‘ఏకపక్ష’ ఫలితాలు ఆందోళకరం : మాయావతి 

Dec 4,2023 14:29 #Assembly Polls, #Mayawati

లక్నో :   నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ఈ ఏకపక్ష ఫలితాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు ఆందోళనకు గురిచేశాయని అన్నారు. ఈ ఫలితాలపై చర్చించి.. 2024 లోక్‌సభ ఎన్నికలపై వ్యూహాన్ని చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్‌ 10న లక్నోలో సమావేశం జరుగుతుందని అన్నారు.

”రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో పరిస్థితి చూస్తే హోరాహోరీ పోరు ఉంటుందనే భావన ఉంది. కానీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏకపక్షంగా వచ్చిన ఫలితాలు చూసి ప్రజలందరికీ అనుమానం ఆశ్యర్యం, ఆందోళన, భయం కలగడం సహజమే. ఎన్నికల వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకొంటే.. ఇలాంటి విచిత్రమైన ఫలితాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఆమోదించడం కష్టమే” అని ‘ఎక్స్‌’ లో ట్వీట్‌ చేశారు.

ప్రజలనాడిని గ్రహించడంలో ఘోరంగా విఫలం కావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమని అన్నారు. ఫలితాల పట్ల నిరుత్సాహ పడవద్దని ఆమె పార్టీ సభ్యులకు సూచించారు. బిఎస్‌పి కార్యకర్తలంతా పూర్తి శక్తుయుక్తులతో పోరాడారని, ఫలితాలు చూసి నిరాశ చెందవద్దని, అంబేద్కర్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో బిజెపి విజయం సాధించగా.. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు సాధించింది.

➡️