మాక్లూరు వరుస హత్యల ఘటనలో ఐదుగురు నిందితుల అరెస్టు

Dec 19,2023 15:05 #press meet, #sp sindu

కామారెడ్డి: తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. నిందితుల వద్ద కారు, బైక్‌, ఐదు సెల్‌ఫోన్లు, రూ.30 వేల నగదు, భూమి రిజిస్ట్రేషన్‌ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదాశివనగర్‌ పీఎస్‌లో కేసు ఆధారంగా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.’ నవంబర్‌ 29న మాక్లూర్‌ మండలంలో ప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రశాంత్‌, వంశీ, విష్ణు అనే ముగ్గురు కలిసి ప్రసాద్‌ను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. అక్కడే మఅతదేహాన్ని పూడ్చిపెట్టారు. ప్రసాద్‌ జైలులో ఉన్నాడని ఆయన్ను కలుద్దామని చెప్పి.. ఈ నెల 1న ఆయన భార్య శాన్వికను ప్రశాంత్‌ నిజామాబాద్‌ తీసుకెళ్లాడు. బాసర వంతెన వద్ద ముగ్గురూ కలిసి ఆమెను చంపేసి గోదావరిలో పడేశారు. అదే రోజున అతడి చెల్లి శ్రావణిని సైతం తీసుకెళ్లారు. మెదక్‌ జిల్లా వడియారం వద్ద ఆమెను చంపి తగులబెట్టారు.ప్రసాద్‌ వద్దకు వెళ్దామని చెప్పి ఆయన తల్లి, పిల్లలు, మరో చెల్లిని కూడా ప్రశాంత్‌ తీసుకెళ్లాడు. వారిని నిజామాబాద్‌ లాడ్జిలో ఉంచారు. డిసెంబర్‌ 4న తమ్ముడితో కలిసి ప్రసాద్‌ పిల్లలను ప్రశాంత్‌ చంపేసి.. మెండోర వద్ద సోన్‌ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారు. డిసెంబర్‌ 13న మరో చెల్లి స్వప్నను సదాశివనగర్‌ మండలం భూంపల్లి వద్ద చంపి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. కుటుంబ సభ్యులు రాకపోవడంతో ప్రసాద్‌ తల్లి సుశీల లాడ్జి నుంచి పారిపోయింది” అని సింధూశర్మ వివరించారు. ఆమె కోసం వచ్చిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద ప్రశాంత్‌, మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రసాద్‌ కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రశాంత్‌ వద్ద లభించాయని, ఇప్పటి వరకు 4 మృతదేహాలు లభించగా.. ప్రసాద్‌, ఆయన భార్య మృతదేహాలు లభ్యం కాలేదని ఎస్పీ వివరించారు.

➡️