అంతిమంగా …

Dec 18,2023 08:46 #sahityam

కాసిన్ని ఉదయాలు, సాయంత్రాలు

మరి కాసిన్ని నిరాశలు నిట్టూర్పులు

హరివిల్లులు వాన జల్లులు

ఎముకలు కొరికే చలి

వడగాడ్పులు

ఒక్కటేమిటి

వీటినే కాదు

జీవరాసులన్నింటినీ

ఎంతో నిబ్బరంగా మోసుకు తిరుగుతున్న

నిండు గర్భవతి తాను

 

వచ్చే వాళ్ళు వస్తుంటారు

వెళ్లే వాళ్ళు వెళుతుంటారు

ఏదీ శాశ్వతం కాదని తెలిసినా

బండ రాళ్ళ మీదనో

రాతి గుండెల మీదనో

రివ్వున వీచే గాలి అలల మీదనో

మన పేరు ఉండాలనుకుంటాం

చిత్రంగా లేదూ ..!

 

ఎంత అత్యాశో కదూ

స్థిరంగా నిలబడలేని మనసు కూడా

రెక్కలు కట్టుకుని

ఆకాశానికి ఎగరాలనుకుంటుంది

చెదిరిపోయిన గూటిలో తలదాచుకోవాలని

ఏ పక్షీ కోరుకోదు

అవసరం మాత్రమే కాదు

పొంచివున్న ఆపద కూడా

పోరాడి గెలవమనే పాఠాలు నేర్పుతుంది

 

ఇరుకిరుకు గదులనుకుంటాం కానీ

ఇంత లేసి ఆనందాల నిధుల్ని

తవ్వి పోసుకున్న అండపిండ బ్రహ్మాండమది

అమ్మ కడుపులో ఉన్నంత స్వేచ్ఛ

మరెక్కడ దొరుకుతుందనీ …

 

పగలు ప్రతీకారాలు

అణచివేతలు, ఆధిపత్యాలు

బంగారు కలల్లో బందీ ఐన క్షణాలు

వీటన్నింటితో పెనవేసుకుపోయిన

కాలమెంత టక్కరిదో కదూ

ఇన్నిన్ని ఉక్కపోతలతో

ఉక్కిరిబిక్కిరి చేసి చంపేస్తుంది

 

పరితాపాలు, ప్రలోభాలు

ఆరంభ సంరంభాలు

ఆఖరి పోరాటాలు

పసి పాపలు, పసిడి నవ్వులు

ఉద్రేకాలు, యుద్ధాలు, ఆక్రమణలు

నిస్సహాయతలు, నిర్వేదాలు

చివరికి ఎవరిని ఎటు విసిరేస్తుందో

ఈ పట్టుకనే రహస్య పీఠిక

ఎప్పుడూ మనం వెంటేసుకు తిరిగే

ఈ మరణమే సమాధానం చెప్పాలి !

– వైష్ణవి శ్రీ 80742 10263

➡️