నాటకం… నవజీవన సందేశం

Mar 27,2024 16:41 #drama, #Rajababu Kancharla, #Sneha, #Stories

నాటకం సమాజ జీవన చిత్రణం… మానవ జీవిత ప్రదర్శనం
నాటకం మనిషి జీవన సురాగం… ప్రగతికి నవజీవన సందేశం.
మనిషిని పెద్దగా చూపించేది సినిమా అయితే, అదే మనిషిని చిన్నగా చూపించేది టీవీ.
కానీ, మనిషిని మనిషిగా చూపించేది నాటకం.
సంక్షోభం నుండి ప్రశాంతతవైపు, ఆవేదన నుండి ఆనందంవైపు,
విలాపం నుండి ఉల్లాసం వైపు, అంధకారం నుండి ప్రకాశం వైపు నడిపించేది నాటకం.
‘ఆంగికం భువనం యస్య
వాచికం సర్వవాజ్మయమ్‌
ఆహార్యం చంద్రతారాది
తం వందే సాత్వికమ్‌ శివమ్‌’ అన్నారు.
ఈ చతుర్విధాభినయాలు నాటక ప్రదర్శనకు పట్టుగొమ్మలు.
ఆ విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేదే ‘ప్రపంచ రంగస్థల దినోత్సవం’.
ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

‘కావ్యేషు నాటకం రమ్యమ్‌’- కావ్యాలలో నాటకం రమ్యమైనదని అర్థం. కావ్యాలలో నాటకానికున్న ప్రాధాన్యతకీ, ప్రాచుర్యానికీ అద్దం పడుతుందీ వాక్యం. ‘నాటకాంతం హి సాహిత్యం’ అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే- అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకమని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ… ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తర్వాత మాత్రమే నాటకాన్ని రచించాలని, అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని కాళిదాసు భావన. వస్తురూపాన్నీ, భావగంధాన్నీ, ఆనందాన్నీ, సామాజిక ప్రయోజనాన్నీ, సందేశ స్వరూపాన్నీ తెలియజేయడానికి దృశ్య రూపకమైన సౌలభ్యం వుండటం వల్లనే నాటక ప్రక్రియ లలితకళల సమాహారమైంది. రచయిత తాను చెప్పదలచిన సందేశాన్నీ త్వరితగతిన సామాజికుల హృదయంలో నాటడానికి, నాటకం అనువైన సాధనం. నాటకంలోని పాత్రలు రంగస్థలంపై, హావభావాలతో, సంభాషణా చాతుర్యంతో, పాత్రోచితమైన వేషధారణతో, నవరసాలకు ప్రతినిధులై, ప్రేక్షక మనోఫలకంపై నిలిచిపోయేటట్లు ప్రదర్శించినప్పుడు ఆ మాట, ఆ పాట, ఆ చేష్ట, ఆ భావం పదునెక్కి ఆశించిన ఫలితాన్నిస్తాయి. పౌరాణికం, చారిత్రకం, సాంఘీకం- నాటక వస్తువు ఏదైనా ఉన్నత విలువలు కలిగివున్నప్పుడు, మనిషి జీవితం అందులో ఒదిగిపోయినప్పుడు అది రసజ్ఞుల మన్ననలకు పాత్రమవుతుంది. కాబట్టే, ‘నాటకం రసాత్మకం.. కావ్యం’ అన్నారు. ‘రవి గాంచని చోట కవి గాంచు’నన్నది కవిత్వ విస్తృతికి, గాఢతకు, సమకాలీనతకు దర్పణం. సమాజాన్ని భిన్నకోణాల్లో స్పృశించి దాని స్వభావాలను భిన్న పాత్రలతో చిత్రీకరించగలిగే సృజన, దూరదృష్టి కవి సొంతం. కవి కలానికి ఉండే ఆలోచనల బలం విశ్వజనీన పాత్రలకు జీవం పోస్తుంది. కాలం, ప్రాంతం, భాష ఏదైనా- ఆయా పాత్రలు నిత్య నూతనంగా వెలుగొందుతాయి. రంగస్థలంపై రస రమ్యతను రాగరంజితమొనర్చిన విభిన్న పాత్రలెన్నింటినో సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా తన నాటకాలతో ఆంగ్ల భాషను పరిపుష్టం చేసిన మహాకవుల్లో షేక్స్‌పియర్‌ది అగ్రతాంబూలం. 20వ శతాబ్దపు పోరాట ఆయుధంగా ‘ఆధునిక వీధినాటిక’ను సప్ధర్‌ హష్మి అభివర్ణించారు. ఆ దిశగా వీధి నాటకాన్ని శక్తివంతమైన కళారూపంగా, పోరాట ఆయుధంగా మలచడంలో ఆయన కృషి ఆదర్శప్రాయం.

