తాగునీరూ కొనుక్కోవాల్సిందే

Apr 5,2024 21:52

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సుమారుగా రెండు వేలకు పైగా కుటుంబాలు నివాసం.. ఎక్కువగా రియల్టర్లు, బిల్డర్లు వద్ద కొనుకున్న గ్రూప్‌ హౌస్‌లు, అపార్టుమెంట్లు. అది కూడా అధికార,ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనుయాయ వద్ద. అయినా ఆ కాలనీకి రోడ్లు, కాలువలు లేవు. విజయనగరం నుంచి నెల్లిమర్లవైపు వెళ్లే రూట్‌లో ఉన్న అయ్యప్పనగర్‌లో దుస్థితి ఇది.అయ్యప్ప నగర్‌ కాలనీ ఏర్పడి 20 ఏళ్లయినా నేటికీ మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు,కాలువలు వేస్తామని ఎన్నికల సమయంలో చెబుతున్న టిడిపి,వైసిపి నాయకులు ఆ తరువాత ఆ కాలనీవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయి.. పెద్దఎత్తున పోరాడితే తప్ప రహదారిపై స్పీడ్‌ బ్రేకర్లువేయని పాలకులు కాలనీ వాసులు సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. డబ్బులిచ్చి కొనుక్కుంటే తప్ప వారికి తాగునీరు లేని పరిస్థితి ఉంది. వాటర్‌ ట్యాంక్‌ కట్టిస్తామని చెప్పిన ప్రస్తుత పాలకులు ఆ హామీని మరచిపోయారు. 2006 సంవత్సరంలో వేసిన రోడ్లు తప్ప నేటికీ కొత్త రోడ్లు లేవు.దీంతో కాలనీలో రోడ్లు రాళ్లు తేలి ప్రమాదాలకు నిలయంగా మారాయి. రోడ్డు బాగోలేని కారణంగా మోడల్‌స్కూలుకు వెళ్లే విద్యార్థులు సైకిళ్లపై నుంచి పడిపోయి గాయపడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రోడ్డు మీదే మురికి నీరుకాలనీలో కాలువలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. కొన్ని అపార్ట్మెంట్లు వారు ఇంకుడు గుంతలు తీసుకొని మురికినీరు గుంతల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. మరోవైపు కాలనీలోని పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మందుబాబులతో పాటు, అనేకమైన అసాంఘిక కార్యకలాపాలకు నివాసంగా మారింది. చాలీచాలని వీధి లైట్లు..తరచూ దొంగతనాలు వేలాది కుటుంబాలు ఉన్నప్పటికీ అక్కడి వారంతా మధ్య తరగతి కుటుంబాలు. ఉదయం పది గంటల తర్వాత ఉద్యోగాలు, వివిధ పనులకు వెళ్లిపోతుంటే ఇదే అదునుగా చూసుకొని పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రి వేళ తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా దొంగలు చోరీకి పాల్పడుతున్నారు.

తాగునీరు సరఫరా చేయాలి

అయ్యప్ప నగర్‌లో ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రతికుటుంబం కేన్లతో తాగునీటిని కొనుక్కోవాల్సి వస్తోంది. పాలకులు తాగునీరు అందించి మా దాహాన్ని తీర్చాలి.

– నూకల సుధీర్‌,అయ్యప్ప నగర్‌ కాలనీ కార్యదర్శి

మురికి కూపం నుంచి కాపాడండి

అయ్యప్ప నగర్‌కాలనీ ఏర్పడి 20ఏళ్లయినా నేటికీ కనీస సౌకర్యాలైన రోడ్లు, కాలువలు, వీధి లైట్లు వంటివి లేవు. ఎన్నికల సమయంలో రావడం, తరువాత కాలనీ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కాలనీ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలి.- యుఎస్‌ రవికుమార్‌, అయ్యప్ప నగర్‌ కాలనీ వాసి

➡️