వాతావరణ మార్పులపై పోరాటం ప్రాథమిక హక్కు

Apr 9,2024 00:19 #supreem court, #weather report
  •  సుప్రీం రూలింగ్‌
  •  పరిశుభ్రమైన వాతావరణ కొరవడితే పలు హక్కుల ఉల్లంఘనలకు దారి తీస్తుందని వ్యాఖ్య

న్యూఢిల్లీ : వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని రాజ్యాంగంలో ప్రత్యేక ప్రాధమిక హక్కుగా, మానవ హక్కుగా సుప్రీం కోర్టు గుర్తించింది. ”వాతావరణ మార్పుల వల్ల సంభవించే దుష్ప్రభావాలపై పోరాడేందుకు ప్రజలకు హక్కు వుందని ఇంకా స్పష్టీంగా వ్యక్తీకరించాల్సి వుంది. బహుశా ఈ హక్కు, అలాగే పరిశుద్ధ పర్యావరణ హక్కు ఈ రెండూ కూడా ఒకే నాణానికి రెండు కోణాలు వంటివి కావడం ఇందుకు కారణం కావచ్చు. ఏటికేడాది వాతావరణ మార్పుల వల్ల కలిగే విధ్వంసం, నష్టం పెరిగిపోతోంది. అందువల్ల దీన్ని ప్రత్యేక హక్కుగా నిర్ధారించాల్సిన అవసరం నెలకొంది. రాజ్యాంగంలోని 14వ అధికరణ (సమానత్వ హక్కు), 21వ అధికరణ (జీవన హక్కు)లు దీన్ని గుర్తించాయి.” అని సుప్రీంకోర్టు ఈ నెల 6న విడుదల చేసిన ఒక తీర్పులో వ్యాఖ్యానించింది.
అంతమవుతున్న గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ (బట్టమేక పిట్ట) జాతుల మనుగడకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పు సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
ఈ బస్టర్డ్‌ జాతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని వేయాలంటూ మార్చి 21న బహిరంగ కోర్టులో ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్‌, రాజస్థాన్‌ల్లో ప్రకృతిసిద్ధమైన వీటి ఆవాసాలోకి విమాన మార్గాలు, విద్యుత్‌ పంపిణీ లైన్లు రావడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఈ కేసుపై తదుపరి విచారణ ఆగస్టుకి వాయిదా వేశారు. అయితే గత వారాంతంలో కోర్టు ప్రకటించని ఈ తీర్పును తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ తీర్పులో పలు పేరాగ్రాఫ్‌లు వాతావరణ మార్పులు, దాని ప్రతికూలతలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి.
పరిశుద్ధమైన, సుస్థిర పర్యావరణం లేనిదే జీవన హక్కు, సమానత్వ హక్కు పూర్తిగా సాకారమవలేవని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత వల్ల తీవ్రమైన ఆహార కొరత, నీటికొరతలు ఏర్పడితే వాటివల్ల సంపన్నులు కన్నా నిరుపేదలు ఎక్కువగా ఇబ్బందులు పడతారని తీర్పు వ్యాఖ్యానించింది. ఆ రకంగా వాతావరణ మార్పులకు, వివిధ మానవ హక్కులకు అంతర సంబంధం వుందని కోర్టు పేర్కొంది. ఆరోగ్య హక్కు, ఆదివాసీల హక్కులు, లింగ సమానత్వం, అభివృద్ధి హక్కు వంటివి పలు హక్కులు దీనితో ముడిపడి వుంటాయని పేర్కొంది. వాతావరణ మార్పులకు సంబంధించి ఎలాంటి రుగ్మతలు లేని ఆరోగ్యకరమైన వాతావరణం ప్రతి ఒక్క మానవుని ప్రాధమిక హక్కు, మానవ హక్కు అని స్పష్టం చేసింది. ఆరోగ్య పర్యావరణానికి సంబంధించిన హక్కు ఉల్లంఘించబడితే ఆ ప్రభావం అనేక హక్కులపై పడుతుందని, జీవన హక్కు, వ్యక్తిగత సమగ్రత, ఆరోగ్యం, నీరు, గృహ నిర్మాణం, సమాచార హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, ప్రాతినిధ్య హక్కు ఇలా ప్రతి ఒక్కదానిపైనా పడుతుందని కోర్టు పేర్కొంది. అసమానమైన ఇంధన అవకాశాలు మహిళలను, బాలికలను తీవ్రంగా దెబ్బతీస్తాయని, ఎలాంటి జీతం బత్తెం లేని ఇళ్ళల్లో పనులకు ఎక్కువ సమయం ఖర్చు పెట్టడం వల్ల వారి బాధ్యతలు కూడా పెరుగుతాయని పేర్కొంది. వాతావరణ మార్పుల వల్ల తలెత్తే సమస్యలను కట్టడిచేసేందుకు కోర్టు ఒక సూచన కూడా చేసింది. సౌర విద్యుత్‌ పాత్ర ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. భారత్‌ తక్షణమే సౌర విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించింది.
ఇందుకు మూడు కారణాలను పేర్కొంది. ఒకటి, రాబోయే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయంగా పెరగనున్న ఇంధన డిమాండ్‌లో భారత్‌ వాటా దాదాపు 25శాతం వుండొచ్చునని పేర్కొంది. రెండోది, విచ్చలవిడిగా వాయు కాలుష్యంతో పరిశుద్ధమైన ఇంధన వనరులు అవసరమవుతున్నాయని అంది. తగ్గుతున్న భూగర్భ జలాలు, క్షీణిస్తున్న వార్షిక వర్షపాతం మూడో కారణమని పేర్కొంది.

➡️