 


జీవన సందేశం ..
‘నానా భావోపసంపన్నం నానావస్థాంతకమ్‌/ లోకవృత్తానుకరణం నాట్యమేవన్మయాకృతమ్‌/ దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినామ్‌/ విశ్రాంతి జననం కాలేనాట్యమే తద్భవిష్యతి’ … నాటకానికి అలంకారికులు ఇచ్చిన నిర్వచనం ఇది. అంటే- నాటకంలో అనేక భావాలు వుండి, లోకంలో వుండే అనేక సమస్యలు ప్రతిధ్వనించేదే నాటకం. అంతేగాక, దుఃఖితులకు, శ్రమైక జీవులకు, శోకంతో ఉండే ప్రజలకు విశ్రాంతి కలిగించి, వారికి స్వాంతన, సంతోషం, ఉపశమనం కలిగించటం నాటకం లక్ష్యం… లక్షణం. దీని ఆధారంగానే భారతీయ సాహిత్యం, అందునా నాటక సాహిత్యం విలసిల్లింది. నాటకం సమాజానికి ప్రతిరూపం. నాటకం యొక్క విశిష్ట లక్షణం… ప్రజాచైతన్యం… జీవన సందేశం… జీవిత ప్రదర్శనం. మనసులకు ఉల్లాసం కలిగించే ప్రక్రియ. పంచేంద్రియాల ద్వారా మనసుల్ని రంజింపజేసే మాధ్యమం. మానసికోల్లాసంతో పాటు జీవితంలోని మంచి చెడుల్ని గురించిన వివేచన కలిగించడం దీని బాధ్యత. నిజానికి ఏ ఇతర కళారూపం కూడా మనిషిని ఆసాంతమూ అలరించలేదు. సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ నాటకం సమాజాన్ని అధికంగా ప్రభావితం చేస్తుంది. అందులోనూ సాంఘిక నాటకం సమాజంలోని ప్రతి అంశాన్నీ స్పృశిస్తుంది. ప్రతి సమస్యకూ స్పందిస్తుంది. ముఖ్యంగా వరకట్నం, స్త్రీల సమస్యలు, అంటరానితనం, దళిత సమస్యలు, కార్మిక సమస్యలు, కులాంతర వివాహాలు, వేశ్యా సమస్యలు, నిరుద్యోగం, రాజకీయం ఇలా.. సమాజంలోని ప్రతి అంశంపైనా, సమస్యపైనా నాటకం స్పందిస్తుంది. తన ప్రభావాన్ని చూపుతుంది. కన్యాశుల్కం, వరవిక్రయం, చింతామణి, ఎన్జీవో నుండి ఇటీవలి ‘పడమటి గాలి’ వరకూ వచ్చిన అనేక నాటకాలు ఈ కోవలోనివే. లెనిన్‌ చెప్పినట్లుగా ‘కళ ఒక సాధనం. జన చైతన్యానికి అదొక ఆయుధం’. కళ ప్రజలది. ప్రజల నుంచి ప్రజలకు అనే విషయం మనకు అవగతమవుతుంది. ప్రజలు కోరుకుంటున్న ఓ పరిష్కారానికి ఈ కళారూపం ఓ బొమ్మకట్టి రేఖామాత్రంగా ఆవిష్కరిస్తుంది. ‘మనం మాటల ద్వారా మనోభావాల్ని, కళ ద్వారా మన అనుభూతులను వెల్లడిస్తాం. ఒకరి అనుభూతిని ఇతరులు పొందేట్లు చేసే ఉద్దేశ్యంతో కొన్ని సంజ్ఞల ద్వారా ఆ అనుభూతిని వెల్లడించడానికి పూనుకోవడంతో కళ ఆరంభమవుతుంది..’ అంటారు టాల్‌స్టాయ్.
సుమారు నాల్గవ శతాబ్దంలో ‘ది పెర్సియన్స్‌’ నాటికను గ్రీకులు వేసారని చెబుతారు. ప్రపంచంలో మొట్టమొదటి నాటకాన్ని ఎథెన్స్‌లోని దైనోసిస్‌ థిóయేటర్లో ప్రదర్శించారని చరిత్ర చెబుతోంది. మన దేశంలో క్రీ.పూ నాల్గవ శతాబ్దంలో భరతముని రాసిన నాట్య శాస్త్రమే నాటకానికి స్ఫూర్తి అన్న మరో వాదన కూడా వుంది. అతి ప్రాచీనమైన కళల్లో నాటకం ఒకటి. భారతీయ రంగస్థలం రుగ్వేద కాలం నుండీ ఉందని అంటారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం, భవభూతి రచించిన మాలతీమాధవీయం వంటి నాటకాలు నేటికీ అపురూపమైనవే… ఆదరణీయమైనవే!

