కలవరపరుస్తున్న సుప్రీం తీర్పు!

Dec 11,2023 21:57 #cpm politburo
  • సిపిఎం పొలిట్‌బ్యూరో వ్యాఖ్య

న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రపతిపత్తి తొలగింపును సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కలవరపరిచేదిగా ఉందని సిపిఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. ఈ తీర్పు వల్ల మన రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటైన ఫెడరల్‌ వ్యవస్థ తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. భారత యూనియన్‌లో విలీనానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాక, జమ్మూ కాశ్మీర్‌కు ఎలాంటి సార్వభౌమాధికారం వుండబోదని, జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగం కూడా నిరర్థకంగా మారిందని సుప్రీం తీర్పు పేర్కొంది. కానీ, ఆ విలీనంపై సంతకాలు ఇప్పుడు రద్దు చేయబడిన 370వ అధికరణలో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను నిలుపుకునే షరతు మీదే జరిగాయి కదా? అని పొలిట్‌బ్యూరో గుర్తు చేసింది. భారత యూనియన్‌లో ఇతర అన్ని రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం కూడానని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. తద్వారా, 371వ అధికరణలోని వివిధ క్లాజుల కింద ఈశాన్య రాష్ట్రాలకు, మరికొన్ని రాష్ట్రాలకు మంజూరైన ప్రత్యేక హక్కులు కూడా జమ్మూ కాశ్మీర్‌ కోల్పోయేలా చేసిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ తీసుకున్న చర్యకు సంబంధించిన తప్పొప్పులను కూడా ఈ తీర్పు పట్టించుకోలేదు.. పైగా రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తామంటూ సొలిసిటర్‌ జనరల్‌ హామీ ఇచ్చారని పేర్కొంది. అదే సమయంలో లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సమర్ధించింది. అంటే పూర్వపు జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని పునరుద్ధరించడమనేది జరగదు, అందులో కొంత భాగానికి మాత్రమే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారు. అది కూడా కాగితంపై హామీగానే ఉన్నది.

విడ్డూరమైన అంశమేమిటంటే, 2024 సెప్టెంబరు 30లోగా జమ్మూ కాశ్మీర్‌కు ఎన్నికలు నిర్వహించాలంటూ భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించడం. అంటే జమ్మూ కాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణను కొసాగించేందుకు సుదీర్ఘ సమయాన్ని ఇవ్వడమేనని పొలిట్‌బ్యూరో విమర్శించింది.

పార్లమెంటులో జమ్ము కాశ్మీర్‌ కు సంబంధఙంచిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న 2019 ఆగస్టు5 కుముందు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.ఎన్నికైన శాసనసభ లేదు. ఆ సమయంలో రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌ యొక్క సమ్మతిని రాష్ట్ర సమ్మతిగా పరిగణించారు. ఎన్నికైన సభలేనప్పుడు గవర్నరు ఆమోదాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చా? అని ప్రశ్నించింది. దీనివల్ల, రాష్ట్రపతి పాలన విధించబడే, దాని సరిహద్దులు మార్చబడే లేదా రాష్ట్ర హోదాను రద్దు చేయబడే ఇతర రాష్ట్రాలపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పొలిట్‌బ్యూరో హెచ్చరించింది.

రాజ్యాంగంలో ఆర్టికల్‌3 ప్రకారం ఏ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లునైనా అభిప్రాయం తెలుసుకునే నిమిత్తం సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి రాష్ట్రపతి నివేదించాల్సి వుంటుంది. కానీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రాంతాలు, సరిహద్దులు లేదా ప్రస్తుతమున్న రాష్ట్రాల పేర్లు మార్పుకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకోవడానికి అనుమతించే ఈ తీర్పు అనేక సమస్యలకు దారి తీస్తుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇది సమాఖ్యవాదానికి, ఎన్నికైన రాష్ట్ర అసెంబ్లీల హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది కూడా. సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రధాన తీర్పును, దానితో పాటే ఇచ్చిన మరో రెండు తీర్పులను కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత దీనిపై తమ వివరణాత్మకమైన ప్రతిస్పందన తెలియజేస్తామని పేర్కొంది.

ఏది ఏమైనా, ఈ తీర్పు వల్ల మన రాజ్యాంగ ఫెడరల్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది స్పష్టం. జాతీయ భద్రత, సమైక్యత పేరుతో ఏకపక్ష రాజ్య వ్యవస్థను బలోపేతం చేసేలా తీర్పు వుందని వ్యాఖ్యానించింది.

➡️