షోకాజ్‌ నోటీసులకు భయపడం : కొనసాగుతున్న సర్వ శిక్ష ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం : షోకాజ్‌ నోటీసులకు భయపడేది లేదని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారానికి 19వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాలను యుటిఎఫ్‌ నాయకు లు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా జెఎసి నేతలు మాట్లాడుతూ ఈ నెల 5న విజయవాడలో ఎస్‌పిడి కార్యాలయం ముట్టడి విజయవంతం చేశామన్నారు. అందులో చర్చలు ఫలితంగా ఎవరికి షోకాజ్‌ నోటీసులు, మెమోలు అందజేయబోమంటూ ఎస్‌పిడి నమ్మబలికి మరు సటి రోజే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నోటీసులు అందజేయడం దుర్మార్గ మన్నారు. విద్యాశాఖలో కీలకపాత్ర వహిస్తున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సిఎం జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తాననే వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వ శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని జ్యోతిరావు ఫూలే పార్కు వద్ద జరిగే సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ కిషోర్‌ కుమార్‌, విజయనగరం సమ్మె శిబిరాన్ని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి సందర్శించి, సంఘీభావం తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లా, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, నరసరావు పేట, మచిలీపట్నం, విజయవాడ, ఏలూరు, భీమవరం, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోససీమ జిల్లా ముమ్మిడివరం, విశాఖ, అనకాపల్లి సమ్మె శిబిరాలలో నిరసనలు కొనసాగాయి.

➡️