చైతన్య స్ఫూర్తిగా కళ్ళం.. కష్టజీవుల సమస్యలపై నిరంతర పోరాటం..

Apr 23,2024 12:30

ఆయన చైతన్య స్ఫూర్తి. కష్టపడి ఎదిగిన ఆయన మరెందరో కష్టజీవులకు ఊతమయ్యారు. జైళ్లు, నిర్బంధాలు ఆయన్ని వెనక్కి లాగలేదు. నిబద్ధతతో లక్ష్యసాధనకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయనే గన్నవరం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న కళ్ళం వెంకటేశ్వరరావు. పేద ప్రజల సమస్యలే ఎజెండాగా…వారికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తున్నారు. మే 13న జరగనున్న గన్నవరం అసెంబ్లీ నియోజకర్గం నుంచి సిపిఐ, కాంగ్రెస్‌ మద్దతుతో సిపిఎం అభ్యర్థిగా కళ్ళం వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు, సిపిఎం అగ్రనాయకుడు, ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభ్యుడుగా గెలుపొంది, శాసనసభలో ప్రతిపక్ష నేతగా పని చేసిన మహనీయులు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ వారసుడుగా పోటీ చేస్తున్న కళ్ళం వెంకటేశ్వరరావుకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో ఆయన 1966లో జన్మించారు. విజయవాడలోని ఎస్‌సి సంక్షేమ వసతి గృహంలో ఉంటూ.. శాతవాహన కళాశాలలో బిఏ పట్టభద్రుడయ్యారు. విద్యార్థిగా డాక్టరు బి.ఆర్‌.అంబేద్కర్‌ భావజాలానికి ఆకర్షితుడై పలు సామాజిక సమస్యలపై పని చేశారు. యువకుడుగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ)లో పనిచేశారు. సంక్రాంతి, దసరా, దీపావళి పండుగ సమయాల్లో గ్రామాల్లోని యువజనులు కోడిపందాలు, జూదాలవైపు వెళ్లకుండా వారిని సన్మార్గంవైపు పయనింపజేయటానికి ఆటల పోటీలను నిర్వహించేవారు. ఈ పోటీల్లో పెద్దఎత్తున యువతీ యువకులు పాల్గనేలా విశేషంగా కృషి చేస్తున్నారు. స్థానిక సమస్యలున్న చోట్ల యువజనులను శ్రమదానాల బాట పట్టించారు. వయోజనుల కోసం, బడిబాట పట్టని పిల్లల కోసం రాత్రి పాఠశాలల నిర్వహణలో పాలుపంచుకున్నారు. అక్కడ నుంచి ప్రారంభించిన కళ్ళం సేవాయాత్ర..సిపిఎం పట్ల ఆకర్షితుణ్ణి చేసింది. 1989లో సిపిఎంలో నభ్యత్వం తీసుకున్నారు. నాటి నుంచి వ్యవసాయ కార్మికుల న్యాయమైన కూలి సాధనకు, పేదల సాగులో ఉన్న భూములకు పట్టాల కోసం, ఉపాధి హామీ సమస్యలపైన, ఇళ్ల స్థలాల కోసం, కాలువగట్ల మీద పేదల ఇళ్లు తొలగింపునకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ముందు పీఠిన నిలిచి పోరాడారు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, బాధిత రైతాంగానికి మెరుగైన పరిహారం కోసం కృషి చేశారు. జాతీయ రహదారి రెండు దశల విస్తరణ, పోలవరం కాలువ తవ్వకం, కొండపావులూరులో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ఏర్పాటు, మల్లవల్లి, వీరపనేనిగూడెంలో పరిశ్రమల ఏర్పాటు పేరుతో, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడి మెరుగైన పరిహారం సాధించారు. రైతులకు మేలు జరిగేలా చేశారు. విమానాశ్రయ విస్తరణలో భాగంగా.. ఏలూరు కాలువ మళ్లింపు, భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితుల పక్షాన అండగా నిలబడ్డారు. వ్యవసాయ సంక్షోభంలో చిక్కుకున్న రైతాంగానికి పంటల గిట్టుబాటు ధర కోసం చేపట్టిన అన్ని ఉద్యమాలకూ అండదండలిచ్చారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బుల బకాయిలు, కౌలుదారుల నమస్యలపై జరిగిన ఉద్యమాలన్నింటిలో పాల్గన్నారు. హనుమాన్‌ జంక్షన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ మూసివేతకు నిరసనగా చేసిన పోరాటంలో ముందు భాగాన ఉన్నారు. రైతుల పొలాలకు నీటి మీటర్లు పెట్టేదానికి వ్యతిరేకంగా.. తేలప్రోలులో అడ్డుకొని జైలుకు వెళ్లారు. ప్రజాసమస్యలపై జరిగిన పోరాటాల్లో ఆయనపై సుమారు 25కు పైగా కేసులు పెట్టారు పోలీసులు. నెల రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్మికవర్గ పోరాటాలకు సిపిఎం పక్షాన అండగా నిలిచారు. వారికి సంఘీభావంగా జరిగిన అన్ని కార్యక్రమాల్లో పాల్గన్నారు. అంగన్‌ వాడీలు 42 రోజుల చారిత్రాత్మక సమ్మె నిర్వహణతో సహా, అశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, భవన నిర్మాణ, హమాలీ, ఆటో, రవాణా, గ్రామ పంచాయతీ, తదితర అసంఘటిత రంగ కార్మికులు, పారిశ్రామిక కార్మికుల సమస్యలపైన జరిగిన పోరాటాలన్నింటిలో ముందుబాగాన నిలిచారు. దళితుల పట్ల వివక్ష, వారిపై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా.. మహిళలు, మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాటాల్లో పాల్గన్నారు. అయిన వారు ఏమీ చేయలేని స్థితిలో కరోనాతో మృతి చెందిన వారి భౌతికదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించలేని స్థితి ఏర్పడినప్పుడు, రెడ్‌ వాలంటీర్ల దళం ఏర్పాటు చేసి, అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘనత కళ్లం వెంకటేశ్వరావుది. ఆ కాలంలో పనుల్లేని వలన కార్మికులకు, పేదలకు, సరుకులనూ, కూరగాయలనూ అందించి అదుకున్నారు. డివైఎఫ్‌ ఐ జిల్లా అధ్యక్షుడుగా, సిపిఎం డివిజన్‌ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడుగా నియోజకవర్గ ప్రజలందరికీ చిరపరిచితుడైన కళ్ళం వెంకటేశ్వరరావు పార్టీ ఆదేశం మేరకు ఈ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిర్విరామంగా ప్రజాసమస్యలపై పనిచేస్తున్న వెంకటేశ్వరరావు గ్రామాల్లో ప్రచారానికి వెళుతున్నప్పుడు కార్మికులు, కూలీలు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ‘సుత్తి-కొడవవలి-నక్షత్రం’ గుర్తుపై ఓటువేస్తామని ప్రజలు వ్యక్తం చేయడం విశేషం.

ఎన్‌. శ్రీనివాస్‌,గన్నవరం.

➡️