 

సమాహార కళ..
నాటకం శ్రవణ సహిత దృశ్యకావ్యం నాటకం. భారతీయ సంస్కృతిలో కళల ప్రాముఖ్యత ఎంతైనా వుంది. కళలు నాగరికతకు, ఆత్మ వికాసానికి ప్రతీకలుగా నిలిచాయి. సంగీతం, పాటలు, నృత్యాలతో కూడి ప్రక్రియ. నాటకం రక్తికట్టాలంటే సంగీతం, సాహిత్యం జోడుగుఱ్ఱాల్లా సాగాలి. అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ నాటకం నిత్యనూతనం. అన్ని సాహిత్య ప్రక్రియల, అన్ని కళల సమాహారం నాటకం. నాటకంలో కవిత్వం, వ్యాసం, కథా లక్షణాలు ఇమిడివుంటాయి. ‘నాట్యంలో ప్రదర్శించబడని జ్ఞానం లేదు, శిల్పం లేదు, విద్య లేదు, కళ లేదు, యోగం లేదు, కర్మ లేదు… అని భరతముని ‘ప్రణీత నాట్య శాస్త్రమ్‌’ చెబుతోంది. మానవజాతిలో వున్న భిన్న సంస్కృతుల ఆధారంగా విభిన్న కళలు అవతరించాయి. ప్రాచీన భారతీయ సంప్రదాయానుసారం వాటిని అరవైనాలుగు కళలుగా విభజించారు. వాటిలో కొన్ని రస ప్రధానాలు, మరికొన్ని ఉపయోగితా ప్రధానాలు. రస ప్రధానాలైన కళలు లలిత కళలని, ఉపయోగితా ప్రధానాలు చేతి పనులని వ్యవహరించబడుతున్నాయి. లలిత కళలుగా పరిగణించబడ్డ వాటిలో ప్రధానమైనవి చిత్రకళ, శిల్పకళ, వాస్తుకళ, సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం ప్రధానమైనవి. నాటకం, నాట్యం, నటన, నటుడు అనే శబ్దాలకు ‘నట్‌’ అనేది తొలిరూపం. నట్‌ అంటే అవస్కందన. అవస్కందన అంటే చెడును ఎదిరించి నశింపచేసేదని అర్థం. అందువల్ల నాటకం సమాజంలోని అభివృద్ధి నిరోధక శక్తులను ఎదిరించి, వాటిని నశింపజేసేదని అర్థం. లలిత కళలలో ఒకటైన నాటకం, మిగతా వాటిని ఆశ్రయించి వుంటుంది. అంటే, సంగీత, సాహిత్యాలను ఆలంబన చేసుకొని ప్రాణం పోసుకుంటుంది. అందుకే నాటకం సమాహారకళగా పిలవబడుతోంది. కేవలం ఇది సమాహారకళగానేకాక వివిధ వ్యక్తుల కృషి, వివిధ స్థాయిల నుంచి పదర్శన పతాకస్థాయికి చేరేంత వరకు వుంటుంది. అంటే రచయిత, నటీనటులు, సాంకేతిక నిపుణులు, వీరితోపాటు సహృదయులైన ప్రేక్షకులు, వీరందరి కృషి వల్ల నాటకం విజయవంతమౌతుంది. అందుకే నాటకాన్ని సమాహార కళ అనే కాక సహకార కళగా కూడా పిలుస్తారు.

