చదువులపై కరువు కాటు

Nov 25,2023 10:07 #Drought, #studies
  • పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు
  • జాడలేని సీజనల్‌ హాస్టళ్లు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలోని ఒకటో తరగతిలో 83 మందికిగానూ 27 మంది మాత్రమే హాజరవుతున్నారు. రెండో తరగతిలో 84 మందికిగానూ 36 మంది, మూడో తరగతిలో 103 మందికిగానూ 42 మంది, నాలుగో తరగతిలో 95 మందికిగానూ 35 మంది ఐదవ తరగతిలో 105 మంది విద్యార్థులకుగాను 30 మంది మాత్రమే హాజరవుతున్నారు. ఇది ఆ ఒక్క పాఠశాల పరిస్థితి మాత్రమే కాదు. కరువు కారణంగా జిల్లాలోని అనేక మండలాల్లో ఇదే దుస్థితి. తల్లిదండ్రులు బతకడానికి ఇతర ప్రాంతాలకు వెళ్తుండటంతో పిల్లలు కూడా వారితో బాటే వెడుతున్నారు. అభం, శుభం తెలియని చిన్నారులను కూడా కరువు రక్కసి వదలడం లేదు. తల్లిదండ్రులతో పాటే వారు కూడా బతకడానికి వెళ్లక తప్పని స్థితి నెలకొనడంతో చదువును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. తరుచు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతున్నా శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. గత ఏడాది ఇలా వలస వెళ్లే కుటుంబాలలోని పిల్లల కోసం 71 సీజనల్‌ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఆ దిశలో చర్యలే ప్రారంభించలేదు. దీంతో కరువు కాటుకు గురికాక తప్పనిస్థితి వారికి ఏర్పడింది. జిల్లాలోని ఆదోని డివిజన్‌ పరిధిలోని వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో వలసపోతున్నారు. వ్యవసాయంలో నష్టం రావడం, అప్పులే మిగలడంతో కౌలు రైతులు, పేద రైతులు కూడా పట్టణాలకు వలస బాటపడుతున్నారు. కోసిగి, మిగతా 5లో ఎమ్మిగనూరు, నందవరం, హోళగుంద, పెద్దకడబూరు మండలాల నుంచి వలసలు అధికంగా ఉన్నాయి. సుమారు 50 వేల మంది వరకు వలసపోయినట్లు అంచనా, వీరిలో ఒక్క కొసిగి మండలం నుంచే 30 వేల మంది వరకూ ఉన్నారు. పిల్లలతో సహా కుటుంబాలు వలస వెళ్లడంతో తరగతి గదులు వెలవెలబోతున్నాయి. కోసిగి మండలంలో 16,166 మంది విద్యార్థులు ఉండగా, తొమ్మిది వేల మంది మాత్రమే ప్రస్తుతం హాజరవుతున్నారు. . పెద్దకడబూరు మండలంలో 10,769 మందికి ఏడు వేల మంది మాత్రమే పాఠశాలలకు వస్తున్నట్లు సమాచారం, కౌతాళం మండలంలో 14,595 మందికి సుమారుగా పది వేల మంది హాజరవుతున్నారు. అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. మరో మార్గం లేక, తల్లిదండ్రులతో వలస వెడుతున్న విద్యార్థులు ఆ పథకానికి దూరం కాక తప్పనిస్థితి నెలకొంది. హాజరు శాతం తగ్గిందిమా పాఠశాలలో మొత్తం 469 మంది విద్యార్థులకుగాను ప్రస్తుతం 170 మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నారు. వలస వెళ్లిన తల్లిదండ్రులు పిల్లలను వారి వెంట తీసుకెళ్లారు. దీనివల్ల దాదాపు 64 మేరకు హాజరు శాతం తగ్గింది. వారంతా చదువుకు దూరమవుతున్నారు.- కె.సంజన్న, హెచ్‌ఎం, కోసిగి బాలికల ప్రాథమిక పాఠశాల. ప్రభుత్వానికి నివేదించాంవలస వెళ్తున్న విద్యార్థులను గుర్తించా లని ప్రధానోపాధ్యాయులకు, ఎంఇఒలకు చెప్పాం. సీజనల్‌ హాస్టళ్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. వలస వెళ్తున్న కుటుంబంలోని విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో ఉండేందుకు ఇష్టపడితే వారికి చేర్పించేందుకు విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకుంటారు. విద్యకు ఎవరూ దూరం కాకూడదు అనేదే మా లక్ష్యం.-వెంకట రంగారెడ్డి, కర్నూలు డిఇఒ

➡️