ఇంటింటి ప్రచారానికి అనుమతి అవసరం లేదు

ఇంటింటి ప్రచారానికి

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

* జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతి అవసరం లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ స్పష్టం చేవారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించి ఆయా రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారం నిర్దేశిత వేళల్లో ఎప్పుడైనా చేపట్టవచ్చన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలున్నా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమకు తెలియజేయాలని, వాటి పరిష్కారానికి నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఇప్పటివరకు 972 ఫిర్యాదులు రాగా, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకున్నామన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, 26న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 29 చివరి తేదీ అని తెలిపారు. రాజకీయ పార్టీలు అనుమతుల కోసం సువిధ, ఎన్కోర్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి ఆలస్యం లేకుండా మంజూరు చేస్తున్నామన్నారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు, మంచానికే పరిమితమైన రోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించామని చెప్పారు. ఇది తప్పనిసరి కాదని, మే 12వ తేదీ వరకు హోం ఓటింగ్‌ సౌకర్యానికి వీరికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, రౌతు శంకరరావు (వైసిపి), పి.ఎం.జె బాబు (టిడిపి), సురేష్‌ సింగ్‌ (బిజెపి), లాస సోమేశ్వరరావు (బిఎస్‌పిి), డి.గోవింద మల్లిబాబు (కాంగ్రెస్‌), రట్టి ప్రకాశరావు (సిపిఎం), ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️