 


ప్రతి ప్రదర్శనలోనూ కొత్తదనం..
నాటకం దృశ్యకావ్యం. నాటకం నిత్యనూతనం… సజీవం. ప్రపంచ గమనాన్ని ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ, ప్రతిస్పందిస్తూ వుంటుంది. సమాజం యొక్క మనోభావాల్ని, జీవన గమనాల్ని వ్యాఖ్యానించగలిగిన శక్తి నాటకానికి వుంది. అందుకే నాటకానికి తనదైన ప్రపంచం వుంటుంది అంటాడు పీటర్‌ బ్రూక్‌. నాటకం ప్రపంచ గడియారం మీద ఆధారపడదు. తనదైన కాల నియమాల్ని పాటిస్తుంది. వీటిని పాటిస్తూనే సహజసిద్ధమైన ప్రపంచాన్ని తనదైన శక్తి, భాష, రంగు, రుచులతో పరిభాషిస్తుంది, పలకరిస్తుంది, పరామర్శిస్తుంది, విమర్శిస్తుంది. చూసే ప్రేక్షకులు మారుతుండొచ్చు గాని… నాటకం ప్రతి ప్రదర్శనా కొత్తగానే వుంటుంది. నిన్నటి నటన, ప్రదర్శన, ఉద్వేగం… ఇవాళ ఒకరకంగా వుండొచ్చు. రేపు మరోలా వుండొచ్చు. నదీ ప్రవాహం ఒక్కోచోట ఒక్కోరకంగా ఉన్నట్లు… ప్రతి నాటక ప్రదర్శన నిత్యనూతనం. అదే నాటకం యొక్క గొప్పతనం… విశిష్టత. నాటకం సమస్త రుగ్మతల నివారణకు దివ్యౌషధం. రైతుల సమస్యలపై కొరడా ఝుళిపించినట్లు సంభాషణలుండాలి. రైతుల ఆత్మహత్యల నివారణకు నాటకం దోహదకారి కావాలి. బతుకుబండి ఈడ్చలేని అభాగ్యులకు నాటకం మార్గదర్శి కావాలి. కనుక- నాటకం సమాజానికి అత్యంత అవసరమైన కళారూపం. అందుకే ‘ఒక దేశ సంస్కృతి తెలుసుకోవాలి అంటే ఆ దేశ నాటకాన్ని చూడాలి’ అన్నాడో మహానుభావుడు. అంటే భూత, భవిష్య, వర్తమానాలకు వారధిగా నిలిచే ఏకైక కళారూపం నాటకం.

 


