అశ్రునయనాలతో బాలకృష్ణకు అంతిమ వీడ్కోలు

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, అనకాపల్లి విలేకరి : సిపిఎం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, ఎపి కౌలు రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అంగులూరి బాలకృష్ణ (65)కు అశ్రునయనాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబసభ్యులు ఆదివారం అంతిమ వీడ్కోలు పలికారు. విశాఖ జగదాంబ జంక్షన్‌ సమీపంలోని సిపిఎం కార్యాలయం నుంచి ఆంధ్రా మెడికల్‌ కళాశాలలకు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లి అప్పగించారు. అనకాపల్లి పట్టణం గవరపాలెంలోని బోయవీధిలో 1958 జులై ఒకటిన వ్యవసాయ కార్మిక కుటుంబంలో బాలకృష్ణ జన్మించారు. అనేక నిర్బంధాలను ఎదురొడ్డి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు. కార్మిక, రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రైవాడ జలాశయం నీటిని ఆయకట్టు భూములకు ఇవ్వాలని పోరాడారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో కొన్ని రోజులు విశాఖ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. హైస్కూల్‌లో చదువుతుండగానే గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఎఎంఎఎల్‌ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐలో చురుగ్గా పనిచేసి, ఆ ప్రాంతంలో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారు. ఆ కాలంలో సిపిఎం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కార్యదర్శి దొడ్డి రామునాయుడుతో ఏర్పడిన పరిచయంతో 1982లో సిపిఎం సభ్యత్వం తీసుకున్నారు. 1983లో పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా వచ్చారు. 1984 నుంచి జిల్లా కమిటీ సభ్యునిగా ఎన్నికౖెె సుదీర్ఘకాలం జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా కొనసాగారు. ప్రస్తుతం ఎపి కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశారు. అనకాపల్లిలోని ఎన్‌టిఆర్‌ ఆస్పత్రి స్థలం అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడి వంద పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దాలన్న డిమాండ్‌ను పోరాటం ద్వారా ముందుకుతెచ్చి స్థలం అమ్మకుండా పరిరక్షించగలిగారు. అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌, పూడిమడక మత్స్యకారులు, ల్యాండ్‌ పూలింగ్‌, నల్లబెల్లం నిషేధం సమస్యలపై పోరాడారు. అనకాపల్లి పట్టణంలోని కూరగాయల చిల్లర వర్తకులకు స్థలాలు, షాపులు ఇప్పించారు. తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడారు.

పలువురి సంతాపం

బాలకృష్ణ మృతి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.ఉమామహేశ్వరరావు, పార్టీ పూర్వ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు, ఎపి రైతు సంఘం పూర్వ కార్యదర్శి బి.తులసీదాస్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎపి కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్రి అప్పారావు, ఎం.అప్పలరాజు, గండి నాయినిబాబు తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

➡️