రికార్డు స్థాయిలో కోడిగుడ్డు ధర

Dec 22,2023 11:07 #eggs, #price, #record high
  • రిటైల్‌లో రూ.7
  • రైతులకు దక్కేది రూ.5.85 మాత్రమే

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గుడ్డు ధర చూసి సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రిటైల్‌ మార్కెట్లో గుడ్డు రూ.7 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం ముగియడంతో కోడిగుడ్డు ధర అమాంతంగా పెరిగింది. గతేడాది ఇదే సీజన్‌లో రూ.6 ఉండేది. రెండేళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో ఉంది. దీంతో, రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. ఫలితంగా డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్డు ధర గతంలో ఎన్నడూ లేనంతంగా పెరిగినా తమకు రూ.5.85 లభించేస్తోందని, రూ.6 వస్తేనే గిట్టుబాటని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ ఉంది. సుమారు 300 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. 1.40 కోట్ల కోళ్ల పెంపకం అవుతోంది. రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 40 శాతం మేర గుడ్లు స్థానిక మార్కెట్లలో వినియోగిస్తుండగా, 60 శాతం గుడ్లు ఒడిశా, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పౌల్ట్రీ పరిశ్రమ నాలుగేళ్లుగా నష్టాల్లో ఉంది. ఈ ఏడాది నవంబర్‌లో హోల్‌సేల్‌ మార్కెట్‌లో గుడ్డు ధర రూ.4.50 మాత్రమే పలికింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో 2017లో గుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ.5.45కి చేరింది. తాజాగా ఈ రికార్డును బ్రేక్‌ చేస్తూ ధర రూ.5.85కు చేరింది. కోళ్లకు వినియోగించే మేత, దాణా ఖర్చులు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. మొుక్కజొన్న, సోయా దాణాను అధికంగా వాడుతుంటారు. మొక్కజొన్న దాణా టన్నుకు ఏడాదిలో రూ.18 వేల నుంచి రూ.25 వేలు, సోయా రూ.50 వేల నుంచి రూ.80వేలకు పెరిగింది. అదే స్థాయిలో ధర పెరగక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. 2019కి పూర్వం దాణా రేటు తక్కువగా ఉండడంతో అప్పట్లో లాభాలు వచ్చాయి. పశ్చిమబెంగాల్‌, యుపి వంటి రాష్ట్రాల్లో ఇటీవల అక్కడ ప్రభుత్వాలు పౌల్ట్రీలను ప్రోత్సహిస్తున్నాయి. సబ్సిడీలు కల్పిస్తున్నాయి. దీంతో, అక్కడ గుడ్ల ఉత్పత్తి పెరుగుతోంది. దీంతో, మన రాష్ట్రం నుంచి ఎగుమతులు తగ్గాయి. కొన్నిసార్లు స్థానిక మార్కెట్‌పైనే ఆధార పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గత రెండేళ్ల నుంచి కోళ్ల ఫారాల్లో నష్టాల కారణంగా కొత్త బ్యాచ్‌లు వేయడం లేదు.

రూ.6 వస్తేనే గిట్టుబాటు

గుడ్డుకు కనీసం రూ.6 వస్తేనే కొంత మేర గిట్టుబాటు అవుతుంది. మేత ధరలు, విద్యుత్‌ బిల్లుల పెట్టుబడి ఖర్చు కారణంగా ఒక గుడ్డు ఉత్పత్తి ఖర్చు రూ.5.50కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీ సౌకర్యం కల్పించాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలి. విద్యుత్‌ సంస్థ నుంచి రాయితీ అమలు చేస్తే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదా అయ్యి కొంత ఊరట లభించే అవకాశం ఉంది. దాణాను సబ్సిడీపై అందించి పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలి.

                                       – కెవి.ముకుందరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా నెక్‌ ఛైర్మన్‌, పౌల్ట్రీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు

➡️