పరీక్షా సమయం.. పసి హృదయం..

Mar 17,2024 07:09 #children's, #Sneha

ఎండాకాలం.. పరీక్షల కాలం.. రెండూ ఒకేసారి.. ఇక అంతే పిల్లలకు టార్చర్‌ మొదలు.. ఏడాదంతా చదివింది ఒక ఎత్తు.. పరీక్షలు దగ్గరకు రాగానే చదవడం మరో ఎత్తు.. ఇక ఆటలు కట్టిపెట్టి.. పుస్తకాలు పట్టు.. అంటూ పెద్దవాళ్లు అనని ఇల్లు ఉండదు. టెన్త్‌, ఇంటర్‌ వాళ్లు సహజంగానే టెన్షన్‌ పడతారు. ఇక చిన్నారులు అంత సీరియస్‌గా తీసుకోరు.. ఆడుతూ పాడుతూ చదివేసి, రాసేద్దాం అనుకుంటారు.. అయితే పేరెంట్స్‌ పెట్టే టెన్షన్‌ మాత్రం పీక్‌లో ఉంటుంది. వాళ్లు కంగారుపడి.. పసివారినీ కంగారు పెట్టేస్తారు. వాళ్ల చిన్ని మనసులపై ఒత్తిడి చేసేస్తారు. అయితే అలా చేయడం సరికాదనేది నిపుణులు చెప్తున్న మాట.. తగిన జాగ్రత్తలు కొన్ని మెళకువలతో తీసుకోవాల్సింది పేరెంట్సే అంటున్నారు.

మార్కులు.. ర్యాంకులు..
పిల్లలకు మార్కులు బాగా రావాలని.. గొప్ప ర్యాంకులు రావాలని తల్లిదండ్రులు తెగ తపన పడిపోతారు. అన్నేసి ఫీజులు కడుతున్నాం.. పిల్లవాడికి / పిల్లకి మొదటి ర్యాంకు రావాలనే అందరూ కోరుకుంటారు. కానీ పిల్లలు ఏమనుకుంటున్నారో.. ఏమాత్రం పట్టించుకోరు. పిల్లల శక్తి సామర్థ్యాలు దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగానీ.. అదేపనిగా రుద్దుడు కార్యక్రమం చేస్తే పిల్లలు ఒత్తిడికి గురవుతారనేది నిపుణుల సూచన.
అలసట.. ఆందోళన..
పిల్లలు చదివి చదివి అలసిపోవడం అనారోగ్యం కలిగిస్తుంది. ఆటలు ఆడి అలసిపోవడం ఆరోగ్యాన్నిస్తుంది. ఎందుకంటే చదువు మెదడుతో చేసేది. ఆటలు శరీరం మొత్తం శ్రమచేసేది. అందుకే మెదడు ఒక మేరకే పనిచేయగలదు. అధికంగా శ్రమపెట్టినా అది గందరగోళం సృష్టిస్తుంది. పిల్లలు చదివినవే అయినా.. సమయానికి గుర్తు రావు.. నీరసం, నిస్పృహ ఆవహిస్తాయి. వాళ్ల మీద వాళ్లకి నమ్మకం లేకుండా అయిపోతుంది. అందుకే పిల్లల్ని గంటల తరబడి చదివించొద్దంటున్నారు నిపుణులు.


అనారోగ్య సమస్యలు..
పిల్లలు పరీక్షలప్పుడే రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే.. వీడు చదవకుండా టోకరా వేయడానికే అలా కుంటిసాకులు చెప్తున్నాడని అనుకుంటారు. కానీ పిల్లలు పరీక్షల ఒత్తిడితోనే అనారోగ్య సమస్యలకు గురువుతున్నారనేది గమనించాలి. చాలామంది పిల్లలకు మొదట కడుపునొప్పి అనే చెప్తారు. వెంటనే టీచర్‌ అయినా, ఇంట్లో తల్లిదండ్రులైనా.. పిల్లలు అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటారు. కానీ పరీక్షల ఒత్తిడితో జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయనేది నిపుణులు చెప్తున్న మాట. అలాగే తలనొప్పి, కొందరికి మోషన్స్‌ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఒత్తిడి వల్లే వస్తుంటాయి అంటున్నారు నిపుణులు.

