భావోద్వేగాలు పంచాలి..!

Dec 24,2023 12:35 #Sneha

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలతో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్‌ అవసరాల కొత్తగా విడుదలైన ‘పిండం’ సినిమాలో నటించారు. మానవాతీత శక్తుల మీద పరిశోధనలు చేసే లోక్‌నాథ్‌ అనే పాత్రలో కనిపించారు. ‘దర్శకుడుగా కొంత అనుభవం ఉన్నా నటుడుగా ఎక్కువగా నేర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ప్రేక్షకులకు భావోద్వేగాలు పంచాలి. అందుకే నేను నటించే సినిమా కథకి సలహాలు ఇవ్వను. నటుడుగా మాత్రమే ఉంటా.’ అంటారు. మరి ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకుందాం.

శ్రీనివాస్‌ పుట్టింది కాకినాడ దగ్గరలోని మండపేట. అమ్మమ్మగారి ఊరు మండపేట. తండ్రి బ్యాంకర్‌. దాంతో విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో కూడా కొద్ది రోజులున్నారు. విజయవాడలో డిగ్రీ చదివారు. హైదరాబాద్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. ఫైనైట్‌ ఎలిమెంట్‌ ఎనాలసిస్‌ విషయంలో ప్రిన్స్‌టన్‌ ప్లాస్మా ఫిజిక్స్‌ లేబొరేటరీలో పనిచేసారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెల్స్‌ నుండి స్క్రీన్‌ రైటింగ్‌లో డిప్లోమా పొందారు. యూనివర్సల్‌ స్టూడియోస్‌ వద్ద స్క్రిప్ట్‌ స్క్రీనర్‌గా పనిచేశారు.

తిరిగి ఇండియాకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయత్నాలు చేశారు. అలా ‘అష్టా-చమ్మా’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో డైలాగ్స్‌, సన్నివేశాలు రాసి ఇచ్చారు. తర్వాత ‘ముగ్గురు’, ‘పిల్ల జమీందార్‌’, ‘వర ప్రసాద్‌ పొట్టి ప్రసాద్‌’ లాంటి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఊహలు గుసగుసలాడే అనే ప్రేమ-హాస్య కథా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగశౌర్య కథానాయకుడిగా నటించాడు. అప్పట్లో ఈ సినిమా విజయం సాధించింది. దాంతో శ్రీనివాస్‌కు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. తిరిగి నాగశౌర్యతో కలిసి ‘జ్యో అచ్యుతానంద’ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ మధ్యకాలంలో పెళ్లి ఎప్పుడూ అని చాలా మంది ఆయన్ని ప్రశ్నించగా ‘పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. ఈ మాటే నాన్న గారికి చెప్పా. జలస్‌ ఫీల్‌ అయ్యారు. ఎందుకంటే నా ట్రాక్‌ ఆయనకు బాగా నచ్చింది (నవ్వుతూ). నా అభిప్రాయం, నిర్ణయాలు ఆయన గౌరవిస్తారు. పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం తీసుకోవడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు. అనుభవంతోనే నిర్ణయాలు తీసుకోవడం అనేది మన భ్రమ తప్పితే రియాలిటీలో అలా ఉండదనేది నా ఫీలింగ్‌’ అంటూ తన పర్సనల్‌ లైఫ్‌ విషయాలను షేర్‌ చేసుకున్నారు. అవసరాల శ్రీనివాస్‌ ‘అరవింద్‌2, ‘సుకుమారుడు’, ‘చమ్మక్‌ చల్లో’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జిల్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జెంటిల్‌ మేన’్‌, ‘కంచె’ ఇలా చాలా సినిమాల్లో సహాయనటుడిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘బ్రహ్మాస్త్ర, అవతార్‌-2 సినిమాలకు తెలుగులో మాటలు రాసే అవకాశం వచ్చింది. మొదట భయం వేసింది. అయినా ప్రయత్నించా. హిందీ సినిమాలతో పోల్చితే ఇంగ్లీష్‌ సినిమాలకు తెలుగు సంభాషణలు రాయడం కొంచెం కష్టం. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకుని అవతార్‌-2 కి రాశాను.’

ఇప్పుడు సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘పిండం’ సినిమాలో శ్రీనివాస్‌ ముఖ్యపాత్రలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘నేను మామూలుగా హారర్‌ సినిమాలను పెద్దగా ఇష్టపడను. అయితే అనుకోకుండా ‘ప్రేమ కథా చిత్రమ్‌’ థియేటర్‌లో చూస్తున్నప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి ఆశ్చర్యపోయాను. కొంచెం భయపెడితే జనాలు శ్రద్ధగా సినిమా చూస్తారని అర్థమైంది. అయితే కేవలం భయపెట్టడమే కాకుండా, ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే పాయింట్‌ కూడా ఉండాలనేది నా అభిప్రాయం. అలాంటి సినిమానే ఈ ‘పిండం’. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నా. ప్రేక్షకులకు కథ నచ్చాలి. దాంతో పాటు నటులు కథలో లీనమై భావోద్వేగాలను పంచాలి. అప్పుడే వినోదం కలుగుతుంది.’ అంటారు మల్టీ టాలెంటెడ్‌ అవసరాల శ్రీనివాస్‌.

నివాసం : హైదరాబాద్‌

ఇతర పేర్లు : శ్రీ, శ్రీని, లంబూ

వృత్తి : నటుడు, రచయిత, దర్శకుడు

తల్లిదండ్రులు : వెంకట సత్యనారాయణ మూర్తి, నాగమణి

➡️