ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం : సీసీ టీవీ దృశ్యాలు విడుదల

విశాఖ : ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం కేసులో … పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. అగ్ని ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు హార్బర్‌లోని పరిస్థితులను తెలియజేసే సీసీ టీవీ దృశ్యాలను విడుదల చేశారు. ఈ దృశ్యాల్లో ఇద్దరు వ్యక్తులు బోట్ల వద్ద నుంచి బయటకి వస్తున్నట్లు స్పష్టంగా ఉంది. ఈ దృశ్యాల ఆధారంగా ఈనెల 19 రాత్రి 10.50 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాలతో మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు విశాఖ పోలీసు కమిషనరేట్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ సీసీ కెమెరా ఫుటేజ్‌ వైరల్‌ అవుతోంది.

యూట్యూబర్‌ నాని స్పందన…     ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్‌ లోకల్‌ బాయ్ నాని కూడా స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని.. ఘటన జరిగిన రోజు తనకు బోట్లు తగలబడుతున్నట్టు ఫోన్‌ రావడంతో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా తాను హార్బర్‌కు వెళ్లానని.. తాను అక్కడికి వెళ్లే సమయానికి బోట్లు తగలబడుతున్నాయని చెప్పారు. తాను హార్బర్‌కు వెళ్లేదంతా సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డ్‌ అయ్యిందని తెలిపారు. ప్రమాదాన్ని వీడియో తీయటం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పటానికి మాత్రమే అన్నారు.తాను ప్రమాద సమయంలో వీడియోలు తీస్తుండగా.. తనను కొందరు కొట్టే ప్రయత్నం చేశారన్నారు. వీడియో తీసి పోస్ట్‌ చేసిన తర్వాత పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చిందని అన్నారు. పోలీస్‌ విచారణ కోసం రావాలని కోరటంతో వెళ్లానని తెలిపారు. తాను బోట్లు తగలబెట్టానంటూ తనపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపించారు. ప్రమాదం జరిగే సమయంలో తాను ఓ హోటల్లో ఉన్నానని.. ఆ హోటల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లో తాను ఉన్నానని తెలిపారు. తాను ఈ బాధను ఇప్పుడు చెబుతున్నానని.. లేదంటే ప్రజలు కూడా తానే ఈ ప్రమాదం చేశాను అని అనుకుంటారన్నారు. తనకు అస్సలు ఏం తెలియదని.. అన్ని రికార్డులు కూడా పోలీస్‌ స్టేషన్లోనే ఉన్నాయన్నారు. తన ఫోన్‌ ట్రాకింగ్‌, తాను ఎక్కడకి వెళ్లాను అన్నీ కూడా వాళ్ల దగ్గర ఉన్నాయని.. తాను ఏం తప్పూ చేయలేదన్నారు. హైకోర్టులో తనకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉందన్నారు నాని.

ఈనెల 19న రాత్రి…  ఈ నెల 19న రాత్రి ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 49 బోట్లు కాలిపోయాయి.. దీంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం బాధితులకు సాయం అందించింది.. అలాగే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా తనవంతుగా శుక్రవారం మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు.

➡️