చేప మంచితనం

Apr 14,2024 13:26 #Sneha

సుందరవనంలోని కొలను వద్దకు రెండు కొంగలు వచ్చాయి. అందులో ఒకటి పెద్ద కొంగ. మరొకటి చిన్న కొంగ. ఆ కొలనులోని ఒక పెద్ద చేప ఆ పెద్ద కొంగకు చిక్కింది. అప్పుడు ఆ పెద్ద చేప కొంగతో ‘ఓ కొంగా! నేను అనుకోకుండా నీకు చిక్కాను. నీ పేరేమిటి?’అని అడిగింది. అప్పుడు ఆ కొంగ ‘నా పేరు బకము. ‘మరి నీ పేరు’ అని అడిగింది ఆ బకము. ‘నా పేరు ఝషము’ అని అంది ఆ పెద్ద చేప. వెంటనే అక్కడే ఉన్న చిన్న కొంగ ‘అయ్యో మిత్రమా! ఈ చేపను నీవు వదలిపెట్టు. నీ తల్లి ఒకరోజు ఇక్కడికి వచ్చి గాయపడితే ఈ పెద్ద చేప దానికి సాయం చేసింది. అందుకే నీ తల్లి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ చేపనైనా పట్టుకో! కానీ నాకు సాయం చేసిన ఝషమును మాత్రం పట్టుకోకని అంది. ఆ సంగతి నీవు మరిచావా!’అని అడిగింది. అప్పుడు ఆ బకము ‘ ఔను మిత్రమా! నీవు సమయానికి నాకు గుర్తు చేశావు. మా అమ్మ ఇది పరోపకారి అని నాకు చెప్పింది. తన ప్రాణాలు ఇదే కాపాడిందట. మనకు సాయపడిన ఇలాంటి దాన్ని మనం చంపకూడదు. మిగతా చిన్న చేపలు ఈ మడుగులో చాలా ఉన్నాయి. దీనిని విడిచిపెట్టి వాటిని పట్టుకుంటాను’ అని ఆ ఝషమును వదలిపెట్టింది. అప్పుడు ఆ ఝషము సంతోషంతో ‘ నీవు నా ప్రాణాన్ని కాపాడావు. అందువల్ల నీవు ఇకనుండి నా మిత్రుడవు. నీ గొప్పతనం గురించి అన్నింటికీ చెబుతాను’ అని అది అక్కడి నుండి నీటి లోకి వెళ్లి పోయింది.
ఆ తర్వాత ఆ కొంగకు మళ్ళీ ఒక చేప చిక్కింది. అప్పుడు ఆ ఝషము తిరిగి వచ్చి ‘కొంగ మిత్రమా! అది నీవలెనే నాకు మిత్రుడు. నేను మీ అమ్మ ప్రాణం కాపాడినట్లే గతంలో ఇది నాకు సాయం చేసింది. అందువల్ల దీనిని కూడా వదలిపెట్టు. నీకు అంతగా ఆకలిగా ఉంటే దీన్ని బదులుగా నన్ను తిను. దానిని మాత్రం చంపకు !’అని అంది. అప్పుడు ఆ పెద్ద కొంగ ‘ఇదేమిటి? నిన్ను చంపకుండా వదిలిపెడితే నీ మిత్రుని కూడా చంపవద్దని అంటున్నావు. ఇదెక్కడి న్యాయం ?’ అని అంది. అప్పుడు ఆ చేప ‘నీకు కడుపునిండాలి అంతేగా! ఒక్క నన్ను తింటే నీ కడుపు నిండదా! దానినే తినాలా!’అని ప్రశ్నించింది. దాని బాధపడలేక కొంగ ‘సరే ! నీ మిత్రుని కూడా వదిలిపెడుతున్నాను !’అని ఆ చేపను కూడా వదిలిపెట్టింది. రెండూ నీళ్లలోకి వెళ్ళిపోయాయి.
ఆ తర్వాత ఆ కొంగకు మరొక చేప లభించింది. అప్పుడు మళ్లీ ఆ ఝషము పైకి వచ్చి ‘అయ్యో కొంగా! అది నా బిడ్డ. నా ముందు నా బిడ్డ చనిపోవడం నాకు ఇష్టం లేదు . నీవు నన్ను మొదటగా తిని తర్వాత నా బిడ్డను చంపు’ అని అంది. అది విన్న ఆ కొంగ ‘నీతోని భలే చిక్కు వచ్చిపడిందే ! సరే ! మరొక చేపను పట్టుకుంటాను’అని అంది. అప్పుడు ఆ కొంగ మరొక చేపను పట్టుకుంది. అప్పుడు కూడా ఆ పెద్ద చేప ‘అయ్యో ! అది నా బంధువు. నేను వాటన్నింటికీ ఇతరులను ఉపయోగపడమని, సాయం చేయమని, పరోపకారం చేయాలని చెప్పాను. అందుకే అది పైకి వచ్చి నీకు చిక్కింది. దాన్ని వదిలిపెట్టు !’ అని అంది.
అప్పుడు ఆ కొంగ ‘నేను మాట తప్పే దాన్ని కాను. కానీ నీకూ, ఈ మడుగులోని చేపలన్నిటికీ ఏదో విధంగా బంధుత్వం ఉంది. నీ మంచితనం వల్ల నీ ప్రాణాలనే కాకుండా ఇతర చేపల ప్రాణాలను కూడా నీవు కాపాడుకున్నావు. ఈ చేపలన్నింటిని నేను వదిలి పెడుతున్నాను. నేనే కాదు. ఇక్కడికి భవిష్యత్తులో మరే కొంగ కూడా రాకుండా చేస్తాను. వాటికి ఇక్కడకు రావద్దని చెబుతాను. వేరొక చెరువులోకి వెళతాం. పద! పోదాం’ అని ఆ చిన్న కొంగతో పాటు అది అక్కడి నుండి ఎగిరిపోయింది.
తమ శత్రువైన ఒక కొంగకు ఆపదలో సాయం చేసి తమ ప్రాణాలను కాపాడిన ఆ ఝషమును మిగతా చేపలన్నీ అభినందించాయి.

– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
99085 54535

➡️