ఆద్యంతం అలరించిన నాటికలు

Apr 10,2024 00:19

ప్రజాశక్తి – యడ్లపాడు : కొండవీటి కళాపరిషత్‌, పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త జాతీయ స్థాయి నాటకోత్సవాలు మూడోరోజైన మంగళశారం మండల కేంద్రమైన యడ్లపాడులో ప్రారంభమయ్యాయి. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య కళా ప్రాంగణంలో మూడు నాటికలను ప్రదర్శించారు. న్యాయనిర్ణేతలుగా సిహెచ్‌ సృజన, ఎం.శివన్నారాయణ, వినోద్‌బాని వ్యవహరించారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి అతిథులు, కళాకారులు పూలమాలలేసి నివాళులర్పించారు. వీరిలో హైకోర్టు న్యాయవాది మానుకొండ ఉపేంద్రరావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు ఎన్‌.కాళిదాసు, ప్రముఖ కళాకారుడు డాక్టర్‌ ఎం.సురేష్‌బాబు, గుంటూరు కళాపరిషత్‌ అధ్యక్షులు ఎ.పెద్దబ్బయ్య, దేవాదాయ శాఖ విశ్రాంత అధికారి పి.గంగయ్యచౌదరి, సుందరయ్య స్మారక నాటకోత్సవ కమిటీ సభ్యులు జె.శంకరరావు, సిపిఎం మండల కన్వీనర్‌ టి.కోటేశ్వరరావు, నాయకులు కె.రోశయ్య, కొండవీటి కళాపరిషత్‌ అధ్యక్షులు కె.శ్రీహరిరావు, కార్యదర్శి టి.సాంబశివరావు, కళాకారులు ఎం.రామారావు, ఎం.కృష్ణ ఉన్నారు. చివరి రోజైన బుధవారం మరో మూడు నాటికల ప్రదర్శనతోపాటు బహుమతులు, జ్ఞాపికల ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.ఇదిలా ఉండగా తొలి ప్రదర్శనగా గోపి సత్యప్రసాద్‌ (స్నిగ్ధ) రచించిన ‘ఇంద్ర ప్రస్థం’ నాటికను ఎన్‌.రవీంద్రరెడ్డి దర్శకత్వంలో అభినయ ఆర్ట్స్‌ గుంటూరు కళాకారులు ప్రదర్శించారు. ప్రేమ గొప్పదేగాని ఆ ప్రేమలు హర్షించే విధంగా కన్పించాలే తప్ప అనాలోచితంగా వెర్రిగా పరుగెడితే జీవితం, విలువలు నాశనం అయిపోతాయనే ఇతివృత్తంతో సాగింది. తన కుమారుడు ఒకమ్మాయిని ప్రేమించగా తండ్రి మాత్రం ఆ అమ్మాయి తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి కొడుకుకు జాగ్రత్తలు చెబుతాడు. ప్రేమలో మునిగిని వారి తప్పుల్ని సరిదిద్దుతూ క్రమశిక్షణ నేర్పుతూ ఆదర్శవంతమైన తండ్రిగా ఎలా నిలబడతాడు అనేదే నాటిక. యువతలోని ఆకర్షణలు, పెద్దలు మెలగాల్సిన తీరును వివరిస్తూ ప్రదర్శన సాగింది.రెండో ప్రదర్శనగా మైత్రి కళానిలయం విజయవాడ వారు ‘బంధం’ నాటికను ప్రదర్శించారు. మాడుగుల రామకృష్ణ రచించగా, టివి పురుషోత్తం దర్శకత్వం వహించారు. మనిషిజీవితం ‘బంధం’తో మొదలవుతుంది. తల్లిదండ్రులు, తోడబుట్టినవాళ్ళు, మిత్రులు, గురువులు పెళ్ళేయ్యాక పెళ్ళాం, బిడ్డలు.. ఇలా ఎన్నోబంధాలు కానీ కడదాకా కలిసి ప్రయాణం చేసే భార్యాభర్తల బంధం ఎంతో పటిష్టమైనది, విడదీయరానిది. అందునా వద్ధాప్యంలో ఈ బంధం మరింత బలపడి ఒకరికొకరుగా ఒకరికోసం ఒకరిగా మిగిలిపోతారు. కన్నవారు రెక్కలొచ్చి ఎగిరిపోతే మిగిలేది ఆ ఇద్దరే వద్ధాప్యం మనిషికి రెండో బాల్యం పసితనంలోని అలకలు, మంకుపట్టు, ప్రేమలు ఇవన్నీ పునరావతమౌతాయి. కొట్టినా అమ్మని వదలక కౌగిలించుకునే పసివాడులా దంపతుల మధ్య తగవులు, కీచులాటలు తాత్కాలికం. క్షణంలో మళ్ళీకలుస్తారు. కొత్తదనాన్ని తన వెర్రిఆలోచనలతోకోరుకున్న సుబ్బారాయుడు లోకం హర్షించని రీతిలో భార్యను దూరం పెడతాడు. స్నేహితుడు నారాయణ హితోక్తులు వినడు. తానొక కొత్తగేమ్‌ మొదలెట్టాననుకొంటాడు. కాని ఆ గేమ్ను తలక్రిందులు చేస్తూ ఆపైవాడు మరోగేమ్‌ ఆడి అతడ్ని మనస్తాపానికి గురిచేస్తాడు. తట్టుకోలేని సుబ్బారాయుడు విలపిస్తాడు. ఊహించని మరో మలుపుతో కళ్ళు తెరిచి తన తప్పును దిద్దుకునే ఇతివృత్తంతో ప్రదర్శన సాగింది.మూడో ప్రదర్శనగా పోలిదాసు శ్రీనివాసరావు రచించి, దర్శకత్వం వహించిన ‘రాత’ నాటికను వెలగలేరు థియేటర్‌ ఆర్ట్స్‌ వెలగలేరు కళాకారులు ప్రదర్శించారు. మనిషికి కష్టం కలిగితే నా రాతింతే, నా రాత బాగోలేదు అంటూ ఉంటాడు. సుఖం విషయంలో మాత్రం రాతను గాలికొదిలేస్తాడు. తాను పొందాల్సినవి మంచిగా పొందుతాడు, తాను తిరిగి ఇవ్వాల్సిన వాటి విషయంలో మాత్రం బాధ్యతా రహితంగా ఉంటాడు. అది ఎదుటి మనిషి విషయంలోనైనా, ప్రకతి విషయంలోనైనా. ఇలాంటి మనిషి నైజం వల్ల ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతోంది? సమాజం ఎటు పోతోంది? మనిషి జీవనం ఎలా సాగుతోంది? ఈ అనర్ధాలకు కారణం ఎవరు? ఇది ఎవరు రాసిన రాత? అనే ఇతివృత్తంతో నాటిక ప్రదర్శించారు.

➡️