హైదరాబాద్‌లోని పిల్లల్లో ఫీవర్‌ ఫియర్‌..!

Mar 1,2024 13:02 #Children, #fear, #hyderabad, #Viral Fever

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో చిన్నారులను స్కార్లెట్‌ ఫీవర్‌ వణికిస్తోంది. ఓ వైపు పిల్లలకు పరీక్షలు ప్రారంభమైన వేళ … ఈ జ్వరం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలోనూ ఈ వ్యాధి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇది తీవ్రంగా ప్రబలుతోంది. ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలోని పిల్లల విభాగానికి వస్తున్న 20 మంది జ్వర బాధిత చిన్నారులు 10-12 మందిలో ఈ స్కార్లెట్‌ జ్వరం లక్షణాలు కన్పిస్తున్నాయి. కొందరిలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక… ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న చిన్నారుల్లో ఈ జ్వర లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్నిసార్లు వైరల్‌ లక్షణాలుగా భావించినా చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే…ఆసుపత్రిలో చేరేవరకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 5 నుండి 15 ఏండ్లలోపు పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కన్పిస్తే ముందే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

ఈ ఫీవర్‌ ఎలా వస్తుందంటే…

స్కార్లెట్‌ ఫీవర్‌ అనేది స్ట్రెప్టోకోకస్‌ ఫారింగైటిస్‌ అనే బ్యాక్టీరియా కారణంగా సోకుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా పక్కవారికి అంటుకుంటుంది. ఆ తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా పక్కవారి ముక్కు, నోటి ద్వారా లోనికి వెళ్లి జ్వరానికి కారణం అవుతుంది.

తల్లిదండ్రులకు అవగాహన…

హైదరాబాద్‌ లో ఉన్న చాలా స్కూళ్లలో చిన్నారుల తల్లిదండ్రులకు ఈ జ్వరంపై అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న చిన్నారులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని, పాఠశాలకు పంపించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ జ్వరం ఐదు సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లల్లో కనిపిస్తుందని, జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

జ్వరం లక్షణాలు..

102 డిగ్రీల జ్వరం వస్తుంది. అకస్మాత్తుగా గొంతు నొప్పి, కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారడం, గొంతు, నాలుకపై తెల్లని పూత, ట్రాన్సిల్స్‌ ఎరుపు రంగులో పెద్దవిగా కనిపించడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, సరైన సమయంలో చికిత్స జరిగితే దీని నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

➡️