విభిన్నంగా.. విస్తారంగా …

Feb 6,2024 10:08 #feature

ఎన్ని అవరోధాలు ఎదురైనా ఉన్నత లక్ష్యాలు చేరేవారు ఎంతోమంది ఉంటారు. వైకల్యంతో బాధపడుతున్నా ఉన్నత శిఖరాలు అధిరోహించేవారూ కనపడతారు. కాళ్లు, చేతులు సహకరించకపోయినా, చక్రాల కుర్చీకే పరిమితమైనా ఆటల్లో, చదువుల్లో రాణించేవారు కోకొల్లలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వ్యక్తులు ఈ కోవలోకే వస్తారు. అయితే వీరు కొంచెం భిన్నంగా ఆలోచించారు. వాళ్లు ఏం చేశారు? ఎలా చేశారు? తెలుసుకుందాం.

                అహ్మదాబాద్‌లో పుట్టి పెరిగిన శివమ్‌ పుట్టుకతోనే హోకొమిలియా సిండ్రోమ్‌ బాధితుడు. ఈ వ్యాధి గల వ్యక్తులకు కాళ్లు, చేతులు సరిగ్గా ఎదగవు. అలా శివమ్‌ రెండు కాళు,్ల పాదాలు లేకుండా ఉంటాయి. అలాగే చేతులకు మూడు వేళ్లే ఉంటాయి. అయితే ఈ వైకల్యం శివమ్‌ ఫ్యాషన్‌ని ఎంతమాత్రం నిరుత్సాహపర్చలేదు. దేశమంతా బైక్‌పై తిరిగేయాలని శివమ్‌ ఆశ. ఆ కలకు అతని వైకల్యం అడ్డుకాకూడదు అనుకున్నాడు. అంతే.. ఇప్పుడు రోడ్డుపై బైక్‌లో సాధారణ వ్యక్తిలా తిరిగేస్తున్న శివమ్‌ను చూసి ఆశ్చర్యపోని వారు ఉండరు. ఈ 26 ఏళ్ల యువకుడు ఒక్క రోడ్డు ట్రిప్స్‌తోనే ఆగలేదు. జిప్‌ లైనింగ్‌, పారాగ్లైడింగ్‌, స్కైడైవింగ్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. ‘మిమ్మల్ని మీరు నమ్మడమే మీ విజయానికి కారణం’ అని చెప్పే శివమ్‌ బుల్లెట్‌ బండిపై చాలా స్వల్ప కాలంలోనే అహ్మదాబాద్‌ నుండి లడక్‌ వరకు ప్రయాణించేశాడు.

59 దేశాలు చుట్టొచ్చింది..

                  ప్రపంచ దేశాలు చుట్టి వస్తున్న పర్విందర్‌ చావ్లా, స్కూల్లో చదువుకునే వయసు నుండే హ్యుమటాయిడ్‌ అర్థరైటిస్‌తో బాధపడుతోంది. విపరీతమైన కీళ్ల నొప్పులతో అడుగుతీసి అడుగు వేయలేనంత బాధ అనుభవిస్తోంది. అయితేనేం ఇప్పటివరకు ఏకంగా 59 దేశాలు చుట్టి వచ్చింది. వీల్‌ ఛైర్‌లోనే ఇవన్నీ తిరిగింది అంటే ఎవరూ నమ్మరు. ‘సహాయం అడగడానికి ఎప్పుడూ వెనకాడవద్దు. వైకల్య బాధితులని ప్రపంచం భయపెట్టినా, ఎక్కడో ఓ చోట సాయం చేసేవారు ఉంటారు. ఆశ ఎప్పుడూ కోల్పోకండి’ అని చెబుతోంది.

100 రోజుల మిషన్‌లో..

                   హ్యుమటైడ్‌ అర్థరైటిస్‌తోనే బాధపడుతున్న రెన్సీ థామస్‌ గంగానదిని 100 రోజుల పాటు నావిగేట్‌ చేసే ఓ మిషన్‌లో పాల్గొని సాధారణ వ్యక్తులకు ఎంతమాత్రం తీసిపోనని నిరూపించాడు. ‘మీ కలను సాకారం చేసుకోవడానికి మిమ్మల్ని మీరే ముందుకు తీసుకెళ్లండి. అప్పుడే లక్ష్యం చేరుకోగలరు’ అని చెబుతున్నారు.

తనతో పాటు వందలమందిని..

                  మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ప్రీతీ విశ్వకర్మకు ఓ కల ఉంది. ఆ కల నెరవేర్చుకోవాలంటే ఆమె ప్రపంచం చుట్టేయాలి. ‘అది నీకు సాధ్యం కాదు. నీ వల్ల కాదు’ అన్న మాటలే ఆమెకు ఎదురయ్యేవి. అయితే మూర్ఛ రోగులు ఇంటికే పరిమితమవ్వాలనే ధోరణి నుండి పూర్తిగా బయటపడి, సొంతంగా ‘వుమానియా ఆన్‌ రోడ్‌ ట్రిప్స్‌’ అనే ట్రావెల్‌ ఏజెన్సీ స్థాపించింది. తను ప్రయాణించలేని సుదూర ప్రాంతాలకు ఎంతోమందిని తన ఏజెన్సీ ద్వారా పంపిస్తున్నారు. అంతేకాదు, వారితో పాటు తాను కూడా వెళుతోంది. ప్రత్యేకంగా వైకల్య బాధితుల ప్రయాణాలపై శ్రద్ద పెట్టడం, వారి రక్షణ, ప్రయాణ జాగ్రత్తలు, ముఖ్యంగా అవసరమైన వసతులు కల్పించడంలో వుమానియా సంస్థ చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎంచుకున్న మార్గంలో ప్రయాణించడం ఆషామాషీ కాదు. ముఖ్యంగా వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అయినా వాటన్నింటినీ అధిగమించి, సాధారణ వ్యక్తులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్న ఈ వైకల్యబాధితులు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు.

➡️