పరీక్షా ఫలితాలు

Apr 26,2024 04:20 #jeevana

నేడేమైనా జరగనీ మిత్రమా
జయమో, అపజయమో
రేపొకటి వుందని..
గెలుపు వెలుగు చిమ్మే
చీకటిని మింగేస్తుందని
నువ్వెప్పుడూ మరువకు..!

అక్షరాలు తడబడకుండా
మహాకవుల మహా కావ్యాలు
ఎలా నిలబడ్డాయి?
అడుగుల అలజడి లేకుండా
మండేలా ‘ఎ లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడం”
ఎలా సాధ్యమయ్యింది?

అంకెల ఆరాటంపై రామానుజన్‌
ఆత్మవిశ్వాసపు ఆయుధం లేనిదే
‘అనంతం’ ఎలా జవాబిచ్చింది?
నీకు తెలియదా చెప్పు
చిన్నప్పుడే చదివాం మనమంతా..!

ఎడిసన్‌ ఎదుగుదల
చరిత్రకే ఓ పాఠమయ్యింది.
గాంధీజీ ఉద్యమతీరు
పోరాటాలకు
ఓ దిక్సూచయ్యింది.
అర్థం చేసుకోలేక ఐన్‌ స్టీన్‌నే
పిచ్చోడంది ఈ సమాజం..!
గుర్తుపెట్టుకో..
ఎవ్వరి ఎగతాళి లేకుండా ఎవరెస్ట్‌
ఏనాడూ తలంచలేదు.

జీవితం ఎప్పుడూ ఓ పరీక్షే.
పారిపోవడం, చనిపోవడం
ఎప్పటికీ పరిష్కారం కాదు..
ఫలితం ఏదైనాకానీ…

ప్రయత్నించు.. మళ్ళీ ప్రయత్నించు..!
ప్రపంచాన్ని పట్టించుకోకుండా
నీ గమ్యం చేరేవరకు ప్రయాణించు..!
నువ్వే.. నువ్వే.. భవిష్యత్‌
తరాలకు ఓ భానుడివి..!

ా ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌,
93947 49536.

➡️