గూగుల్‌లో మళ్లీ ఉద్వాసనలు..

Jan 12,2024 09:55 #Business

అమెజాన్‌ సిబ్బందిలోనూ ఆందోళన

న్యూయార్క్‌ : సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌లో మళ్లీ ఉద్యోగులపై వేటు పడనుంది. ఎఐ డివిజన్‌లో ఉద్యోగులను ఇంటికి పంపించడానికి కసరత్తును ప్రారంభించింది. 2023లో టెక్‌ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు ఊడాగ.. 2024లోనూ గూగుల్‌, అమెజాన్‌ మరోమారు వేటు వేయనుందనే రిపోర్టులు టెకీలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా అల్పాబెట్‌ యాజమాన్యంలోని ఫిట్‌బిట్‌ సహ వ్యవస్థాపకుడు జేమ్స్‌ పార్క్‌, ఎరిక్‌ ఫ్రైడ్‌మాన్‌ సహా వందలాది ఉద్యోగులను గూగుల్‌ తొలగిస్తోంది. అదే విధంగా అగ్మెంటెడ్‌ రియాలిటీలో కూడా వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించడానికి కసరత్తు ప్రారంభించింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ, వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా తొలగింపులు చేపడుతుంది. హార్డ్‌వేర్‌ డివిజన్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ బృందాల్లోని ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టనుంది. వాయిస్‌ ఆధారిత గూగుల్‌ అసిస్టెంట్‌, ఎఆర్‌ హార్డ్‌వేర్‌ టీం, కంపెనీ సెంట్రల్‌ ఇంజనీరింగ్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేసే వారిపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లోనూ ఎంజిఎం స్టూడియో విభాగంలోని ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఇందులోని వందలాది మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు బ్లూమ్‌బర్ట్‌ రిపోర్ట్‌ చేసింది. అమెజాన్‌ ఫ్రైమ్‌ వీడియో, ఎంజిఎం స్టూడియో విభాగం నుంచి వందల మంది ఉద్యోగులను తొలగించడానికి కసరత్తు జరుగుతోంది.

➡️