ఎన్నికల బహిష్కరణ- కుకీ సంఘాల నిర్ణయం

కోల్‌కతా : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని పలు కుకీ యువజన, మహిళా సంఘాలు నిర్ణయించాయి. మణిపూర్‌లో సుమారు ఏడాదిగా తమపై సాగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఒక ప్రకటన విడుదల చేశాయి. హింసాకాండ తీవ్రంగా సాగుతున్నా.. హింసాకాండకు పాల్పడుతున్న వారిని శిక్షించడంలో మణిపూర్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించాయి. విధ్వంసం, హింసలో బాధితులుగా మారిన కుకీలకు తగిన మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి. ఎన్నికల బహిష్కరణ ‘కుకీల దుస్థితిపై తక్షణమే దృష్టి పెట్టాలనే విజ్ఞప్తిగా భావించాలి’ అని సంఘాలు పేర్కొన్నాయి. ‘మాకు న్యాయం కోసం, మా హక్కుల పరిరక్షణ కోసం, మా బాధలు, ఉనికి గుర్తించడం కోసం ఈ పిలుపునిస్తున్నాం’ అని ఆ సంఘాలు తెలిపాయి. సమస్యల పరిష్కారానికి కేంద్రంతో అర్థవంతమైన చర్చల కోసం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాయి.
కుకీల నివాస ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీరు, వీధి దీపాలు, సరైన రోడ్లు లేవని తెలిపాయి. ‘గత ఏడాది మే 3 నుంచి సాగుతున్న హింసాకాండలో భాగంగా 20 మంది కుకీ మహిళలను హత్యాచారం చేశారు.. నగంగా ఊరేగించడం, అత్యాచారాలు, మైతి గూండాల దాడులు జరిగాయి. వీటిపై ఎన్‌ఐఎ లేదా సిబిఐ విచారణ లేదు. దాదాపు 360 కుకీల ప్రార్థనా మందిరాలను, ఏడు వేలకు పైగా ఇళ్లను తగలబెట్టారు’ అని ప్రకటన తెలిపింది. ‘మేం ఎన్నికల ప్రక్రియలో పాల్గంటే మేం ఎన్నికల నిబంధనలకు కట్టుబడాల్సి ఉంటుంది. తద్వారా మా గ్రామవాలంటీర్లు వద్ద ఉన్న కొద్దిపాటి ఆయుధాలను తొలగించాలి. మా గ్రామాలపై మైతి దాడుల నుంచి ఎవరూ రక్షించలేరు’ అని కుకీ సంఘాలు పేర్కొన్నాయి.

➡️