పట్టుదలతో పతకాలు సాధిస్తోంది…

Dec 23,2023 11:09 #feature

‘అమ్మ వంటింటికే పరిమితమా.. ఇల్లు, పిల్లలతోనే కాలక్షేపం చేయాలా..’ అంటే.. కాదని, ఎంతోమంది మహిళలు పెళ్లయి, పిల్లల బాధ్యతలో తలమునకలౌతున్నా విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. వారి కోవలోకే చెందుతారు తెలంగాణకు చెందిన పార్వతీ శ్రీరామ్‌. ఇద్దరు బిడ్డల తల్లి. తెలంగాణ పెట్టుబడుల నిర్వహణ ఉద్యోగిగా రోజంతా కార్యాలయంలోనే పని. తీరికలేని పనులతో గడుపుతున్నా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు ఆమె. ఇటీవల మలేషియాలో జరిగిన అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో కాంస్య పతక విజేతగా నిలిచారు. ఆమె ప్రయాణం గురించి తెలుసుకుందాం.

             ‘నాకు చిన్నప్పటి నుండి ఆటలంటే ఇష్టం. పాఠశాల రోజుల్లో హాకీ బాగా ఆడేదాన్ని. పలు పోటీల్లో కూడా పాల్గొన్నాను. ఆ తరువాత పెళ్లి, పిల్లలతో ఆవైపు చూడలేదు. పిల్లలు పుట్టిన తరువాత శారీరక దృఢత్వం కోసం, రోజుకు 150 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేసేదాన్ని. అయితే 2015లో ఓ ప్రమాదం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కఠినతర వ్యాయామాల జోలికి పోకుండా, తేలికపాటి యోగా చేయడం అలవాటు చేసుకున్నాను. అప్పుడే బరువైన వస్తువులను అలవోకగా ఎత్తే సామర్థ్యం నాలో ఉందని గ్రహించాను. కానీ రెండేళ్ల వరకు దానిపై శ్రద్ధ పెట్టలేదు. పోటీల్లో పాల్గొనాలనీ అనుకోలేదు. నన్ను నేను నిరూపించుకోవాలంటే ఏదైనా సాధించాలి అని మాత్రం నిరంతరం తపన పడేదాన్ని. అందుకే ఈ ఏడాది ఫిబ్రవరిలో పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాను’ అంటున్న పార్వతి మార్చి నుండి పవర్‌లిఫ్టింగ్‌లో నైపుణ్య శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు.

నెల రోజులకే పోటీలకు వెళ్లా

ను’నెలరోజుల వ్యవధిలోనే అంటే ఏప్రిల్‌ నాటికే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 250 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాను. జులైలో వైజాగ్‌, రాజాంలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని వెండి పతకం సొంతం చేసుకున్నాను. ఆ రోజు నేను విజయం సాధిస్తానని కూడా అనుకోలేదు. సీనియర్లతో పోటీపడాల్సి వచ్చింది. ఆ భయం మనసులో పెట్టుకోకుండా నా ముందు ఉన్న లక్ష్యాన్ని ఛేదించాను. పతకం సాధించాను. ఇప్పుడు కూడా మలేసియా పోటీల్లో పాల్గొనేటప్పుడు నా కోచ్‌ మాతో లేరు. మొదట చాలా కంగారు పడ్డాను. కానీ నేను ఎంతవరకు సాధించగలనో అది చేసి చూపించాలి. అంతకు మించి ఏ ఆలోచన మనసులో రాకూడదని గట్టిగా అనుకున్నాను’ అంటూ తన క్రీడా విశేషాలు పంచుకున్నారు.

రోజంతా తీరిక లేకపోయినా

‘ఉద్యోగ నిర్వహణలో, పిల్లల బాధ్యతలో నిరంతరం పని ఒత్తిడి ఉండేది. ఎప్పుడు విరామం దొరికితే అప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపించేది. నాకు దొరికిన సమయం కేవలం మూడు గంటలే. సాయంత్రం 6:30 నుండి 9:30 వరకు జిమ్‌లో ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ఆ సమయంలోనే నన్ను నేను నిరూపించుకోవాలని నిరంతరం కష్టపడ్డాను. చివరికి సాధించాను’ అంటున్న పార్వతి 2025లో జరిగే కామన్‌వెల్త్‌ పోటీల్లో పాల్గొనాలని లక్ష్యం పెట్టుకున్నారు. యువతులు, మహిళల కోసం పవర్‌ లిఫ్టింగ్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలన్న ఆశయంతో ఉన్నారు. ‘చాలామంది మహిళలు పవర్‌ లిఫ్టింగ్‌ వైపు వెళ్లాలని అనుకోరు. శరీరంలో మితిమీరిన మార్పులు వస్తాయని భయపడతారు. కానీ 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా శరీర దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’ అంటున్నారు.

➡️