భయం.. భయం…

May 11,2024 05:30 #editpage

ఎన్నికల ఫలితాలు తాము ఊహించిన విధంగా బిజెపికి అనుకూలంగా ఉండవన్న భయాలు అటు కమలనాథులనూ మరోవైపు కార్పొరేట్లనూ గజగజ వణికిస్తున్నాయి. ఫలితంగా మొదటి విడత పోలింగ్‌ అనంతరం ప్రధానమంత్రి సైతం తన స్థాయిని మరచి ప్రతిపక్షాలు అధికారానికి వస్తే మంగళసూత్రాలు గుంజుకుంటారనీ, సంపదను మైనార్టీలకు కట్టబెడతారంటూ ఊరూరా విద్వేష వ్యాఖ్యలు చేశారు. రెండో విడత ముగిశాక తన అనుంగు మిత్రులైన అదానీ, అంబానీల పైనే వారు కాంగ్రెస్‌కు ట్రక్కులనిండా డబ్బు తీసుకెళ్లి ఇచ్చారని బహిరంగంగా విమర్శలు చేసే స్థాయికి వెళ్లారు. మూడో విడత పోలింగ్‌ జరిగిన రోజునే హర్యానాలోని బిజెపి ప్రభుత్వానికి మద్దతునిచ్చిన ముగ్గురు ఇంటిపెండెంట్‌ ఎమ్మెల్యేలు తమ సపోర్ట్‌ ఉపసంహరించడంతో అది మైనారిటీలో పడింది. మరోవైపున ఇటువంటి అనుమానాలవల్ల స్టాక్‌ మార్కెట్‌ కూడా అతలాకుతలం అవుతోంది. గురువారం ఒక్కరోజునే 7.30 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద ఆవిరైందంటే ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో బోధపడుతుంది. బిఎస్‌ఇ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.400 లక్షల కోట్ల నుంచి రూ.393.73 లక్షల కోట్లకు పడిపోగా అన్ని మార్కెట్‌ సూచీలు రోజంతా నష్టాల వైపే పరుగులు తీశాయి. మొత్తమ్మీద నరేంద్ర మోడీ నాయకత్వాన సాగుతున్న కార్పొరేట్‌ మతతత్వ కూటమి పాలన తుది ఘడియలకు చేరుకుంటోందన్న హేతువులు అన్ని వైపులనుండీ కానవస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లను సాధించడమే లక్ష్యమని ఊదరగొడుతూ బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పది సంవత్సరాల పదవీ కాలంలో నరేంద్రమోడీ పెద్దఎత్తున దేశ విదేశీ కార్పొరేట్లకు అనుకూల విధానాలు అమలు చేసినందుకు ప్రతిఫలంగా కార్పొరేట్‌ మీడియాలో ఇప్పటికీ ఆ ప్రచారమే హోరెత్తిస్తోంది. అయితే, ఒక్కో విడత పోలింగ్‌ ప్రక్రియ ముగిసే కొద్దీ మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమికి అంత సీన్‌ లేదన్న విషయం లోకానికి స్పష్టమౌతూ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ప్రధానమంత్రి, ఆయన సహచరుల ప్రచారశైలి కూడా మారుతూ వచ్చింది. నిజానికి తమ పదేళ్ల పాలనలో దేశానికి ఏం మేలు చేశారో ప్రజలను ఎంతలా ఆదుకున్నారో చెప్పి మరో ఐదేళ్లలో ఇంకేమేం చేస్తారో వారు వివరించి వుండాల్సింది. కానీ పదేళ్ల బిజెపి పాలనలో దేశంలో పేదల జీవనం కష్టంగా మారింది కనుక దీనిపై ఎన్నికల ప్రచారంలో మోడీ పరివారం మాట్లాడటం లేదన్నది సుస్పష్టం. ఆశ్రిత పెట్టుబడిదార్లకు దోచిపెట్టడం మినహా ఈ సర్కారు చేసిందేమీ లేదు. నల్లధనం లేకుండా చేస్తానని చెప్పిన ప్రధాని ఇప్పుడు అదానీ, అంబానీ కాంగ్రెస్‌కు నల్లడబ్బు ఇస్తున్నారని చెబుతున్నారంటే దేశంలో ఇంకా నల్లడబ్బు ఉందని ఆయనే ఒప్పుకున్నట్టు కదా! మరి అంత డబ్బు చేతులు మారుతుంటే తమ పాలనలో సమర్ధవంతంగా పని చేస్తోందని చెప్పే ఇడి ఏంచేస్తుందో ప్రధాన మంత్రే చెప్పాలి.
ఉత్తర భారతదేశంలో ప్రధానంగా యుపి, బీహార్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ఇండియా వేదిక పార్టీల మధ్య సర్దుబాట్లు కుదిరినందున బిజెపి వ్యతిరేక ఓటు గరిష్టంగా పూల్‌ అవుతున్న నేపథ్యంలో ‘ఇండియా’ పార్టీల సీట్ల పెరుగుదల, బిజెపి దిగజారుడు ద్యోతకమవుతోంది. కేరళ, తమిళనాడుల్లో కమలం ఖాతా తెరవబోదనీ, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో బిజెపికి సీట్లు తగ్గుతాయని ఇప్పటికే తేలిపోయింది. ప్రస్తుతం దేశ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ భావోద్వేగాలకూ అంతలా గురి కాకుండా గత పదేళ్ల మోడీ పాలనలో పెరిగిన ధరలు, దిగజారిన ఉపాధి, తరిగిన కొనుగోలు శక్తి వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. సిఎస్‌డిఎస్‌- లోక్‌నీతి వంటి సర్వేలూ దానినే సూచించాయి కూడా! సోమవారం జరగనున్న పోలింగ్‌లోనూ బిజెపికి ఆశించినన్ని సీట్లు దక్కడం కష్టమని తేలిపోతోంది. దేశంలో ఇండియా వేదిక పార్టీలదే గెలుపని, కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో మరిన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు.

➡️