ద్రవ్యోల్బణంతో వినిమయానికి దెబ్బ : ఆర్‌బిఐ

Dec 22,2023 21:30 #Business

న్యూఢిల్లీ : వినిమయ డిమాండ్‌ను ద్రవ్యోల్బణం దెబ్బ తీస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) పేర్కొంది. వినియోగదారుల వ్యయానికి హెచ్చు ధరలు ప్రతికూలంగా మారాయని ఆర్‌బిఐ తన డిసెంబర్‌ బులిటెన్‌లో పేర్కొంది. ఇది ఉత్పాదక కంపెనీల మొత్తం వృద్థికి, వాటి మూలధన వ్యయాలకు ఆటంకం కలిగిస్తోందని విశ్లేషించింది. ద్రవ్యోల్బణాన్ని సత్వరమే తిరిగి లక్ష్యానికి తీసుకురాకపోతే, సమర్థవంతంగా నియంత్రించకపోతే.. ఆర్థిక వృద్థి నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే 2024-25 తొలి మూడు త్రైమాసికాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 4.6 శాతానికి తగ్గొచ్చని ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖెల్‌ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనం రాసింది. ఈ బులిటెన్‌లో 2024లో ప్రపంచ వృద్థి వేగం మరింత నెమ్మదించవచ్చని విశ్లేషించింది. గడిచిన నవంబర్‌ మాసంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 5.6 శాతానికి చేరిన విషయం తెలిసిందే. ఉల్లిపాయలు, టామాటోలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్త సుజన్‌ హజ్రా పేర్కొన్నారు.

➡️