పింఛన్ కోసం వృద్ధుల పడిగాపులు

Apr 3,2024 11:33 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక సచివాలయం వద్ద పలువురు వృద్ధులు పింఛన్ డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈనెల మూడవ తేదీ వాలంటీర్లు కాకుండా సచివాలయ ఉద్యోగులే సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు ఉదయం నుండే పలువురు వృద్ధులు సచివాలయాల వద్ద పించన్ డబ్బుల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. రెండో తేదీ రాత్రి వరకు బ్యాంకుల వద్ద ఎదురుచూసిన డబ్బులు రాలేదని బ్యాంకులో నుండి తమ చేతికి డబ్బులు రాగానే పింఛన్లు పంపిణీ చేస్తామని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ప్రతిపక్షాలపై నెపం నెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే పెన్షన్ పంపిణీ ఆలస్యం చేస్తున్నారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతినెల 1వ తేదీ ఉదయం ఐదు గంటలకే ఇంటి వద్దనే పింఛన్ తీసుకునే వృద్ధులు వికలాంగులు ఏప్రిల్ నెల పింఛన్ తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల నుండి పింఛన్ డబ్బులు చేతికి అందిన తర్వాత పెన్షన్ పంపిణీ తేదీ నిర్ధారించి ఉంటే బాగుండేదని ఈ ఎండలకు పింఛన్ కోసం వచ్చిన పండుటాకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

➡️