ఆలోచనను రేకెత్తించేలా
గతం పునాదులపైనే భవిష్యత్‌ నిర్మాణమౌతుంది. గతాన్ని మరిచిపోయిన సమాజానికి భవిష్యత్‌ వుండదు. ఆ గతంలోని మంచినీ, మేలిమినీ నిలుపుకోవడం, అభివృద్ధి చేసుకోవడం ఆయా సమాజాల బాధ్యత. సినిమాల కారణంగా నాటకానికి, టీవీ, ఇంటర్నెట్‌ కారణంగా సాహిత్యానికి ఆదరణ కరువైందనే ధోరణి సమసి పోవాలి. కొత్తగా ఒక ప్రక్రియ అభివృద్ధి చెందినప్పటికీ అంతకు ముందున్న ప్రక్రియ అంతరించిపోకూడదు. కవిత్వంలో అనేక రకాల ప్రక్రియలు ముందుకొస్తున్నా ప్రాచీనకాలం నుంచి వస్తోన్న కవిత్వ ప్రక్రియ మనగలుగుతూనే వుంది. అదేవిధంగా సమస్త కళలను తనలో ఇముడ్చుకున్న సినిమా వర్థిల్లినప్పటికీ, నాటకం కూడా తన ఉనికిని కాపాడుకోవాలి. పశ్చిమ దేశాల్లో ఇప్పటికీ సజీవంగా వున్న రంగస్థలం… మన దేశంలో మరాఠీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కొత్త పుంతలు తొక్కుతూండగా, తెలుగునాట మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం ఉంది. ‘కన్యాశుల్కం’ నాటకం సమాజ సంస్కరణ దిశగా మొదలై, మూఢవిశ్వాసాలపై సంధించే అస్త్రంగా, జనచైతన్యానికి బలమైన ఆయుధంగా మారింది. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అనే భావాన్ని కళాకారుల్లో ప్రోది చేసి రంగస్థలానికి ఒక దిశానిర్దేశాన్నిచ్చింది ప్రజానాట్యమండలి ప్రదర్శించిన ‘మా భూమి’ నాటకం ప్రజల్లో చైతన్యాన్ని ప్రజ్వలింపజేసింది. ఇటీవలి అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం… పాటిబండ్ల ఆనందరావు ‘పడమటి గాలి’. ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా పల్లె జీవితంలో వెల్లువెత్తిన సంక్షోభాన్ని ప్రతిబింబించింది. సమాజ చైతన్యానికి ఉపకరించే ఇలాంటి నాటకాలు మరిన్ని రావాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వంతో పాటు నాటక కళా ప్రియులంతా నడుం కట్టాల్సిన అవసరముంది. ‘జీవితమే ఒక నాటకరంగం, మనమందరం పాత్రధారులం’ అని షేక్స్‌ పియర్‌ అన్నట్టుగా, నాటకం జీవితానికి ప్రతిబింబం కావాలి. నాటకంలోని ఏ కథైనా అది ఏదోక జీవితాన్ని ఆలంబన చేసుకునే వుంటుంది. అది పౌరాణికం గాని, సాంఘికం గానీ, చారిత్రాత్మకం గానీ… ఏదైనా సరే… ఇదే సూత్రం వర్తిస్తుంది. అదేవిధంగా నాటకం సందేశాత్మకంగా, సమాజానికి ఉపయోగపడేదిగా, ప్రేక్షకులలో రసానుభూతిని కలిగించడంతో పాటు ఆలోచనను రేకెత్తించే విధంగా వుండాలి. ఒక మంచి నాటకం ప్రజల్లో, వారి ఆలోచనా విధానంలో మార్పు తెస్తుందనేది నిజం. అప్పుడే ప్రపంచ రంగస్థల దినోత్సవానికి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.

 


