జిల్లా కేంద్రం.. అభివృద్ధికి దూరం

Apr 13,2024 21:27

ప్రజాశక్తి-పార్వతీపురం :  పార్వతీపురం నియోజకవర్గం జిల్లాకు కేంద్రమైనప్పటికీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరం . ఈ నియోజకవర్గాన్ని పరికించిచూస్తే విభిన్న సంస్కృతుల సమాహారంగా కనబడుతుంది. ఒడిషా సరిహద్దును ఆనుకొని ఉండడంతో పాటు, ఒక్కప్పుడు ఈ ప్రాంతం జయపురం మహారాజుల ఏలుబడిలో ఉండడం, ఆ తర్వాత జమిందార్ల పాలన వల్ల ఒడిషా జీవన సంస్కృతులు, భాషావైవిధ్యం, ఇక్కడ ప్రస్పుటంగా కన్పిస్తుంది. పార్వతీపురం మండలానికి అనుకుని ఉన్న గిరిజన గ్రామల ప్రజలు కూడా ఎక్కువగా ఒడియా భాష మాట్లాడటం ఇక్కడ ప్రత్యేకత. ఏజెన్సీ మండలాలకు ముఖద్వారంగా పార్వతీపురం పట్టణం ఉండడంతో ఆదివాసీలతో పాటు ఇతర ప్రాంత ప్రజలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంతో పాటుగా ఐటిడిఎ కార్యాలయం కూడా ఉండడంతో పరిపాలనా కేంద్రంగా విలసిల్లుతుంది. అన్ని ప్రాంతాలనూ అనుసంధిస్తూ రైల్వేస్టేషన్‌న్లు, జిల్లా కోర్టు, కేంద్ర ఆసుపత్రి కూడా పట్టణంలోనే ఉన్నాయి. దీంతో జిల్లా నలుమూలకు చెందిన ప్రజలు తమ అధికార కార్యక్రమాలతో పాటు, దినసరి వ్యవహారాలతో నిత్యం నియోజకవర్గ కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఉపాధి అవకాశాల కోసం చుట్టపక్కల గ్రామల నుంచి శ్రమజీవులు పట్టణంపైనే ఆధార పడుతుంటారు. నియోజక వర్గం చుట్టూ జంఝావతి, నాగావళి, సువర్ణముఖి నదులు ప్రవహిస్తుండడం వల్ల ఎక్కువ మంది కర్షకులు వ్యవసాయమే ప్రధాన జీవనం సాగిస్తున్నారు. నదులను సద్వినియోగం చేసుకుని ఆనకట్టలు లేకపోవడంతో నీరంతా సముద్రంలో కలుస్తుండగా, రైతులు వర్షాధారంగానే పంటలు పండించే పరిస్థితి. భౌగోళికంగా రాష్ట్రానికి శివారులో ఉండడం వల్ల అభివృద్ధిలో కూడా ఆఖరులో నిలిచింది. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాల్సిన పాలకుల నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గం పారిశ్రామికంగా ఒక్క అడుగువేయలేకపోయింది. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఒక్కంటంటూ ఒక్క పరిశ్రమ ఆనవాళ్లు కనబడకపోవడం ఇక్కడి ప్రత్యేకత. పరిశ్రమల్లేక పోవడంతో వ్యవసాయంపైనే ప్రజలు ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి. పట్టణంలో వివిధ వ్యాపారాలు నిర్వహించుకోడానికి గుజరాతీలు, మార్వాడీలు జిల్లా కేంద్రానికి తరలిరావడంతో నియోజకవర్గం వివిధ రాష్ట్రాల ప్రజలతో భిన్న సంస్కృతులతో విరజిల్లుతుంది.

