పతనమైన మిర్చి ధర

 20 రోజుల కిందట రూ.60 వేలు.. ఇప్పుడు రూ.20 వేలు
 కర్ణాటకలో రైతుల ఆందోళన

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : బ్యాడిగి డబ్బిరం రకం ఎండు మిర్చి ధర అమాంతంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే క్వింటాలు ధర రూ.60 వేల నుంచి రూ.20 వేలకు పడిపోయింది. దీంతో, కర్ణాటకలోని బ్యాడిగి, హవరి ప్రాంతాల్లో మన రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రాల రైతులు ఆందోళన బాటపడ్డారు. హవరి మార్కెట్‌ యార్డులో సోమవారం నాడు నిరసనకు దిగారు. కార్యాలయాన్ని, వాహనాలను తగులబెట్టారు. మంగళవారం కూడా నిరసన కొనసాగించారు.

బ్యాడిగి డబ్బిరం మార్కెట్‌ అక్కడే!
అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు బెళుగుప్ప తదితర మండలాల్లో మిర్చిని అధికంగా సాగు చేస్తున్నారు. అధిక డిమాండ్‌, ధర ఉండే బ్యాడిగి డబ్బిరం రకం మిర్చిని పైమండలాల్లో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ కింద సుమారు 60 వేల ఎకరాల్లో వేశారు. వర్షాభావంతో కాలువలకు సక్రమంగా నీరు రాకపోయినా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. వర్షాభావం, నీటి కొరతతో 15 నుంచి 20 క్వింటాళ్లలోపే వచ్చింది. ఈ పంటను ఇక్కడ అమ్ముకోవడానికి మార్కెట్‌ సౌకర్యం లేదు. దీంతో, కర్ణాటక రాష్ట్రం హవరి, బ్యాడిగి ప్రాంతాల్లోని మిర్చి మార్కెట్లలో విక్రయిస్తున్నారు. కర్ణాటకలోని రైతులు కూడా ఆ మార్కెట్లకే మిర్చిని ఎక్కువగా తెస్తుంటారు. ఈ రకం మిర్చికి 20 రోజుల క్రితం వరకూ క్వింటాలుకు రూ.60 వేల ధర పలికేది. ప్రస్తుతం రూ.20 వేలు ధర పడిపోయింది. వ్యాపారులు కుమ్మక్కై ధరను భారీగా తగ్గించేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణాటక, ఆంధ్రా రైతులు ఆందోళన బాట పట్టారు. బ్యాడిగి మార్కెట్‌ యార్డులో నిరసనకు దిగారు.

ఒకేసారి ధర అంతలా పడిపోతే ఎలా?
ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ఎకరానికి ఒకటిన్నర లక్షల రూపాయల వరకూ పెట్టుబడి అయింది. వర్షాభావం, తెగుళ్ల వల్ల ఎకరానికి 15 క్వింటాళ్లలోపే పంట దిగుబడి వచ్చింది. 20 రోజుల వ్యవధిలో ధర రూ.60 వేల నుంచి రూ.20 వేలకు పడిపోయింది. ప్రకృతి అనుకూలించక, మార్కెట్‌లో ధర లేక రెండు రకాలుగా నష్టపోయే పరిస్థితి వచ్చింది.
– విజయ్, శిర్పికొట్టాల గ్రామం, బెళగుప్ప మండలం

రైతుకు మద్దతుగా నిలవాలి
మార్కెట్‌లో ధర నిలకడ లేకుండా ఉంటోంది. వ్యాపారులు అమాంతంగా ధరను తగ్గించేస్తున్నారు. దీంతో, రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా పడిపోతున్నాయి. మిర్చి మార్కెట్‌ అనంతపురం జిల్లా ప్రాంతాల్లో ఎక్కడా లేదు. దీంతో, ఈ ప్రాంత రైతులు కర్ణాటకకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ వ్యాపారాలు అడిగిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో మిర్చి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు మద్దతుగా నిలవాలి.
-మధుసూదన్‌, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు

➡️