నకిలీల నడుమ ప్రజాస్వామ్యం

Dec 25,2023 11:13 #Democracy, #PM Modi
  • ఫేక్‌ వార్తలు, క్లెయిమ్‌లతో తప్పుడు సమాచారం
  • మోడీ పాలనలో అర్థం మారిన డెమోక్రసీ
  • ప్రజలపై ప్రభుత్వానిది చిన్న చూపు
  • సామాజిక కార్యకర్తలు, మేధావుల ఆందోళన

ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడుతున్నది. 140 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి అర్థం మారిపోతున్నది. కల్పిత వార్తలు, తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా, కేంద్రంలోని మోడీ పాలనలో అసలైన ప్రజాస్వామ్యానికి అర్థం మారిపోయి తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నదని సామాజిక కార్యకర్తలు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో ప్రజలను చిన్న చూపు చూస్తున్న విధానమే ఇందుకు నిదర్శనమని వారు అంటున్నారు.

న్యూఢిల్లీ :    మోడీ పాలనలో ప్రజా, పత్రికా స్వేచ్ఛ హరించుకుపోయిందనీ, పలు దేశీయ, విదేశీ సంస్థల నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయన్నాయి. ప్రజాస్వామ్యమంటే తమ పాలనేననీ, గత ప్రభుత్వాల కంటే తమ ప్రభుత్వంలోనే ఇది వెలుగొందుతున్నదని మోడీ సర్కారు చెప్పుకుంటున్నది. అయితే, ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే ప్రధానమనీ, కానీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఇందుకు వారు అనేక సందర్భాలనున గుర్తు చేస్తున్నారు.

కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందాలని మోడీ సర్కారు అనేక అడ్డదారుల్లో ప్రయాణిస్తున్నదనీ, ప్రజాస్వామ్య దేశానికి ఇదేమీ మంచి పరిణామం కాదని విశ్లేషకులు అంటున్నారు.  ‘బేటీ బచావో-బేటీ పడావో’ అంటూ మహిళా సాధికారత విషయంలో మాటలు చెప్పే మోడీ ప్రభుత్వం.. చేతల్లో దానిని విస్మరిస్తున్నదని చెప్తున్నారు. దేశంలో మహిళా రెజ్లర్ల ఆందోళనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు అంటున్నారు. వార్తలు, లోతైన ఫేక్‌ న్యూస్‌, క్లెయిమ్‌లు, కౌంటర్‌ క్లెయిమ్‌లు వంటి గందరగోళం మధ్య, నకిలీ, నిజమైన ప్రజాస్వామ్యాల మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టంగా మారుతున్నదని సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు.

ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు, పత్రికలు, మేధావులు, విమర్శకుల పాత్ర చాలా కీలకం. అయితే, బీజేపీ పాలనలో మాత్రం వారికి తగిన స్థానం దక్కటం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశం అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించటమే ప్రధానమనీ, అలా ప్రశ్నించిన వారి గొంతు నొక్కితే అది ఆ దేశానికే ప్రమాదమని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో పెద్ద ఎత్తున ఎంపీల సస్పెండ్‌ను వారు ఉటంకిస్తున్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను సామాజిక మాధ్యమాల్లో ‘బఫూన్లు’గా చేసి చూపిస్తూ బీజేపీ సోషల్‌ మీడియా విభాగం, దాని అనుబంధ వార్త ఛానెళ్లు ఆనందం పొందుతున్నాయనీ, ఇలా చేస్తే బీజేపీకి తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చేమో కానీ కోట్లాది మంది ప్రజలున్న భారతదేశానికి ఇది చాలా ప్రమాదకరమని మేధావులు అంటున్నారు. ప్రజాస్వామ్యమన్న పదం చాలా విలువైనదనీ, దానిని ప్రతి ఒక్క చోటా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్తున్నారు.

ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదంపై మోడీ సర్కారు ఏకపక్ష తీరు కూడా ఆందోళన కలిగిస్తున్నదని అంటున్నారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో విమర్శలు, పోస్టులు చేస్తే కొందరు అరెస్టు అయిన విషయాన్ని సామాజిక కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. మోడీ సర్కారు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటమే ఇందుకు కారణమనీ, ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో ఇదేరకమైన వ్యవహారమని మేధావులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ సర్కారు తన నిర్ణయాన్ని సమర్థించుకోవటంలో భాగంగా తన ఐటీ సెల్‌ విభాగంతో సోషల్‌ మీడియాలో విరివిగా నకిలీ వార్తలు, కథనాలు, పోస్ట్‌లతో ప్రజల మెదళ్లను కలుషితం చేస్తున్నదనీ, మోడీ సర్కారు నిర్ణయాలేవైనా సాహసోపేతమైనవంటూ కట్టుకథలు రాసుకొస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.

➡️