కష్టజీవి

Jan 5,2024 08:29 #sahityam

పొద్దేళకే సాప సుట్టేసి

పై సూరొంక ఒకతూరి

కళ్ళార్పకుండా సూడాలి

సెదలెక్కిన కట్టేడ్పుని

ఓదార్చి దొడ్లోకి అడుగెయ్యాల.

కష్టజీవంటే

ఉత్తుత్తి మాటలెక్కనగాదు

రాళ్ళ ధాటికి

మునిగిపోయిన సెలకని

సదును చేసి నవ్వించాలి

బొట్లు బొట్లుగా

రాలిపడతాండే సెమట సుక్కల్తో

మొక్కను బతికించాల.

రాళ్ళను మలిచి

బొమ్మలెక్కన పాణం పొయ్యాల

నాలుగంచులా రాతిని కూర్చి

గూడుకు పునాదులెయ్యాల

నారపోగుల్ని ఏకం చేసి

బారెడు పగ్గాన్కి నూనె పూయాల

కష్టజీవంటే

ఓట్లకు నోటి మాటల్కి

నోట్ల కట్టల్కి బలిపశువు కాదు

నిఖార్సైన శ్రమజీవి.

నాల్గు మెతుకులకు

వీళ్ళే పాలనాధికారులు

ఆకల్ని చంపేసే రక్షణాధికారులు.

కలుపు మొక్కల ఎక్కిరింతల్ని

ఓపిగ్గా భరించాల

పీచుకాయల తండ్లాట చూసి

కన్నీటికి ఆనకట్టలెయ్యాల

అరువు బరువుని నెత్తినెట్టుకుని

అడుగుల్ని సాగదీయాల

కష్టజీవులంటే

కాళ్ళు మడచని యంత్రంలాంటోళ్ళు.

– నరెద్దుల రాజారెడ్డి, సెల్‌ : 9666016636

➡️