తెలుగు నాటకరంగం..
తెలుగు నాటక ప్రక్రియ ఎప్పుడు మొదలైందో కచ్చితంగా చెప్పలేకపోయినా… వెయ్యేండ్లకు ముందే నాటకాలున్నాయని తెలుస్తున్నది. తెలుగులో ఆదికావ్యమైన మహాభారత అవతారికలో ఆదికవి నన్నయ ‘రసాన్విత కావ్య నాటకముల్‌ పెక్కుజూచితి’ అన్నాడు. అయితే, అవి సంస్కృత నాటకాలో, ప్రాంతీయ భాషలోని నాటకాలో తెలియదు. పాల్కురికి సోమన కూడా నాటకం అన్న మాటను ఉపయోగించాడు. అయితే, తెలుగు నాటకాలు చాలావరకు సంస్కృత నాటక అనువాదాలే. వసంతసేన, చారుదత్తం, మృచ్ఛకటికం, అభిజ్ఞాన శాకుంతలమ్‌, నరకాసుర విజయ వ్యాయోగం వంటి నాటకాలన్నీ సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించబడినవే. అనువాద నాటకాలతో ప్రారంభమైనా, ఆ తర్వాత స్వతంత్ర నాటకాలు కూడా వచ్చాయి. 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రచించిన ‘మంజరీ మధుకరీయము’ తొలి తెలుగు నాటకం. ఆ తర్వాత తెలుగు నాటకాలు పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. నవజాతి నిర్మాణానికి గట్టి పునాది వేయగల ఆశాజ్యోతి తెలుగు నాటకం. వ్యక్తిని, సమాజాన్ని ఆందోళన పరిచే సమస్యలకు పరిష్కారాన్ని చూపి, నిద్రిస్తున్న యువశక్తిని మేల్కొలిపి, కార్యోన్ముఖులను చేసే శక్తి నాటకానికి వుంది. అదే శక్తి తెలుగునాట స్ఫూర్తిని రగిలించింది. ‘మా భూమి’ వంటి మహత్తర నాటకాలకు వేదికయింది.
ఇది గత చరిత్ర. వర్తమానానికి వస్తే.. ప్రపంచం నలుమూలలా నాటకం అభివృద్ధి చెందింది, ఒక్క తెలుగు నాట తప్ప. పూర్వపు నాటకాలకీ ఇప్పుడు ప్రదర్శించే నాటకాలకీ చాలా తేడా వుంది. రచనా పరంగా, రంగస్థల పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. నటన అన్నది స్థల, కాలాల్ని బట్టీ మారుతుంది. కేవలం వినోదం అన్న స్థాయి నుండి నాటకం ఒక అనుభవం అన్న స్థాయికి ఎదిగింది. విదేశాల్లో ఈ అనుభవాన్ని పొందడానికి ఎంతైనా ఖర్చుపెడతారు. తెరతీయగానే మనల్ని నాటకంలో లీనమయ్యేలా చేస్తుంది. మనం కూడా నాటకంలో పాత్రధారులమేనన్న అనుభూతి కలుగుతుంది. సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. రంగస్థలం మీదే వర్షమూ, తుఫానూ, మంటలూ, మంచూ చూపించడం, మేఘాలు రప్పించడం వంటి ప్రక్రియలు చేకూర్చి రంగస్థలాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్ళింది సాంకేతిక విజ్ఞానం. బ్రాడ్‌వే షోలకీ, ధియేటర్‌కీ ఉన్న ఆదరణ ఇంతా అంతా కాదు. ఇదీ పాశ్చాత్య దేశాల్లో నాటకానికున్న విలువ.


బెంగాలీ, మరాఠీ, కన్నడ నాటకరంగాలతో పోల్చితే తెలుగు నాటక రంగం ఏమాత్రం ఎదగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. పరిషత్తులూ, ప్రదర్శనలూ పెరిగాయి తప్ప నాణ్యత పెరగలేదు. రంగస్థలానికి కావల్సిన సౌకర్యాలు గానీ.. ధియేటర్లు గానీ లేవు. ఏదో ఒక హాలు తీసుకొని నాటకం వేయ్యాల్సిన పరిస్థితే ఇప్పటికినీ వుంది. 1960ల నాటి నాటకాల పరిస్థితిని దాటి పోలేదు. రచనపరంగా, నటన పరంగా కూడా అదే పరిస్థితి. రాశి పెరిగింది కానీ వాసి లేదు. తెలుగు నాటక రంగం కొత్తతరం నటుల్ని తయారు చెయ్యలేకపోతోంది. వున్న నటులకూ ఉపాధి కొరవడుతోంది. నేటికీ తెలుగువారికి నటులు అంటే సినిమా నటులేనన్న అభిప్రాయం స్ఫురణకొచ్చే పరిస్థితే వుంది. నాటక రంగాన్ని మరో మెట్టుకి తీసుకెళ్ళాలంటే… ప్రభుత్వంతో పాటు నాటక ప్రియులూ నడుం కట్టాలి. నాటకానికి జీవం పోయాలి. తెలుగు నాటక వికాసానికి సదస్సులు, సమీక్షలు జరగాలి. నాటక కళాకారుల బాగోగులు పట్టించుకోవాలి. ప్రపంచ రంగస్థల పటంలో తెలుగు నాటకానికీ స్థానం కల్పించే విధంగా ప్రభుత్వం చేయూతనివ్వాలి. ప్రపంచ రంగస్థల దినోత్సవం ఉద్దేశ్యం కూడా అదే!