నియోజకవర్గం ముఖచిత్రం

నియోజకవర్గం పరిధిలో పార్వతీపురం అర్బన్‌, రూరల్‌, బలిజిపేట, సీతానగరం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 1,87,854మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 92,655మంది, స్త్రీలు 95,188 ఇతరులు11 ఉన్నారు. 1967 తర్వాత నియోజకవర్గాల విభజన అనంతరం పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన 13 ఎన్నికలలో 6సార్లు టిడిపి, 3సార్లు కాంగ్రెస్‌, స్వతంత్య్ర పార్టీ 1, ఇండిపెండెంట్‌ 1చ జనతా1, వైసిపి ఒకసారి గెలుపొందాయి. నియోజకవర్గంలో పార్వతీపురం, సీతానగరం మండలాలకు సాగునీరు అందించేందుకు జంఝావతి జలాశయం నిర్మాణం చేపట్టి 50 ఏళ్లుగా పనులు జరుగుతున్నప్పటికీ లక్ష్యం మాత్రం ఇసుమంతకూడ నెరవేరక, సాగునీటి కోసం ప్రజలకు ఎదురు చూపులు తప్పడంలేదు. సీతానగరంలో పెద అంకలాం ఆనకట్ట, తోటపల్లి పిల్లకాలువల నిర్మాణాలు లేక సాగునీరందక రైతులు విలవిలాడుతున్నారు. ఇక విద్యారంగంలో కూడా నానాటికీ తీసికట్టుగానే ఉంది. విద్యాలయాలు ఏర్పాటు చేసి యువతను విద్యావంతులుగా మార్చాల్సిన ఈ ప్రాంతంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఎప్పుడో తాతలకాలంలో ఏర్పాటైన ప్రభుత్వం జూనియర్‌ కళాశాల తప్ప, డిగ్రీ, పిజీ కళాశాలలు ఏ ఒక్కటీ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలను ఇటీవలనే ప్రభుత్వం కళాశాలగా లాంఛనంగా మార్చారే తప్ప ప్రభుత్వ కళాశాలకు ఉండాల్సిన వనరులు పూర్తి స్థాయిలో సమకూర్చలేదు. కనీసం ఒక్క ఇంజినీరింగ్‌ కాలేజీ లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుట్టడం. దీని వల్ల విద్యార్థులు ఉన్నత చదువులను మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి వరహాలు గెడ్డ పార్వతీపురం పట్టణం గుండా ప్రవహించడంతో ప్రతి ఏటా ముంపు పట్టణానికి పెద్దసమస్యగా మారుతుంది. పట్టణం నడిబొడ్డున ఈ గెడ్డ ప్రవహించడంతో వ్యర్ధపదార్థాలకు నిలయమంగా మారి మురికి కూపంగా నిత్యం కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉంది. వైద్య పరంగా పేదలకు పెద్దదిక్కుగా మారిన జిల్లా కేంద్ర ఆసుపత్రి 200 పడకలకు అప్‌గ్రేడేషన్‌ అయినప్పటికీ, స్థలం కొరత వేధిస్తూ, విస్తరణకు నోచుకోవడంలేదు. అట్టహాసంగా ప్రారంభించిన సూపర్‌ స్పెషాలిటీ అసుపత్రి పునాది దశలోనే ఉంది. ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. బలిజిపేట, సీతానగరం మండలాల ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండే నారాయణపురం, గెడ్డలుప్పి వంతెనల నిర్మాణాలు పూర్తి కావచ్చినా పూర్తిస్ధాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటి ప్రభుత్వం విఫలమైంది. లచ్చయ్యపేట చెరకు కర్మాగారం మూతపడడంతో చెరకు సాగు చేసే రైతులు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు. పార్వతీపురం పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు తీర్చడానికి వెంకంపేట ఘోరీల నుండి కృష్ణపల్లి, ఎల్‌ఎన్‌పురం మీదుగా విక్రమపురం వరకు ప్రత్యామ్నయ రహదారి నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినా, ప్రస్తుత ప్రభుత్వం అలాంటి ఉద్ధేశం ఏమీలేనట్లుగా వ్యవహరించింది. నియోజకవర్గం అభివృద్ధిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం ప్రదర్శించిందో, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం కూడా అభివృద్ధి మాటే మరిచిపోయింది. దీనికి తోడు గత ఐదేళ్లలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాల బారిన పడి, రాజకీయ నాయకుల దోపిడికీ గురయ్యాయి. పారిశ్రామిక అభివృద్ధి ఏదీ?గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాల్సిన పాలకుల నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గం పారిశ్రామికంగా ఒక్క అడుగువేయలేకపోయింది. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఒక్కంటంటూ ఒక్క పరిశ్రమ ఆనవాళ్లు కనబడకపోవడం ఇక్కడి ప్రత్యేకత.

1967 మరిశర్ల వెంకటరామినాయుడు (స్వతంత్రపార్టీ)

1972 చీకటి పరశురాం నాయుడు (ఇండిపెండెంట్‌)

1978 చీకటి పరశురాం నాయుడు (జనతాపార్టీ)

1983 మరిశర్ల వెంకటరామినాయుడు (టిడిపి)

1985 మరిశర్ల వెంకటరామినాయుడు (టిడిపి)

1989 యర్రా కృష్ణమూర్తి నాయుడు (టిడిపి)

1994 యర్రా కృష్ణమూర్తి నాయుడు (టిడిపి)

1996 యర్రా అన్నపూర్ణమ్మ ఉప ఎన్నిక (టిడిపి)

1999 మరిశర్ల శివున్నాయుడు (కాంగ్రెస్‌)

2004 శతృచర్ల విజయరామరాజు (కాంగ్రెస్‌)

2009 సవరపుజయమణి (కాంగ్రెస్‌ )

2014 బొబ్బిలి చిరంజీవులు (టిడిపి )

2019 అలజంగి జోగారావు (వైసిపి)

➡️