బరిలో మాజీ సీఎంల వారసులు !

Apr 24,2024 00:20 #Descendants, #former CMs
  • ఐదు ప్రధాన పార్టీల నుండి 8 మంది పోటీ..

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో వచ్చే నెల 13న జరగనున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రుల తనయులు పలువురు …పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు 8 మంది పోటీ చేస్తున్నారు. వీరు కాంగ్రెస్‌, బిజెపి, వైసిపి, టిడిపి, జనసేనల తరపున బరిలో ఉన్నారు. వారిలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు జిల్లా డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇండియా బ్లాక్‌ తరపున కాంగ్రెస్‌ అభ్యర్థి జి మద్దిలేటిలతో ఢ కొంటున్నారు. టిడిపి వ్యవస్థాపకులు, సినీ నటులు నందమూరి తారక రామారావు 1983- 1995 మధ్య పలు దఫాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన కుమారుడు నందమూరి బాలకష్ణ 2014, 2019 ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అక్కడి నుండే పోటీలో ఉండి హ్యాట్రిక్‌ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనపై వైసిపి నుంచి దీపిక, ఇండియా బ్లాక్‌ తరపున కాంగ్రెస్‌ నుంచి ఇనరుతుల్లా తలపడుతున్నారు. ఇదే నియోజకవర్గం నుండి నందమూరి తారక రామారావు, ఆయన పెద్ద కుమారుడు నందమూరి హరికష్ణ అంతకుముందు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎన్టీఆర్‌ మూడో కుమార్తె దగ్గుపాటి పురంధరేశ్వరి టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున రాజమండ్రి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. అక్కడ వైసీపీ నుంచి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, ఇండియా బ్లాక్‌ నుండి మాజీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పోటీలో ఉన్నారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తనయుడు, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి జనసేన-టిడిపి-బిజెపి కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి గెలిచిన మనోహర్‌… ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే ఏ శివకుమార్‌, ఇండియా బ్లాక్‌ తరపున పోటీలో ఉన్న ఎస్‌కె బాసిత్‌లతో తలపడుతున్నారు. 1990- 1992 మధ్య కాలంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి వైసీపీ నుంచి.బరిలో దిగారు. ఇక్కడ ఆయన మాజీ ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్థి కురుగుండ్ల రామకష్ణ, ఇండియా వేదిక తరపున కాంగ్రెస్‌ అభ్యర్థి పి శ్రీనివాసరావులపై పోటీచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1996 – 2019 మధ్య పలు దఫాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన తనయుడు నారా లోకేష్‌ 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అయితే శాసనమండలిలో ఆయనకు సభ్యత్వం కల్పించి క్యాబినెట్‌లోనూ అవకాశమిచ్చారు. తాజా ఎన్నికల్లో లోకేష్‌ మరోసారి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి ఎం.లావణ్య, కాంగ్రెస్‌ వేదిక తరపున సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్‌ ప్రధాన ప్రత్యర్ధులుగా ఎన్నికల రంగంలో ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పులివెందుల నుంచి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి బీటెక్‌ రవి బరిలోకి దిగారు. ఆయన గత ఎన్నికల్లోనూ జగన్‌తో తలపడ్డారు. ఇక్కడ ఇండియా వేదిక తరపున కాంగ్రెస్‌ నుండి మూలంరెడ్డి ధృవకుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారు. కడప పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుత వైసిపి.,ఎంపి, ఆమె సోదరుడైన వైఎస్‌ అవినాష్‌రెడ్డి, టిడిపి-బిజెప-జనసేన కూటమి అభ్యర్థి భూపేష్‌రెడ్డిలతో ఆమె తలపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో…ఇలా.. మాజీ ముఖ్యమంత్రుల వారసులు పోటీలో ఉండడం ఆసక్తికరంగా మారింది.

➡️