సిఎఎపై పోరు కొనసాగుతుంది : కొజికోడ్‌ బీచ్‌ ర్యాలీలో కేరళ సిఎం విజయన్‌

  • రోహింగ్యా శరణార్థులను బయటకు పంపేందుకే ఈ ఎత్తుగడ అంటూ విమర్శ
  • కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్‌

కొజికోడ్‌ : సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం)ను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దేశం నురచి రోహింగ్యా శరణార్థులను బయటకు పంపేందుకు వ్యూహాత్మకంగా పన్నిన ఎత్తుగడేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. సిఎఎకు వ్యతిరేకంగా కొజికోడ్‌ బీచ్‌లో శుక్రవారం ఎల్‌డిఎఫ్‌ వేలాది మందితో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. శరణార్థుల పట్ల సార్వజనీన దృక్పథాన్ని సిఎఎ ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ప్రపంచ దేశాల్లో భారత్‌ ఏకాకి అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. పౌరసత్వానికి మతాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొస్తూ మోడీ ్పభుత్వం తీసుకున్న చర్యను ఐక్యరాజ్య సమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. కేవలం దేశ పౌరులకే కాకుండా ఇక్కడ నివసించే వారందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని, మతం ప్రాతిపదికన విభజించడాన్ని రాజ్యాంగం అనుమతించదన్నారు. సిఎఎ, జాతీయ పౌర పట్టిక అమలుకు తాము మద్దతిచ్చేది లేదని ప్రకటించిన మొదటి రాష్ట్రం కేరళ అని విజయన్‌ చెప్పారు. సిఎఎకు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించిన మొదటి రాష్ట్రం కూడా కేరళేనని చెప్పారు. దేశంలో చాలా మంది ప్రజలు తమ భవిత్యవం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, తాము ఇక్కడ వుండగలమా లేదా అని వారు భయపడుతున్నారని అన్నారు. సంఫ్‌ు పరివార్‌ బెదిరింపులు కూడా ఈ భయానికి ఒక కారణమన్నారు. సిఎఎపై తన వైఖరిని కాంగ్రెస్‌ నాయకత్వం ఇంతవరకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీ లోక్‌సభకు పోటీ చేస్తున్న ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థుల ప్రచారానికి వేదికగా మారింది. ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థులైన ఎలామరమ్‌ కరీమ్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కెకె శైలజ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

➡️