జగనన్న గృహప్రవేశాలకు కసరత్తు

ప్రజాశక్తి- కడప ప్రతినిధి  : జిల్లాలో 529 హౌసింగ్‌ లేఅవుట్లు ఉన్నాయి. 1.00128 లక్షల గృహాలను నిర్మించడమే ధ్యేయంగా గృహనిర్మాణశాఖ కసరత్తు చేపట్టింది. 94 వేల ఇళ్లకు రిజి స్ట్రేషన్‌ చేసింది. 2022, 23 సంవత్సరాల్లో వరదలు, నిధుల లేమి కారణంగా పనుల్లో పురోగతి మందగించింది. 2024 సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో జగనన్న ఇళ్ల ప్రవేశాలు చేపట్టాలని భావించింది. నిర్దేశిత లక్ష్యాల దిశపై దృష్టి సారించింది. 2024 ఫిబ్రవరి నాటికి 24 వేల ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై హౌసింగ్‌ యంత్రాంగం మల్లుగుల్లాలు పడుతు ండడం గమనార్హం.

డిసెంబర్‌ నుంచి మెగా డ్రైవ్‌

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 24 వేల ఇళ్లను ప్రారంభించాలని హౌసింగ్‌ లక్ష్యాన్ని పెట్టుకుంది. కలెక్టర్‌ పర్యవేక్షణలో కసరత్తు చేపట్టింది. ఆచరణలో రెండు వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది. 10 వేల ఇళ్లలోపు నిర్మాణ పనులు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో జిల్లాలోని 36 మండలాల వారీ పకడ్బందీగా లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌ ఒకటి నుంచి 2024 ఫిబ్రవరి వరకు మెగాడ్రైవ్‌ నిర్వహిస్తోంది. మండలాల వారీగా నిర్దేశిత లక్ష్యాలకు నిర్దేశించింది. మండల స్థాయి అధికారులకు అవసరమైన సహాయ, సహకారాలను అంది ంచాలని నిర్ణయించింది. బిల్లుల చెల్లింపు నుంచి ఇసుక, ఇటుకలు, సిమెంట్‌ వంటి ఇతర మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.

60 రోజులు..22 వేలు

రెండు నెలల వ్యవధిలో 22 వేల ఇళ్ల నిర్మా ణాలను పూర్తి చేయడమేమిటనే సందేహం కలుగుతోంది. ఐదేళ్ల వ్యవధిలో ఇప్పటివరకు 10 వేల ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతిని సాధించిన అనుభవాల నేపథ్యంలో సందేహం కలగడం గమనార్హం. మిగిలిన గృహ లబ్ధిదారులు నిర్మాణ వ్యయం పెరిగిన నేప థ్యంలో గృహ నిర్మాణ పనులకు ముందుకు రాకపోవడం, కొన్ని ప్రాంతాల్లో కోర్టు కేసుల సమస్యలు వంటి కారణాలతో పురోగతి మందగించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం, లింగాల, తొండూరు మండలాల్లో ఇళ్ల నిర్మాణ పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది.

బద్వేల్‌, మైదుకూరుల్లో ఆశాజనకం

జిల్లాలో బద్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని 45 శాతం మేరకు పనుల్లో పురోగతి కనిపిస్తోంది. 11,395 ఇళ్ల నిర్మాణాలకు గానూ 4,890 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం ఊరట కలిగిస్తోంది. పోరుమామిళ్ల, రంగసముద్రం, అక్కలరెడ్డిపల్లి వంటి ప్రాంతాల్లో పలు సమస్యలు పురోగతి వేగాన్ని కుంగదీసింది. మైదుకూరు నియోజకవర్గంలోని 50 శాతం పనులతో ముందుకు కదలడం ఉపశమనం కలిగించింది. 7,782 ఇళ్ల నిర్మాణ పనుల్లో 4,053 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడం మినహా మిగిలిన నియోజక వర్గాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండడం గమనార్హం. కలెక్టర్‌ ప్రత్యేక అధికారులతో కూడిన జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అయినప్పటికీ జగనన్న ఇళ్ల కాలనీల్లో గృహ నిర్మాణాల్లో ఆశించిన పురోగతి కనిపించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పక్కాగృహాలను పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తామని చెప్పడం, అనంతరం ఇంటి నిర్మాణ పనులకు తక్కువ మొత్తాలను కేటాయించడం వంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా హౌసింగ్‌ యంత్రాంగం నిర్దేశించుకు న్న లక్ష్యాలను అందుకోవడంపై సందేహాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు.

➡️