మహిళా రిజర్వేషన్‌ అమలుపై 2 వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయండి

Jan 23,2024 10:31 #Supreme Court
  • కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా రిజర్వేషన్‌ చట్టం (నారీ శక్తి వందన్‌ చట్టం-2023)ను తక్షణమే అమలు చేయాలని, తద్వారా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లు రిజర్వు అయ్యేలా దాఖలైన పిటిషన్‌పై రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్డు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సమగ్ర సమాధానాన్ని దాఖలు చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది కను అగర్వాల్‌ కోరడంతో, ధర్మాసనం కేంద్రానికి సమయం ఇచ్చింది. పిటిషనరు జయ ఠాకూర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ.. సార్వత్రిక ఎన్నికలకు ముందు చట్టాన్ని అమలు చేసేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ దశలో ఆదేశాలు ఇవ్వలేమని, కేంద్రం సమాధానం కోసం వేచి చూడాలని జస్టిస్‌ ఖన్నా అన్నారు. సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఈ అంశంపై పిటిషన్‌ దాఖలు చేయాలనుకుంటున్నట్లు అనడంతో, ఆయన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ మాత్రమే ధర్మాసనానికి కేటాయించగలరని అన్నారు. మూడు వారాల తరువాత తదుపరి విచారణను వాయిదా వేశారు. కేంద్రం తరపున న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో జనవరి 16న అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌పై విచారణను జనవరి 22కు వాయిదా వేసింది. జనాభా లెక్కల తరువాత అమలులోకి వస్తుందని చెబుతున్న మహిళా రిజర్వేషన్‌ చట్టంలోని కొంత భాగాన్ని కోర్టు కొట్టివేయడం ‘చాలా కష్టం’ అని 2023 నవంబరు 3న సుప్రీంకోర్టు పేర్కొంది. 2023 సెప్టెంబరు 21న లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేసే బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం లభించింది. లోక్‌సభ దాదాపు ఏకాభిప్రాయంతో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించగా, రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

➡️