కూల్చివేతలే వైసిపి పాలన

Apr 13,2024 21:16

ప్రజాశక్తి- విజయనగరం కోట : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూల్చివేతలే పరిపాలనగా పెట్టుకుందని టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శనివారం 30వ డివిజన్‌ కొత్త ధర్మపురి, బిసి కాలనీ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన సైకో పాలనా రాష్ట్రంలో విధ్వంసాలు చేసుకుంటూ పోయిందని అన్నారు. ధరలు, పన్నులు పెంచి ప్రజల బతుకులను కూడా కూల్చివేశారని అన్నారు. పారిశ్రామిక అభివద్ధి జరగకపోవడంతో ఉపాధి అవకాశాల లేక యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ద్వారపూడిలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1 మెగా వాట్‌ సోలార్‌ ప్లాంట్‌ ను వైసిపి పాలకులు ధ్వంసం చేసి రోజుకు సుమారు 4500 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తిని రాకుండా చేయడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. క్రీడాకారుల కోసం విజ్జి స్టేడియంలో నిర్మించిన ఇండోర్‌ స్టేడియం ను నిరుపయోగంగా వదిలేయడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. ఇలాంటి విధ్వంసాల పాలనను ఎదుర్కొనేందుకు టిడిపి, జనసేన, బిజెపి కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, విజయనగరం పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు కార్యదర్శి గంటా పోలినాయుడు, బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు , అవనాపు విజరు , పిల్లా విజరు కుమార్‌ గాడు అప్పారావు, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️