ప్రత్యేక హోదా సాధన కోసం 30న గాంధీ విగ్రహాల వద్ద నిరాహార దీక్షలు

  • ఫిబ్రవరి 7 నుంచి ఢిల్లీలో నిరసనలు, ధర్నాలు
  • ప్రత్యేక హోదా సాధన సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 7 నుంచి ఢిల్లీలో నిరసన దీక్షలు, ధర్నాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఎంబివికెలో శనివారం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నెల 22 నుంచి సాధన సమితి నేతలు ఆరు జిల్లాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేయడం, సోషల్‌ మీడియాతోపాటు బుక్‌లెట్లు పంపిణీ చేయాలని, ప్రధానికి మెయిల్స్‌ ద్వారా డిమాండ్‌ను తెలియజేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30 తర్వాత రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని, పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపిలందరికీ లేఖలు రాయాలని, పార్లమెంటును స్తంభింపజేయాలని కోరాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దారుణ అన్యాయంపై నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసనలు తెలపాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కలిసొచ్చే అన్ని శక్తులనూ కలుపుకుని పోరాడాలన్నారు. వామపక్షాలతోపాటు యువజన, విద్యార్థి, మహిళా సంఘలన్నింటినీ కలుపుకుని ముందుకు పోవాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం తాము ప్రత్యక్షంగా పాల్గొంటామన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. భావి తరాలకు అవసరమైన విభజన హామీలపై అసలు మాట్లాడని, చట్ట సభల్లో పోటీ చేసే ప్రజా ప్రతినిధులను నిలదీయాలన్నారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పేరుతో బ్యాడ్జీలు పెట్టుకోవాలని, ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో పర్యటిస్తామని అన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, వైవి రావు, సీతారాం, మాల్యాద్రి, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ మాట్లాడారు. ఆప్‌ నేతలు ఫణిరాజు, తెలుగు సేన అధ్యక్షులు సత్యారెడ్డి, నవతరం పార్టీ నాయకులు రావు సుబ్రమణ్యం, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, పోతుల బాలకోటయ్య, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఈశ్వరరావు, సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్‌, ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘాల నాయకులు ఈశ్వరయ్య, కేశవరావు, మాజీ ఐఎఎస్‌ అధికారి బండి శ్రీనివాస్‌, విద్యార్థి సంఘ నాయకులు రాజేంద్ర, ప్రసన్నకుమార్‌, బుల్లిరాజ్‌, బిసి సంఘాలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️