ఆట..పాట..
పరీక్షలు అయినా పిల్లల్ని కొంత సేపు ఆటకూ వదలండి. రోజు మొత్తంలో ఆరు గంటలు చదివితే సరిపోతుంది. ఆటలు ఆడటం. కాసేపు పాటలు వినడమో, పాడుకోవడమో చేస్తే పిల్లలు రిలాక్స్‌ అవుతారు. శరీరం, మనసు సేద తీరతాయి. పునరుత్తేజంతో రీఛార్జి అయ్యి పిల్లలు చదివేవి తలకెక్కుతాయి. పరీక్షల ఒత్తిడి కూడా మటుమాయం అవుతుందనేది నిపుణులు చెప్తున్న మాట.
ఆంక్షలొద్దు..
పిల్లల్ని ఉదయం ఎన్ని గంటలకు లేవాలో.. ఎన్ని గంటలు చదవాలో.. ఎప్పుడు తినాలో.. ఎప్పుడు పడుకోవాలో.. తల్లిదండ్రులు ఆంక్షలు పెడుతుంటారు. ఇది సరైనది కాదనేది నిపుణులు చెప్తున్న మాట. కొందరు తల్లిదండ్రులైతే ఏ సబ్జెక్టు చదవాలో కూడా వారే నిర్ణయిస్తారు. క్రమపద్ధతిలో చదవడం, రివిజన్‌ చేసుకోవడం సరైనదే కానీ. నిబంధనలు విధించి పిల్లల్ని గందరగోళపరచొద్దు అంటున్నారు నిపుణులు. పిల్లల్ని ఇష్టపడి చదివేలా చూడండి.. మీకోసం గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చోబెట్టినా.. వాళ్ల మెదడులోకి ఇంకేది ఏమీ ఉండదు. వాళ్లంతట వాళ్లు చదివేలా ప్రోత్సహించాలిగానీ.. బలవంతంగా, దండించి చదివించకూడదంటున్నారు నిపుణులు.
సరిపడా నిద్ర..
పరీక్షల సమయంలో పిల్లల కంటి నిండా నిద్ర ఉంటేనే మెదడు చురుకుగా పనిచేస్తుంది. రాత్రిళ్లు మేల్కొని చదవడం వల్ల ఏడాది అంతా పదిరోజుల్లోనే వచ్చేస్తుందనేది అశాస్త్రీయమైన ఆలోచన. పిల్లలు సమయానికి నిద్రపోయేలా చూడాల్సింది తల్లిదండ్రులే. ఉదయం వేళ త్వరగా మేల్కొని వర్క్‌అవుట్స్‌ చేసుకునే అలవాటు క్రమం తప్పకుండా చేస్తే.. మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందుకనే పిల్లల్ని సరిపడా నిద్రపోనివ్వాలనేది నిపుణులు చెప్తున్న మాట.


పోషకాహారం..
అదేవిధంగా పరీక్షా కాలంలో పిల్లలు తీసుకునే ఆహారం కూడా తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. అలాగే ప్రోటీన్‌ ఫుడ్‌ అందేలా చూడండి. కడుపునిండా అన్నం కన్నా, మాంసాహారం కూడా మితంగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు, మజ్జిగ, కోడిగుడ్డు వంటివి ఆహారంలో భాగంగా ఉండేలా చూడాలి. బయట చిరుతిళ్లు, ఫాస్ట్‌ఫుడ్స్‌ ఈ కాలంలో పూర్తిగా నిరోధించాలి. బయట ఆహారం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. దాని ప్రభావం పరీక్షల మీద కూడా పడుతుంది. అందుకే ఈ విషయంలో తల్లిదండ్రులు కఠినంగానే వ్యవహరించాలి అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ గుడ్డు, పాలు, ఏదో రకం పండ్లు తప్పక ఉండేలా ప్లాన్‌ చేయాలంటున్నారు. పోషకాహారం వల్ల ఆరోగ్యంగా ఉండి, పిల్లలు చలాకీగా ఉంటారు. ఆ మేరకు చదువులోనూ ఉత్సాహంగా ఉంటారంటున్నారు నిపుణులు.

➡️