భల్లూకాల భయం

భల్లూకాల భయం ఉద్దానం

తోటలోకి వెళ్తున్న ఎలుగుమాట్లాడుతున్న అటవీశాఖ అధికారులు

  • అటవీశాఖ అధికారులపై స్థానికుల గరంగరం

ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు

ఆలయంలో ఎలుగు భల్లూకాల భయం ఉద్దానం ప్రాంతాన్ని వీడడం లేదు. తాజాగా గరుడభద్ర పంచాయతీ పరిధిలోని తర్లాగడూరు సమీపంలోని తోటల్లో ఉన్న మంకినమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. జీడితోటల్లో పిక్కలు ఏరుకోవడానికి వెళ్తున్న రైతులు ఆలయ ప్రాంగణంలో ఎలుగుబంటి సంచరించడాన్ని గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, వారు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయానికి తలుపులు లేకపోవడం, జీడితోటలు గుబురుగా ఉండడంతో ఎలుగుబంటిని బంధించడానికి వీలు కాలేదని అటవీశాఖ అధికారులు చెప్పారు. అమ్మవారి ఆలయంలోనే ఎలుగు తిష్ట వేయడంతో స్థానికులు ఆందోళన చెందారు. యువకులు, గ్రామస్తులు ఎలుగుబంటికి ఇబ్బంది కలిగించకుండా ఆలయం నుంచి బయటకు వచ్చే వరకు వేచిచూశారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆలయం నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి సమీప తోటల నుంచి పరుగు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గండం తప్పినా, జీడిపిక్కలు ఏరడానికి రైతులు నిత్యం తోటలకు వెళ్తుండడంతో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనలు చెందుతున్నారు. అటవీ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటి సంచారంపై సమాచారం ఇస్తే, సంఘటనా స్థలానికి ఎలుగుబంటిని బంధించడానికి అవసరమైన ఉపకరణాలు తీసుకొని రాకుండా చుట్టపు చూపుగా వచ్చారని మండిపడుతున్నారు. మరోవైపు మెట్టూరు ఉన్నత పాఠశాల సమీపంలోనూ రెండు ఎలుగుబంట్లు తారసపడినట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. ఎలుగుబంట్లకు హాని తలపెట్టకపోతే అవేమీ చేయవని అటవీశాఖ అధికారులు రెడ్డి, రాజు, పోలయ్య తెలిపారు. ఒంటరిగా కాకుండా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది వెళ్లాలని, కర్రలు పట్టుకోవాలని సూచించారు.

➡️