  • ఇది నాటక చరిత్ర
    –> 534 దీజలో కవి, రచయిత థెస్పిస్‌ తన బందంతో ఏథెన్స్‌కు వచ్చి మార్కెట్‌లో ప్రదర్శన ఇచ్చాడు.
    –> 55 దీజ రోమ్‌ యొక్క మొదటి స్టోన్‌ థియేటర్‌ – పాంపే ది గ్రేట్‌ రోమ్‌లో మొదటి శాశ్వత రాతి థియేటర్‌ను నిర్మించింది.
    –>1585లో, ప్రపంచంలోని పురాతన థియేటర్‌గా విస్తతంగా పరిగణించబడుతుంది, ఇటలీలోని విసెంజాలోని టీట్రో ఒలింపికో, సోఫోక్లెస్‌ యొక్క ”ఈడిపస్‌ ది కింగ్‌” ప్రదర్శనతో ప్రారంభించబడింది.
    –>ప్రపంచ నాటకరంగ చరిత్రలోనే తొలి సాంఘిక నాటకంగా ‘మృచ్ఛకటికం’ గుర్తింపు పొందింది.
    –>సంస్కృతం నుంచి ఆంధ్రీకరించిన తొలి రూపకం ‘నరకాసుర విజయ వ్యాయోగం’.
    –> ఆంగ్లం నుంచి ఆంధ్రీకరించిన తొలి నాటకం ‘సీజరు చరిత్ర’. దీనిని 1876లో వావిలాల వాసుదేవ శాస్త్రి రచించారు.
    –> మొట్టమొదటి సాంఘిక నాటకం ‘నందక రాజ్యం’
    –> కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన ‘వ్యవహార ధర్మ బోధిని’ నాటకాన్ని 1880లో మొట్టమొదట ప్రదర్శించారు.
    –> తొలి తెలుగు విషాద నాటకం ‘విషాద సారంగధర’. దీనినిఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు 1887లో రచించారు.
    –> ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావు 1905లో ‘వాణీవిలాస నాటకశాల’ను స్థాపించారు.

రంగస్థల దినోత్సవం లక్ష్యాలు ..
థియేటర్‌ ఆర్ట్స్‌ యొక్క ప్రాముఖ్యత గురించి జరుపుకోవడానికి, అవగాహన పెంచే రోజు. ఈ రోజును ప్రతి యేడాది మార్చి 27న నిర్వహిస్తారు. అయితే, ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐటిఐ) ప్రతి యేడాది నిర్దిష్ట థీమ్‌ను కేటాయించదు. గత 59 సంవత్సరాలుగా ”థియేటర్‌ అండ్‌ ఏ కల్చర్‌ ఆఫ్‌ పీస్‌” అనే థీమ్‌తోనే రంగస్థల దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1961 జూన్‌లో, పారిస్‌లోని హెల్సింకీలో ప్రఖ్యాత ఫిన్నిష్‌ రచయిత, కవి, నవలాకారుడైన కార్లో ఆర్వీ కివిమ్మా ప్రేరణతో ప్రపంచ నాటకరంగం ఏకమయ్యింది. 1962 మార్చి 27న తొలి ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాటి మొదటి సందేశాన్ని ఫ్రాన్స్‌కు చెందిన జీన్‌ కాక్టే అందించాడు. అప్పటినుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు.

🎭 ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
🎭 ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం
🎭 విస్తృత స్థాయిలో నాటక సంస్థలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
🎭 మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
🎭 నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం
🎭 కొత్త తరాన్ని ప్రోత్సహించడం.

  • రాజాబాబు కంచర్ల, 9490099231
➡️