపద కళలను పరిరక్షించుకోవాలి- ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గొమాంగో

Jan 8,2024 08:09

ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం) :పాశ్చాత్య ప్రభావంతో మరుగునపడిపోతున్న జానపద కళలను పరిరక్షించుకోవాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గొమాంగో అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయిలో గిడుగు రామ్మూర్తి తెలుగుభాష జానపద కళాపీఠం, బద్రి అప్పన్న స్మారక పీఠం 20వ వార్షికోత్సవ కళా జాతరను ఆదివారం నిర్వహించారు. పియానో, డోలక్‌, డప్పు ఇతర పరికరాలను స్వయంగా వాయించి గొమాంగో ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి పల్లెపాటలు పలు వాయిద్యాలతో వాయిస్తూ జానపద సాహిత్యాన్ని గ్రామాల్లో వినిపించేవారని గుర్తుచేశారు. అటువంటి వాటిని బతికించి భావితరాలకు అందజేసేందుకు ఈ సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రకృతి నుంచి వచ్చే నాదాలే సంగీత వాయిద్యాలకు మాతృక అని అన్నారు. జానపద కళల ఔన్నత్యం, వాటి విశిష్టతను రచయిత కృష్ణారెడ్డి వివరించారు. కళింగసీమ సాహిత్య సంస్థ అధ్యక్షులు సన్నశెట్టి రాజశేఖర్‌, శాస్త్రీయ నృత్య కళాకారిణి నిర్మలాదేవి, జానపద గాయకురాలు సోమిశెట్టి సరళ జానపద కళల విశేషాలను పంచుకున్నారు. గంగిరెద్దులు, సన్నాయి, తప్పెటగుళ్ల ప్రదర్శన, జానపద, సినీ, ఉద్దానం గీతాలు, కోలాటం ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం మాజీ సిఎం గిరిధర్‌ గొమాంగోతోపాటు ప్రదర్శనలు చేసిన కళాకారులను సత్కరించారు. తెలుగుభాష గొప్పతనం అంశంపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కళాపీఠం ప్రతినిధులు బద్రి కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

➡️