ముగిసిన ‘అనంత’ బాలోత్సవం

Feb 15,2024 09:09 #Anantapur District, #Balotsavam
Ended 'Ananta' Balotsavam

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం నగరంలోని ఆర్ట్ప్‌ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ‘అనంత బాలోత్సవం’ బుధవారంతో ముగిసింది. మూడు రోజులపాటు ఉత్సాహ భరితవాతారణం, పిల్లలు ప్రదర్శనల నడుమ ఆద్యంతం బాలోత్సవం పండుగ వాతావరణాన్ని తెచ్చింది. ఈ నెల 12న ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో జిల్లాలోని సుమారు 150 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. అకడమిక్‌, కల్చరర్‌ కలిపి 62 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో సుమారు ఆరు వేల మంది విద్యార్థులు భాగస్వామ్యులయ్యాయి. పిల్లల ఆట, పాటల పోటీలు ఎంతో సంబరంగా జరిగాయి. ఆఖరి రోజు ముగింపు కార్యక్రమానికి బిసి వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కొఠారి కుష్బు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి ఆయన మట్లాడారు. ఆటవిడపు లేకుండా ఉంటున్న పిల్లలకు ఈ బాలోత్సవాలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. పిల్లలోని సృజనాత్మకతతోపాటు, వారిలోని ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మూడు రోజులపాటు జరిగిన సంబరాల్లో ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించడం పట్ల బాలోత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ కమిటీ అధ్యక్షులు షమీమ్‌ షఫివుల్లా, కార్యదర్శి సావిత్రి, కోశాధికారి జిలాన్‌, సభ్యులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️